రామోజీ ఫిలింసిటీ అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోండి
గవర్నర్ సలహాదారుకు గోనె ఫిర్యాదు
హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీ ప్రధానద్వారం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్‌కు ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఫిలింసిటీ ప్రధాన ద్వారం నిర్మాణం కారణంగా అనాజ్‌పూర్ గ్రామస్తులు పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నారని, దీనిపై సంబంధిత ఆర్డీవోకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదని గోనె ఆ వినతిపత్రంలో వివరించారు. అలాగే, తెలంగాణ ప్రాంతంలో లక్ష కోట్ల విలువైన భూమి ఆక్రమణలకు గురైందని, వీటిపై చర్యలు తీసుకోవాలని కూడా గోనె కోరారు. మాజీ ఎంపీ మధుయాష్కీ ఫోర్జరీ సర్టిఫికెట్ల వ్యవహారంలోనూ కేసు నమోదు చేయాలని సలావుద్దీన్ అహ్మద్‌కు గోనె ప్రకాశరావు మరో వినతిపత్రం అందజేశారు