కిరాణాకొట్లతో అమెజాన్ సరుకుల రవాణా!
అమెజాన్ డాట్ ఇన్.. ప్రస్తుతం భారతదేశంలో శరవేగంగా దూసుకెళ్తున్న ఈ కామర్స్ సైట్. స్థానికంగా ఉండే కిరాణా కొట్లను కూడా తన నెట్‌వర్క్‌లో చేర్చుకోవాలని ఇప్పుడు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. తమ వ్యాపారంలో కిరాణాకొట్లను కూడా చేర్చాలనుకుంటున్నట్లు అమెజాన్ తనకు తెలిపిందని, తమ సరుకులను కిరాణాకొట్ల ద్వారా రవాణా చేస్తామని, దానివల్ల ఆయా కొట్లకు ఎక్కువ మంది వచ్చి, వాళ్ల వ్యాపారం కూడా పెరుగుతుందని అమెజాన్ ప్రతినిధులు వివరించినట్లు మంత్రి చెప్పారు.
అమెజాన్ ఇండియా ఎండీ అమిత్ అగర్వాల్ తదితరులు రవిశంకర్ ప్రసాద్‌ను మంగళవారం కలిశారు. భారతదేశంలో తమ డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అమెజాన్ ప్రతినిధులు ఆయనకు చెప్పారు. ఆ నిర్ణయాన్ని తాము సాదరంగా స్వాగతిస్తామన్నారు.