మహిళలకే ఇసుక రీచ్‌లు
విజయనగరం కంటోన్మెంట్: ఎట్టకేలకు ఇసుక విధానం ఖరారయింది. రీచ్‌లను మహిళల కు కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. మైనింగ్ శాఖ కార్యాలయానికి శనివారం ఉత్తర్వులు చేరాయి. ఇసుక తవ్వకా లు, విక్రయాల బాధ్యతను ఇసుక రీచ్‌లు పొందే మహిళలకే అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్‌లోని పరిశ్రమల ముఖ్య కార్యదర్శి పేరున విడుదలయిన ఉత్తర్వులు, రాష్ట్ర ఖనిజ తవ్వకాల నిబంధనల ప్రకారం ఈ ఇసుక రీచ్‌లను నిర్వహించాలి. ఇసుక రీచ్‌లను ఎంపిక చేసేందుకు, వేలం వేసేందుకు జిల్లాలోని డీఆర్‌డీఏ పీడీ మెంబర్ కన్వీనర్‌గా ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. కలెక్టర్ అధ్యక్షతన సమావేశమయ్యే ఈ కమిటీ జిల్లాలోని ఎక్కడెక్కడ ఇసుక రీచ్‌లున్నాయి, తవ్వకాలకు సరిపడా ఇసుక నిల్వలెక్కడున్నాయో పరిశీలించి, వాటిని వేలం వేయవచ్చునో లేదో నిర్ణయం తీసుకుంటుంది. భూ గర్భజల శాఖ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ వంటి శాఖల సమన్వయంతో ఇసుక రీచ్‌లను ఎంపిక చేస్తారు.
మహిళా సంఘాల దరఖాస్తులననుసరించి అర్హత గల సంఘాలకు అప్పగిస్తారు. తవ్వకాలు జరిపే ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తారు. తద్వారా ఎంత మేర ఇసుక తవ్వకాలు అనుమతులిచ్చినది, ఎంత మేర తవ్వుతున్నదీ పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలను చేపట్టేలా చర్యలు తీసుకుంటారు. ఇసుక రీచ్‌లు పొందిన సంఘాలు చెల్లింపులను ఆన్‌లైన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. నగదు చెల్లింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకుండా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించారు.
ఇసుకను తరలించే లారీలు జిల్లా సరిహద్దులు దాటడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుంటారు. ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి, సొమ్ము చేసుకునేందుకు వీలు లేకుండా, విచ్చలవిడి వ్యాపారానికి అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టం చేశారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఇసుక రీచ్‌లను ఎంపిక చేసిన తరువాత మహిళా సంఘాల నుంచి దరఖాస్తులు కోరతారు. దరఖాస్తులు చేసుకున్న మహిళా సంఘాలకు ఇసుక రీచ్‌లు కేటాయిస్తారు. వారికి అవసరమైన పెట్టుబడులు కూడా జిల్లా స్థాయిలోని కమిటీ సమకూరుస్తుంది. ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు అవసరమైన యంత్రాల సమీకరణ కూడా చేస్తారు. కలెక్టర్, ఎస్పీల సహాయంతో ఈ ఏర్పాట్లు చేస్తారు.
కమిటీ సభ్యులు వీరే...
డీఆర్‌డీఏ పీడీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో జేసీ, ఎస్పీలు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. జెడ్పీ సీఈఓ, ఇరిగేషన్ ఎస్‌ఈ, డ్వామా పీడీ, డీపీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, గనుల శాఖ ఏడీ, భూగర్భజల వనరుల శాఖ ఈఈ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు తదితరులు సభ్యులుగా ఉంటారు.
మహిళా సంఘాలకు 25 శాతం
ఇందులో వచ్చే లాభాల్లో 25 శాతం మాత్రమే మహిళలకు కేటాయిస్తారు. మిగతా లాభాలు జెడ్పీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఖజానాకు చేరతాయి. భూగర్భ జలాలకు విఘాతం కలిగించే ఇసుక రీచ్‌లను నిషేధించడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అధికారం అప్పగించారు. ఇసుక రీచ్‌లను తవ్వేందుకు 500 మీటర్లకు పరిమితి విధించారు. ఈ పరిమితి మించి తవ్వకాలను చేపట్టకూడదు.
పట్టాదారులకూ తవ్వకాలకు అనుమతి
జిల్లాలోని జిరాయితీ భూముల్లో ఇసుక నిల్వలుంటే తవ్వుకోవడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో అనుమతులను ఇస్తారు. ఈ అనుమతులకోసం పట్టాదారు స్వయంగా దరఖాస్తు చేసుకోవాలి. జిరాయితీ భూముల్లోని ఇసుక తవ్వకాల ద్వారా వచ్చే లాభంలో 25 శాతం మాత్రమే పట్టాదారుకు చెందుతుంది. మిగతా లాభం జెడ్పీలకే వెళ్తుంది. వాటిలో మండలాలకు కూడా కొంతవాటా ఉంటుంది. ఈ వాటాలను కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. మండల, గ్రామాల పరిధిలో నాటుబళ్లు, ట్రాక్టర్ల ద్వారానే ఇసుక తరలింపు చేపట్టాలి. రెండు సార్లు జరిమానాలు విధించిన తరువాత మూడో సారి అదే వాహనం తనిఖీల్లో పట్టుబడితే సీజ్ చేస్తారు. ప్రతీ నెలా జిల్లాలోని కమిటీ సమావేశమై ఇసుక తవ్వకాలు, రవాణాలను పరిశీలించి సమీక్షిస్తుంది.
ఐదేళ్లుగా అనుమతులు లేవు
జిల్లాలో గతంలో 51 ఇసుక రీచ్‌లుండేవి. ప్రస్తుతం ఒక్కదానికి కూడా అనుమతులు లేవు. జిల్లాలో భూగర్భ జలాలు ఇంకిపోతున్న కారణంగా ఇసుక తవ్వకాలను నిషేధించారు. దీంతో జిల్లాలో ఇసుక రీచ్‌లకు గడచిన ఐదేళ్లుగా మంజూరు చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వడంతో జిల్లా ఇసుక కమిటీ సమావేశమై ఇసుక రేవులను గుర్తిస్తేనే ఎక్కడెక్కడ ఇసుక ఉందన్న విషయం తెలుస్తుంది. తద్వారా ఇసుక రీచ్‌లను వేలం వేయడానికి ఆస్కారం ఉంటుంది.