రక్తదారులు..
♦ చిత్తూరు జిల్లాకు చెందిన
♦ ఇద్దరు పుష్కర భక్తులు మృతి
♦ ముగ్గురికి తీవ్రగాయాలు
ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న గూడ్స్ వ్యాన్
పుష్కర స్నానం చేస్తే పుణ్యం సిద్ధిస్తుందనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన కొందరు ఆ స్నానాలు చేయకుండానే మృత్యువాత పడగా.. మరికొందరు స్నానాలు ఆచరించి వెళుతుండగా ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వెళుతున్న వారిని వెనుక నుంచి లారీ ఢీకొట్టగా ఓ మహిళ.. ఆగి ఉన్న పుష్కర భక్తుల వాహనాలను గూడ్స వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు.. ఐషర్ వ్యాన్ బలంగా ఢీకొట్టిన సంఘటలో ఓ వ్యక్తి, కారు ఢీకొని మరో వ్యక్తి ఇలా బుధవారం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అన్ని చోట్ల అతి వేగంగా దూసుకొచ్చిన వాహనాలే ఈ ప్రమాదాలకు కారణమయ్యాయి.
ఐషర్ వ్యాన్ ఢీకొని..
గొల్లప్రోలు : చెందుర్తి శివారు కొత్తవజ్రకూటం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన పుష్కరయాత్రికుడు బొంతు శ్రీనివాసరావు(40) మృతి చెందాడు. బొలేరో వాహనంలో కుటుంబసభ్యులతో బయల్దేరిన శ్రీనివాసరావు వర్షం వస్తుందని వజ్రకూటం జంక్షన్లో టార్పాలిన్ సర్దుతుండగా వెనుక నుంచి వచ్చిన ఐషర్వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడిది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బొంతుపేట. పుష్కరస్నానం చేయకుండానే మార్గమధ్యలో ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబసభ్యులు రోదనలతో ఆప్రాంతం మార్మోగింది. సంఘటన స్థలాన్ని గొల్లప్రోలు పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కిర్లంపూడి : వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ వ్యాన్ ఆగి ఉన్న పుష్కర భక్తుల వాహనాలను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడి జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జరిగిన ఈ సంఘటన వివరాలు కిర్లంపూడి ఎస్సై కథనం ప్రకారం..
చిత్తూరు జిల్లా సోమాల మండలం, సోమాలగ్రామానికి చెందిన పదిమంది పుష్కర భక్తులు ట్రవేరా వాహనంలో రాజమండ్రి పుష్కర స్నానానికి వచ్చారు. అక్కడి నుంచి వారు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి బయల్దేరారు. మార్గ మధ్యలో బూరుగుపూడి గ్రామం వద్ద డ్రైవర్ వాహనాన్ని జాతీయరహదారి పక్కన నిలిపి టీ తాగేందుకు వెళ్లాడు. ఇంతలో అనంతపురం జిల్లాయడికి గ్రామానికి చెందిన పుష్కర భక్తులు తూఫాన్వాహనంలో రాజమండ్రి బయలుదేరి బూరుగుపూడి చేరుకున్నారు. ఈ డ్రైవర్ తూఫాన్ వాహనాన్ని ట్రవేరా వెనుక నిలిపి టీ తాగేందుకు వెళ్లాడు.
వేగంగా దూసుకొచ్చి...
ఇంతలో గూడ్స్‌వ్యాన్(ఏపీ 28 టీడీ 1229) వేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న తూఫాన్కారును ఢీ కొట్టింది. ఆ వాహనం వెళ్లి ముందున్న ట్రవేరా కారును బలంగా తాకింది. దీంతో ఆవాహనంలో ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు వడ్డిపల్లి వెంకటలక్ష్మి(60), వడ్డిపల్లి కుమారి(45) తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందారు. వెంకటలక్ష్మి భర్త గంగయ్యకు తీవ్రగాయాలయ్యాయి.
తూఫాన్
తూఫాన్ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న తిరుపురం రంగస్వామి, తిరుపురం భాగ్యలక్ష్మిలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. హైవే అథారిటీ వాహనంలో క్షతగాత్రులను, మృత దేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రంగస్వామి, భాగ్యలక్ష్మిలను మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిత్తూరు జిల్లాకు చెందిన గంగయ్యకు ప్రత్తిపాడులో చికిత్స అందించారు. చిత్తూరు జిల్లా సోమాల గ్రామానికి చెందిన మల్లారపు వెంకట రమణ ఫిర్యాదు మేరకు కిర్లంపూడి ఎస్సై బీవీ రమణ కేసు నమోదు చేశారు. శవపరీక్ష అనంతరం వెంకటలక్ష్మి, కుమారిల మృతదేహాలను అంబులెన్స్‌లో చిత్తూరు జిల్లాకు తరలించారు.