Government Development
-
ఉద్యమంలా సర్వే
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులపై ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ గంగాధర కిషన్ కోరారు. తెలంగాణ వ్యాప్తంగా తలపెట్టిన ఈ సర్వే.. ప్రభుత్వం భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలకు ప్రధాన ఆధారమవుతుందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా చేపడుతున్న ఈ సర్వేలో ప్రజలు, అధికారులు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వేపై జిల్లా కలెక్టర్ జి.కిషన్ కలెక్టరేట్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘ప్రతి తెలంగాణ పౌరుడు సర్వే కార్యక్రమంలో పాల్గొని వ్యక్తిగత, కుటుంబ వివరాలు అంద జేయాలి. తద్వారా బంగారు తెలంగాణ ఏర్పాటులో తోడ్పాటు అందించినట్లు అవుతుంది. తెలంగాణ పౌరులుగా గుర్తింపు పొందడం, ప్రభుత్వ పథకాలను వినియోగించుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. సమాచార సేకరణ కోసం మీ దగ్గరికి వచ్చే ప్రభుత్వ సిబ్బందికి కచ్చితమైన సమాచారం ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు ఉంటాయి. ఉద్యమంలా సాగుతున్న సర్వేకు అందరూ సహకరించాలి’ అని కలెక్టర్ కోరారు. జిల్లాలోని మొత్తం 3256 ఆవాస ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తామని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సంఖ్యను కేటాయిస్తామని తెలిపారు. ఇది కుటుంబ సర్వే అని, ఇళ్లు(ఆవాసం) ఉన్న వారి వివరాలను మాత్రమే సేకరిస్తామని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించే 19వ తేదీన ప్రభుత్వం సెలవుగా ప్రకటించిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో లోపాలున్నాయన్న భావనతో ప్రభుత్వం ఈ సమగ్ర సర్వేకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. సర్వే అధికారులకు ప్రజలు వాస్తవ వివరాలు ఇచ్చి సహకరించాలని, దీని వల్ల అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో విృ్తత ప్రచారం నిర్వహిస్తున్నామని, విద్యార్థులతో ర్యాలీలు, గ్రామాల్లో చాటింపు ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు ప్రత్యేకంగా ఒక ప్రత్యేక సంఖ్య(యునిక్ నెంబర్)ను కేటాయిస్తామని చెప్పారు. ఈ ప్రత్యేక సంఖ్య భవిష్యత్తులో అన్ని అంశాలకు ఉపయోగపడుతుందని అన్నారు. స్థానికంగా లేకుంటే... ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ వివరాలు సేకరించడానికి వచ్చే ప్రభుత్వ సిబ్బందికి అందుబాటులో ఉండాలని కలెక్టర్ కోరారు. ఉపాధి, విద్య, ఇతర అవకాశాలపై ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్నవారు సర్వే రోజున సొంత ఇళ్లలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇది వీలుకాని సందర్భంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి సంబంధించిన రుజువులు(ధ్రువీకరణ పత్రాలు) అధికారులకు చూపిస్తే సరిపోతుందని తెలిపారు. ఒక కుటుంబంలోని కొందరు వ్యక్తులు, సర్వే రోజు ఏదైనా కారణంతో స్థానికంగా అందుబాటులో లేనట్లయితే అందుకుగల కారణాలు రుజువుతో సహా చూపివారి వివరాలు నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఉదాహరణకు ఇతర రాష్ట్రాల్లో చదివే వారు వారి ఐడీ కార్డు, సీట్ అలాట్మెంట్ లెటర్, ఇతర దేశాలకు వెళ్లినవారు వారి పాస్‌పోర్టు వివరాలు చూపి వారి వివరాలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాలో 9,39,731 