సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులపై ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ గంగాధర కిషన్ కోరారు. తెలంగాణ వ్యాప్తంగా తలపెట్టిన ఈ సర్వే.. ప్రభుత్వం భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలకు ప్రధాన ఆధారమవుతుందని తెలిపారు.
దేశంలోనే తొలిసారిగా చేపడుతున్న ఈ సర్వేలో ప్రజలు, అధికారులు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వేపై జిల్లా కలెక్టర్ జి.కిషన్ కలెక్టరేట్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘ప్రతి తెలంగాణ పౌరుడు సర్వే కార్యక్రమంలో పాల్గొని వ్యక్తిగత, కుటుంబ వివరాలు అంద జేయాలి. తద్వారా బంగారు తెలంగాణ ఏర్పాటులో తోడ్పాటు అందించినట్లు అవుతుంది. తెలంగాణ పౌరులుగా గుర్తింపు పొందడం, ప్రభుత్వ పథకాలను వినియోగించుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. సమాచార సేకరణ కోసం మీ దగ్గరికి వచ్చే ప్రభుత్వ సిబ్బందికి కచ్చితమైన సమాచారం ఇవ్వాలి.
తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు ఉంటాయి. ఉద్యమంలా సాగుతున్న సర్వేకు అందరూ సహకరించాలి’ అని కలెక్టర్ కోరారు. జిల్లాలోని మొత్తం 3256 ఆవాస ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తామని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సంఖ్యను కేటాయిస్తామని తెలిపారు. ఇది కుటుంబ సర్వే అని, ఇళ్లు(ఆవాసం) ఉన్న వారి వివరాలను మాత్రమే సేకరిస్తామని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించే 19వ తేదీన ప్రభుత్వం సెలవుగా ప్రకటించిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో లోపాలున్నాయన్న భావనతో ప్రభుత్వం ఈ సమగ్ర సర్వేకు నిర్ణయం తీసుకుందని చెప్పారు.
సర్వే అధికారులకు ప్రజలు వాస్తవ వివరాలు ఇచ్చి సహకరించాలని, దీని వల్ల అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో విృ్తత ప్రచారం నిర్వహిస్తున్నామని, విద్యార్థులతో ర్యాలీలు, గ్రామాల్లో చాటింపు ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు ప్రత్యేకంగా ఒక ప్రత్యేక సంఖ్య(యునిక్ నెంబర్)ను కేటాయిస్తామని చెప్పారు. ఈ ప్రత్యేక సంఖ్య భవిష్యత్తులో అన్ని అంశాలకు ఉపయోగపడుతుందని అన్నారు.
స్థానికంగా లేకుంటే...
ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ వివరాలు సేకరించడానికి వచ్చే ప్రభుత్వ సిబ్బందికి అందుబాటులో ఉండాలని కలెక్టర్ కోరారు. ఉపాధి, విద్య, ఇతర అవకాశాలపై ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్నవారు సర్వే రోజున సొంత ఇళ్లలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇది వీలుకాని సందర్భంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి సంబంధించిన రుజువులు(ధ్రువీకరణ పత్రాలు) అధికారులకు చూపిస్తే సరిపోతుందని తెలిపారు. ఒక కుటుంబంలోని కొందరు వ్యక్తులు, సర్వే రోజు ఏదైనా కారణంతో స్థానికంగా అందుబాటులో లేనట్లయితే అందుకుగల కారణాలు రుజువుతో సహా చూపివారి వివరాలు నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఉదాహరణకు ఇతర రాష్ట్రాల్లో చదివే వారు వారి ఐడీ కార్డు, సీట్ అలాట్‌మెంట్ లెటర్, ఇతర దేశాలకు వెళ్లినవారు వారి పాస్‌పోర్టు వివరాలు చూపి వారి వివరాలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు.
ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాలో 9,39,731 కుటుంబాలు ఉంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో 7,47,786 కుటుంబాలు, పట్టణ ప్రాంతంలో 1,89,945 కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. సమగ్ర సర్వేకు వివరాలు సేకరించే సిబ్బందికి ఈ నెల 7న మున్సిపల్, మండల స్థాయిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ తరహాలోనే సర్వేలో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందిని గ్రామాలకు తరలించేందుకు 1500 వాహనాల వినియోగించనున్నట్లు చెప్పారు.
ఉద్యమంలా సర్వే
Published Wed, Aug 6 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement
Advertisement