Government go
-
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: బాబ్జినంద
సాక్షి, అమరావతి: నాయీ బ్రాహ్మణులను కులం పేరుతో అవమానించే వారిపై చర్యలు తీసుకునేలా జీవో నంబరు 50ని ప్రభుత్వం విడుదల చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఆత్మగౌరవం కాపాడేలా జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాయీ బ్రాహ్మణులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ‘థ్యాంక్యూ సీఎం’ అంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ నాయిబ్రాహ్మణ నందయువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఇంటూరి బాబ్జినంద బుధవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్రలో తమకు ఇచ్చిన మిగిలిన హామీలు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. తమ అభ్యర్థనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని బాబ్జి వెల్లడించారు. సీఎంను కలిసే అవకాశం కల్పించిన నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలుకు ధన్యవాదాలు తెలిపారు. (క్లిక్: నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం) -
తుది తీర్పునకు లోబడే ఉపాధ్యాయుల కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ మొదలైంది. ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు తుది తీర్పునకు లోబడే జరగాలని ఈ సందర్భంగా బెంచ్ స్పష్టం చేసింది. జీవో 317పై స్టే ఇవ్వాలని ఉపాధ్యాయుల తరపు న్యాయవాదులు కోరగా.. కొత్త జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులు విధుల్లో చేరారని అదనపు ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో జీవో 317పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అంతేకాదు పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ.. ఉపాధ్యాయుల పిటిషన్లపై తదుపరి విచారణ ఏప్రిల్ 4కి వాయిదా వేసింది. -
సొంతకార్ల బిల్లులకు చెల్లుచీటీ
తహసీల్దార్లు ప్రభుత్వ ఏజెన్సీ కార్లు వాడాల్సిందే కలెక్టర్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు ∙ టెండర్ ప్రకటనకు చురుగ్గా కసరత్తు రాజమహేంద్రవరం రూరల్ : అద్దె వాహనాల బిల్లులు డ్రా చేసుకుంటూ సొంత వాహనాల్లో తిరగడం తహసీల్దార్లకు ఇక కుదరదు. ఏజెన్సీల ద్వారానే అన్ని మండలాలకు తహసీల్దార్లకు వాహనాలు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీల ద్వారా వాహనాలు సమకూర్చాలని, ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కసరత్తు చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించేందుకు తహసీల్దార్లకు ప్రభుత్వం వాహన సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. తాలుకా కేంద్రాల్లో ఇందుకు ప్రభుత్వ వాహనాలు ఉండగా మిగతా చోట్ల అద్దె వాహనాలు ఉండేవి. ప్రస్తుతం పురపాలకసంఘాల్లో మినహా ఎక్కడా సొంత వాహనాలు లేవు. ఈ నేపథ్యంలో అందరూ అద్దె వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. సగానికిపైగా సొంత వాహనాలే.. జిల్లాలో 64 మండలాలు ఉండగా అందులో మండలాల్లో అద్దె వాహనాలు వాడుతున్నట్లు 55 మంది తహసీల్దార్లు బిల్లులు డ్రా చేస్తున్నారు. ఒక్కో తహసీల్దార్‌కు రూ.24వేలు బిల్లు విడుదల చేయాల్సి ఉండగా బడ్జెట్ తక్కువగా