కుటుంబాలు ఉంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో 7,47,786 కుటుంబాలు, పట్టణ ప్రాంతంలో 1,89,945 కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. సమగ్ర సర్వేకు వివరాలు సేకరించే సిబ్బందికి ఈ నెల 7న మున్సిపల్, మండల స్థాయిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ తరహాలోనే సర్వేలో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందిని గ్రామాలకు తరలించేందుకు 1500 వాహనాల వినియోగించనున్నట్లు చెప్పారు. -
నిర్లక్ష్యం
ప్రొద్దుటూరు టౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులు కంపచెట్లల్లో పడేశారు. ఇందులో చాలా వరకు మందులు ఇంకా కాలం చెల్లనివి, ఉండగా మరి కొన్ని కాలం చెల్లినవి కూడా కనిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు పట్టణంలోని మడూరు రోడ్డు వీదుగా హౌసింగ్ బోర్డుకు వెళ్లే రహదారి పక్కన ఉన్న కంపచెట్లలో పెద్ద ఎత్తున మందులు కనిపించాయి. కాలం తీరిన మందులు ఎవరైనా ఎజెన్సీల వారు పడేసి ఉంటారని వాటిని పరిశీలించగా అందులో అన్నీ ప్రభుత్వం సరఫరా చేసిన మందులే ఉన్నాయి. విటమిన్ మాత్రలు, సిర ప్లు, గర్భం నిర్ధారణ చేసే స్లిప్‌లు, సిరంజిలు ఎక్కువగా కనిపించాయి. ప్యారాసిటమాల్ ఓరల్ సస్పెన్షన్ ఐపీ బ్యాచ్ నెంబర్ 15033బీజీ139 ఉన్నాయి. ఇవి 2015 ఏప్రిల్ నెల వరకు ఉపయోగించగలిగినవి ఉన్నాయి. అలాగే ఆల్బిల్డాజోల్ ట్యాబ్లెట్లు, విటమిన్ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు, విటమిన్ ఏ అండ్ డీ ట్యాబ్లెల్లు పెద్ద ఎత్తున పడేసి ఉన్నాయి. వీటన్నిటికి ఈ ఏడాది డిసెంబర్ వరకు కాలపరిమితి ఉంది. కంపచెట్లలోకి ఎలా వచ్చాయి.... ప్రభుత్వం ఆసుపత్రులకు సరఫరా చేస్తున్న మందులు రోడ్లపై, కంపచెట్లల్లోకి ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు విచారణ చే యాల్సి ఉంది. ప్రభుత్వం సరఫరా చేసే మందుల బ్యాచ్ నెంబర్ల ఆధారంగా అవి జిల్లా ఆసుపత్రి మందులా లేక, అర్బన్ హెల్త్ సెంటర్లకు సరఫరా చేసిన మందులా, మండల పరిధిలోని ఆసుపత్రులకు సరఫరా చేస్తున్న మందులా అన్న విషయాన్ని తేల్చాల్సి ఉంది. కాలం ఉన్నా రోడ్లపై పడేయడానికి గల కారణాలపై కూడా అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉంది. ప్రభుత్వం సరఫరా చేసిన మందులు కాలం తీరినా కూడా అవి రోడ్లపై పడేయటానికి వీలు లేదని వైద్యులు చెబుతున్నారు. వాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించి వేరే మందులు పొందాలని నిబంధన ఉంది. అలాంటి ది మందులను రోడ్లపాలు చేసిన వారిని ఉన్నతాధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. -
సిమెంటుకు తయారీ మంట!
భారంగా విద్యుత్, బొగ్గు, రవాణా చార్జీలు - తప్పనిసరి పరిస్థితుల్లో ధర పెంపు - ధర పెంచకపోతే ప్లాంట్ల మూసివేతే - రైల్వే చార్జీలతో మరోసారి పెంచాల్సివస్తోంది - ‘సాక్షి’తో సిమెంటు కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ వ్యయం అంతకంతకూ పెరుగుతుండడంతో సిమెంటు కంపెనీలకు పాలుపోవడం లేదు. ముడి పదార్థాలు, విద్యుత్, బొగ్గు, రవాణా వ్యయాలు, బ్యాంకు వడ్డీలు ఏడాదికేడాది భారంగా పరిణమిస్తున్నాయి. దీంతో సిమెంటు తయారీ వ్యయం అదే స్థాయిలో దూసుకెళ్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు ప్లాంట్లు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ధర పెంచకపోతే మరిన్ని ప్లాంట్ల మూసివేత తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేస్తున్నాయి. నష్టాల నుంచి గట్టెక్కాలంటే ధర పెంచక తప్పలేదని పేర్కొంటున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు రైల్వే సరుకు రవాణా చార్జీలు తాజాగా 6.5 శాతం పెరిగాయి. పరిశ్రమకు మరింత భారం పడ్డట్టేనని, దీని ప్రభావంతో మరోసారి ధర పెంచక తప్పదని కంపెనీలు అంటున్నాయి. దూసుకెళ్తున్న వ్యయం.. సిమెంటు తయారీకి రూ.155-165, ఎక్సైజ్ పన్ను రూ.41, వ్యాట్ రూ.46, రవాణా రూ.55-80 కలుపుకుంటే మొత్తం వ్యయం ఒక్కో బస్తాకు రూ.297-332 అవుతోంది. దీనికి హ్యాండ్లింగ్ చార్జీలు, డీలర్/ఏజెంట్ కమిషన్ అదనం. భారీ పెట్టుబడితో కూడుకున్న రంగం కాబట్టి బస్తా అమ్మకం ధర రూ.300 లోపు ఉంటే కంపెనీలకు నష్టమేనని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. డిమాండ్ తక్కువగా ఉండడంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించి వేశాయి. అయితే స్థిర వ్యయాలైన తరుగుదల, వడ్డీ, పరిపాలన తదితర వ్యయాలు మిగిలిన ఉత్పత్తిపై ప్రభావం చూపడంతో సిమెంటు ధర పెరిగేందుకు ఒక కారణమవుతోంది. మూడేళ్లలో విద్యుత్ చార్జీలు 70% దాకా పెరిగాయి. ఇక నాణ్యమైన బొగ్గు కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇండోనేసియా నుంచి దిగుమతైన బొగ్గు టన్నుకు నాలుగేళ్ల క్రితం రూ.4 వేలుంటే, నేడు రూ.5 వేలకు చేరుకుంది. దేశీయ బొగ్గు కొరత కారణంగా టన్నుకు రూ.3,750 నుంచి రూ.5,500లకు చేరిం ది. డీజిల్ లీటరుకు రూ.44 నుంచి రూ.61కి చేరింది. దీంతో సిమెంటు ధర కూడా హెచ్చించాల్సివస్తోందని కంపెనీలు వాపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల కంటే తక్కువే.. సమైక్య రాష్ట్రంలో గతేడాది జూలై ప్రాంతంలో సిమెంటు ధర బస్తాకు (50 కిలోలు) రకాన్నిబట్టి రూ.320 దాకా వెళ్లింది. అది కాస్తా తర్వాతి నెలల్లో రూ.200-235కు వచ్చి చేరింది. సిమెంటుకు గిరాకీ లేకపోవడమే ధర క్షీణతకు కారణం. 2014 మే నుంచి ధరల్లో పెరుగుదల వచ్చింది. సీమాంధ్ర, తెలంగాణలో ఒక దశలో బస్తా ధర రూ.340 దాకా వెళ్లినప్పటికీ తిరిగి రూ.300-325 మధ్య ప్రస్తుతం నిలకడగా ఉంది. ఉత్తరాదితోపాటు ఇతర రాష్ట్రాల్లో ఒక్కో బస్తాకు రూ.380 వరకు ధర ఉందని ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమిళనాడులో రూ.370-380, కేరళలో రూ.370, కర్ణాటకలో రూ.350 వరకు ఉందని పేర్కొన్నారు. అటు మహారాష్ట్రలోనూ ధరలు పెరిగాయి. ఈ రాష్ట్రాల కంటే ఇక్కడే ధర తక్కువగా ఉందని ఆయన తెలిపారు. తయారీ వ్యయాలు ఎగుస్తున్నందునే ధరల్ని వాటికి అనుగుణంగా స్థిరీకరణ చేయాల్సి వచ్చిందని చెప్పారు. తాజాగా పెరిగిన రైల్వే సరుకు చార్జీల ప్రభావంతో సిమెంటు ధర ఒక్కో బస్తాకు రూ.10 వరకు పెరగనుందని పేర్కొన్నారు. 2014 జనవరి-మార్చి త్రైమాసికంలో చాలా కంపెనీలు నష్టాలను చవిచూడడాన్నిబట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితి అద్ధం పడుతుందని ప్రముఖ కంపెనీ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. అనిశ్చితి కారణంగా.. గత మూడేళ్లుగా సమైక్య రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. ఈ కారణంగా సిమెంటుకు ఆయువు పట్టు అయిన నిర్మాణ రంగం కుదేలైంది. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులే దని చెప్పారు. అటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలూ ఏవీ జరగలేదు. దీంతో సిమెంటుకు గిరాకీ లేకుండా పోయిందని ఓ కంపెనీ ఉన్నతాధికారి వెల్లడించారు.