అధికార పార్టీ వారికే...దీపం వెలుగు
Published Tue, Feb 4 2014 2:41 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అర్హత ఉంటే సరిపోదు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులై ఉంటేనే ప్రభుత్వ పథకం ఏదైనా దక్కుతుంది. విపక్షాలకు చెందిన వారికైతే ఏ పథకం పొందాల న్నా దాని జోలికే పోనక్కర్లేదు. డ్వాక్రా మహిళల కోసం ప్రవేశపెట్టిన దీపం పథకం రాజకీయ రంగు పులుముకుంటోంది. అధికారులు కూడా అధికార పార్టీ నేతలకు దాసోహమంటూ నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. అధికార పార్టీ నేతలు ప్రతిపాదించిన వారికే దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్‌లు అందుతు న్నాయి. దీంతో అర్హత ఉన్నప్పటికీ కాంగ్రెసేతరులకు ఏ పథకమూ అందడం లేదని విపక్షాలు గ గ్గోలు పెడుతున్నా వారిది అరణ్యరోదన గానే మిగిలిపోతోంది.
పద్ధతి ఇది..
జిల్లాకు మంజూరైన గ్యాస్ కనెక్షన్‌లను మండలాల వారీగా కేటాయింపులు చేసి, గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి, తీర్మానం చేయాలి. ఆ తీర్మానంపై ఎంపీడీఓ, తహశీల్దార్ సంతకం చేసి డీఆర్‌డీఏకు పంపించాలి. ఆ జాబితాలను ఆమోదం కోసం జిల్లా ఇన్‌చార్జి మంత్రికి పంపిస్తారు. ఆయన ఆమోదం రాగానే జిల్లా పౌరసరఫరాల అధికారులు సంబంధిత గ్యాస్ ఏజెన్సీల నుంచి సీఎస్‌డీటీల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలి.
జరుగుతోంది ఇది..
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్‌గా ప్రాతినిధ్యం వహించే గ్రామాల్లో గ్రామసభలు పెట్టి, ఆ పార్టీ నేతలు సూచించే వ్యక్తుల పేర్లను జాబితాలో చేర్చి, ఆ మేరకు తీర్మానం చేసి డీఆర్‌డీఏకు ఆ జాబితాలను పంపిస్తున్నారు. ఎలాగూ కాంగ్రెస్ మద్దతుదా రు సర్పంచ్‌లు ప్రతిపాదించే జాబితాలే కావడంతో ఇన్‌చార్జి మంత్రి కూడా ఆమోదముద్ర వేసేస్తున్నారు. ఇక కాంగ్రెసేతర సర్పంచ్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో గ్రామసభలే నిర్వహించడం లేదు. గ్రామసభలు పెట్టినట్టు కార్యదర్శుల ద్వారా తీర్మానం కాపీలు తయారు చేసి, అందులో కాంగ్రెస్ నేతలు చెప్పిన వ్యక్తుల పేర్లను లబ్ధిదారులుగా చేర్చి ఇన్‌చార్జి మంత్రి ఆమోదం కోసం పంపిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటి ఆంతర్యం క్షుణ్ణంగా తెలియడంతో ఇన్‌చార్జి మంత్రి కూడా వెంటనే రాజముద్ర వేస్తున్నారు. జిల్లాలో ఎటు చూసినా కాంగ్రెస్ నేతలు చెప్పిన వాళ్లకే దీపం కనెక్షన్లు అందుతున్న పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెసేతర మద్దతుదారు సర్పంచ్‌లున్న గ్రామాల్లో జరిగే తంతును సమాచార హక్కు చట్టం ద్వారా విపక్షాలు బయటికి తెస్తున్నాయి. ఉదాహరణకు నెల్లిమర్ల మండలం దన్నాన పేట పంచాయతీ కోరాడ పేటలో గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు గ్రామసభ ఏర్పాటు చేసినట్లు, అందులో 33మంది మహిళలను లబ్ధిదారులు గా ఎంపిక చేసినట్లు తయారు చేసిన తీర్మానం కాపీలను సమాచార హక్కు చట్టం ద్వారా విపక్ష నేతలు బయటికి తెచ్చారు. ఈ గ్రామసభ తీర్మానం ఎప్పుడు(తేదీ, నెల వివరాలు) జరి గిందో తీర్మానం కాపీలో పేర్కొనలేదు. సర్పంచ్ కు తెలియకుండా జరగడంతో ఇదంతా కార్యదర్శుల ద్వారా సృష్టించిన పేపరు తీర్మానాలుగానే భావిస్తున్నారు. అధికారులను ఇదే విషయంపై ప్రశ్నిస్తే సర్పంచ్‌ల ప్రాతినిధ్యం లేని సమయంలో గ్రామసభలు నిర్వహించామని చెబుతున్నారు.
అలాంటప్పుడు తీర్మానం కాపీలో తేదీ, నెల ఎందుకు వేయలేదంటే అధికారుల వద్ద సమాధానం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే గ్రామసభల్లో రభస ఎందుకని కాంగ్రెస్ మద్దతుదారు సర్పంచ్‌లున్న గ్రామాలకే దీపం కనెక్షన్లను కేటాయింపులు చేసి, ఆ పార్టీ నేతల కనుసన్నల్లో తూతుమంత్రంగా గ్రామసభలు నిర్వహించి, ఏకపక్షంగా తీర్మానాలు చేసి ఇన్‌చార్జి మంత్రి ఆమోదం కోసం పంపించేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీటికి ఉదాహరణగా నెల్లిమర్ల మండలంలోని కొత్తపేట, రామతీర్థం, తమ్మాపురం గ్రామాలనే చెప్పుకో వచ్చు ఈ గ్రామాల్లో కేటాయింపులు చేయలేదు. ఒక్క నెల్లిమర్ల మండలమే కాదు జిల్లావ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది.
Advertisement
Advertisement