ఉండడంతో రూ.16వేల నుంచి రూ.21వేలు మధ్య ప్రభుత్వం బిల్లును ఇస్తుంది. ఇలా బిల్లులు డ్రా చేస్తున్న సగం మందికి పైగా తహసీల్దార్లు విధి నిర్వహణకు సొంత వాహనాలే వాడుతున్నారు. మరికొందరు ద్విచక్రవాహనాలపై వెళ్తూ బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. ఒకే ఏజెన్సీ ద్వారా అద్దె వాహనాలు ఇకపై జిల్లా వ్యాప్తంగా ఒకే ఏజెన్సీ ద్వారా అద్దె వాహనాలు సమకూర్చాలని ప్రభుత్వం కలెక్టరుకు ఉత్తర్వులు జారీ చేసింది. పారదర్శకంగా ఒక ఏజెన్సీని ఎంపిక చేసి, వారు సమకూర్చే వాహనాలను తహసీల్దార్లకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒక్కో వాహనానికి రూ.36వేలు బిల్లు చెల్లించాలని, నెలకు ఆ వాహనం 2200 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుందని సూచించింది. పారదర్శకంగా వాహనాలను ఏర్పాటు చేయాలని సూచించడంతో టెండరు ప్రక్రియ ద్వారా ఏజెన్సీని నిర్ణయించాలని కలెక్టరు భావిస్తున్నారు. అయితే ఎటువంటి వాహనాలను సమకూర్చాలో ప్రభుత్వం చెప్పకపోవడంతో దీనిపై స్పష్టత లేదు. టెండరు విడుదల నాటికి ఒక నిర్ణయానికి వస్తారని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే తహసీల్దార్లు మాత్రం బొలెరో వాహనాలు ఇవ్వాలని అడుగుతున్నారు. అంత మొత్తానికి ఏజెన్సీలు వాహనాలను సమకూరుసాయా లేదా అన్నది ప్రశ్నార్థకమే. ఇదిలా ఉండగా తాహసీల్దారులు తాము సూచించిన వారినే డ్రైవర్లుగా నియమించాలని అంటున్నారు. ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది . మొత్తానికి తహసీల్దార్లకు బల్క్‌గా అద్దెవాహనాలను సమకూర్చడం ఖాయం. -
మహిళలకే ఇసుక రీచ్‌లు
విజయనగరం కంటోన్మెంట్: ఎట్టకేలకు ఇసుక విధానం ఖరారయింది. రీచ్‌లను మహిళల కు కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. మైనింగ్ శాఖ కార్యాలయానికి శనివారం ఉత్తర్వులు చేరాయి. ఇసుక తవ్వకా లు, విక్రయాల బాధ్యతను ఇసుక రీచ్‌లు పొందే మహిళలకే అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్‌లోని పరిశ్రమల ముఖ్య కార్యదర్శి పేరున విడుదలయిన ఉత్తర్వులు, రాష్ట్ర ఖనిజ తవ్వకాల నిబంధనల ప్రకారం ఈ ఇసుక రీచ్‌లను నిర్వహించాలి. ఇసుక రీచ్‌లను ఎంపిక చేసేందుకు, వేలం వేసేందుకు జిల్లాలోని డీఆర్డీఏ పీడీ మెంబర్ కన్వీనర్‌గా ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. కలెక్టర్ అధ్యక్షతన సమావేశమయ్యే ఈ కమిటీ జిల్లాలోని ఎక్కడెక్కడ ఇసుక రీచ్‌లున్నాయి, తవ్వకాలకు సరిపడా ఇసుక నిల్వలెక్కడున్నాయో పరిశీలించి, వాటిని వేలం వేయవచ్చునో లేదో నిర్ణయం తీసుకుంటుంది. భూ గర్భజల శాఖ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ వంటి శాఖల సమన్వయంతో ఇసుక రీచ్‌లను ఎంపిక చేస్తారు. మహిళా సంఘాల దరఖాస్తులననుసరించి అర్హత గల సంఘాలకు అప్పగిస్తారు. తవ్వకాలు జరిపే ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తారు. తద్వారా ఎంత మేర ఇసుక తవ్వకాలు అనుమతులిచ్చినది, ఎంత మేర తవ్వుతున్నదీ పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలను చేపట్టేలా చర్యలు తీసుకుంటారు. ఇసుక రీచ్‌లు పొందిన సంఘాలు చెల్లింపులను ఆన్లైన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. నగదు చెల్లింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకుండా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఇసుకను తరలించే లారీలు జిల్లా సరిహద్దులు దాటడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుంటారు. ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి, సొమ్ము చేసుకునేందుకు వీలు లేకుండా, విచ్చలవిడి వ్యాపారానికి అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టం చేశారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఇసుక రీచ్‌లను ఎంపిక చేసిన తరువాత మహిళా సంఘాల నుంచి దరఖాస్తులు కోరతారు. దరఖాస్తులు చేసుకున్న మహిళా సంఘాలకు ఇసుక రీచ్‌లు కేటాయిస్తారు. వారికి అవసరమైన పెట్టుబడులు కూడా జిల్లా స్థాయిలోని కమిటీ సమకూరుస్తుంది. ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు అవసరమైన యంత్రాల సమీకరణ కూడా చేస్తారు. కలెక్టర్, ఎస్పీల సహాయంతో ఈ ఏర్పాట్లు చేస్తారు. కమిటీ సభ్యులు వీరే... డీఆర్డీఏ పీడీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో జేసీ, ఎస్పీలు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. జెడ్పీ సీఈఓ, ఇరిగేషన్ ఎస్ఈ, డ్వామా పీడీ, డీపీఓ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, గనుల శాఖ ఏడీ, భూగర్భజల వనరుల శాఖ ఈఈ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు తదితరులు సభ్యులుగా ఉంటారు. మహిళా సంఘాలకు 25 శాతం ఇందులో వచ్చే లాభాల్లో 25 శాతం మాత్రమే మహిళలకు కేటాయిస్తారు. మిగతా లాభాలు జెడ్పీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఖజానాకు చేరతాయి. భూగర్భ జలాలకు విఘాతం కలిగించే ఇసుక రీచ్‌లను నిషేధించడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అధికారం అప్పగించారు. ఇసుక రీచ్‌లను తవ్వేందుకు 500 మీటర్లకు పరిమితి విధించారు. ఈ పరిమితి మించి తవ్వకాలను చేపట్టకూడదు. పట్టాదారులకూ తవ్వకాలకు అనుమతి జిల్లాలోని జిరాయితీ భూముల్లో ఇసుక నిల్వలుంటే తవ్వుకోవడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో అనుమతులను ఇస్తారు. ఈ అనుమతులకోసం పట్టాదారు స్వయంగా దరఖాస్తు చేసుకోవాలి. జిరాయితీ భూముల్లోని ఇసుక తవ్వకాల ద్వారా వచ్చే లాభంలో 25 శాతం మాత్రమే పట్టాదారుకు చెందుతుంది. మిగతా లాభం జెడ్పీలకే వెళ్తుంది. వాటిలో మండలాలకు కూడా కొంతవాటా ఉంటుంది. ఈ వాటాలను కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. మండల, గ్రామాల పరిధిలో నాటుబళ్లు, ట్రాక్టర్ల ద్వారానే ఇసుక తరలింపు చేపట్టాలి. రెండు సార్లు జరిమానాలు విధించిన తరువాత మూడో సారి అదే వాహనం తనిఖీల్లో పట్టుబడితే సీజ్ చేస్తారు. ప్రతీ నెలా జిల్లాలోని కమిటీ సమావేశమై ఇసుక తవ్వకాలు, రవాణాలను పరిశీలించి సమీక్షిస్తుంది. ఐదేళ్లుగా అనుమతులు లేవు జిల్లాలో గతంలో 51 ఇసుక రీచ్లుండేవి. ప్రస్తుతం ఒక్కదానికి కూడా అనుమతులు లేవు. జిల్లాలో భూగర్భ జలాలు ఇంకిపోతున్న కారణంగా ఇసుక తవ్వకాలను నిషేధించారు. దీంతో జిల్లాలో ఇసుక రీచ్‌లకు గడచిన ఐదేళ్లుగా మంజూరు చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వడంతో జిల్లా ఇసుక కమిటీ సమావేశమై ఇసుక రేవులను గుర్తిస్తేనే ఎక్కడెక్కడ ఇసుక ఉందన్న విషయం తెలుస్తుంది. తద్వారా ఇసుక రీచ్‌లను వేలం వేయడానికి ఆస్కారం ఉంటుంది.