పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్ల మూత
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఉద్యోగుల నిరవధిక సమ్మె మంగళవారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని పెట్రోల్ బంకు, సినిమా థియేటర్లను మూతవేయించారు. ఉదయం ఆరు గంటలకల్లా అసోసియేషన్ నాయకులు పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుని వాటిని మూసివేయించారు. 11 గంటలకు సినిమా థియేటర్ల వద్దకు చేరుకుని సినిమా ప్రదర్శనలను నిలిపివేయాలని కోరారు.
దీంతో థియేటర్ల యజమానులు సినిమా ప్రదర్శనలను నిలిపివేశారు. నగరంలో మోటార్ సైకిళ్లతో ర్యాలీగా బయలుదేరి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవకాశవాద రాజకీయాలను ఎండగట్టారు. అనంతరం ప్రకాశం భవనం వద్ద సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు తెలంగాణ చిచ్చు రగిల్చారని విమర్శించారు.
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు మాట్లాడే వారందరినీ రెండుగా చీల్చేందుకు కుట్ర పన్నారన్నారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఏ విధంగా తిప్పికొట్టారో పార్లమెంటులో కూడా సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు అదే విధంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు విషయంలో సీమాంధ్రుల మనోభావాలను గుర్తెరిగి ముందుకు సాగాలని, లేకుంటే వారికి రాజకీయ మనుగడ ఉండదని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విద్యాశాఖ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకుడు ఏ స్వాములు మాట్లాడుతూ అసెంబ్లీలో తిరస్కరించిన తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టడం నిరంకుశ విధానాలకు అద్దం పడుతుందన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘ నాయకుడు కే శరత్‌బాబు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం చివరి దశకు చేరుకుందని, ఈ తరుణంలో ఉద్యోగస్తులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విభజన విషయంలో డ్రామాలాడితే సీమాంధ్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఏపీఎన్జీఓ అసోసియేషన్ నగర అధ్యక్షుడు సయ్యద్నాసర్మస్తాన్వలి మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ బిల్లును అడ్డుకోకుంటే వారికి రాజకీయ సమాధి కట్టేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోయ కోటేశ్వరరావు, జిల్లాపరిషత్ ఉద్యోగుల సంఘ నాయకులు శ్యాంసన్, విజయలక్ష్మి, వీరనారాయణ, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పీ మాధవి, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు మూర్తి, సర్వే ఉద్యోగుల సంఘం నాయకుడు కే శివకుమారి, ప్రభుత్వ డ్రైవర్ల సంఘ జిల్లా కార్యదర్శి ప్రసన్నకుమార్, నీటిపారుదల ఉద్యోగుల సంఘ నాయకులు ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు జాతీయ రహదారి దిగ్బంధనం
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయకుండా సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ బుధవారం జాతీయ రహదారి దిగ్బంధం చేయాలని నిర్ణయించింది. జాతీయ రహదారి దిగ్బంధనం తీవ్రత ఢిల్లీ పెద్దలను కదిలించే విధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించి జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు. ఆఖరి పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు కోరారు.