సాక్షి ప్రతినిధి, విజయనగరం ః జిల్లాలో ఎట్టకేలకు ఆరు ఇసుక రీచ్‌లకు జిల్లా యంత్రాంగం అనుమతిచ్చింది. భూగర్భజల శాఖ పరిశీలించి, అంగీకరించిన తర్వాత నిర్ధేశిత రీచ్‌లలో ఇసుకను వినియోగించడానికి అనుమతి ఇచ్చినట్టు కలెక్టర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అవసరం ఎక్కువగా ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. మ్యూచ్‌వల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ(మేక్స్)గా ఏర్పడిన గ్రామైక్య సంఘాలకు ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. గుర్ల మండలం కలవచర్ల, నెల్లిమర్ల మండలం పారసాం, కొమరాడ మండలం నిమ్మలపాడు(దుగ్గి), కల్లికోట, జియ్యమ్మవలస మండలం బిట్రపాడు, బొబ్బిలి మండలం పారాదిలో ఇసుక రీచ్‌లు గుర్తించి అనుమతులిచ్చినట్టు వివరించారు.
జిల్లాలో దాదాపు 60 ఇసుక రీచ్‌లను పరిశీలించగా అందులో మూడో తరగతి రీచ్‌లుగా ఆరింటిని భూగర్భ జల శాఖ గుర్తించడంతో అనుమతులిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆరు రీచ్‌లలో 63 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. జిల్లా అవసరాలకు ఇది సరిపోనందున మరికొన్ని ఇసుక రీచ్‌ల గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇంకా అవసరమైతే శ్రీకాకుళం నుంచి రప్పించే ఆలోచన ఉందన్నారు. విజయనగరం, బొబ్బిలిలలో డిపోలు ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు. ఈ డిపోల వద్దకు ఇసుక తీసుకొచ్చి, అక్కడ నుంచి రవాణా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తుఫాన్ బీభత్స నేపథ్యంలో మాన్యువల్‌గా నిర్వహిస్తామని, తదుపరి ఆన్‌లైన్‌లో కంప్యూటరీకరణ ద్వారా ఇసుక నిర్వహణ చేపడతామని, సెక్యూరిటీ పరంగా చర్యలు తీసుకోవడానికి పరిశీలిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతానికి ఒక క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.500లకు విక్రయించడానికి నిర్ణయించామన్నారు. మేక్స్ పేరుపై ఆంధ్రా బ్యాంకు శాఖలో చెల్లుబాటు అయ్యే విధంగా డీడీ, సంబంధిత ఇంజినీరింగ్ అధికారి ధ్రువీకరణపత్రం పొంది సమర్పించాలన్నారు.
ప్రస్తుతం కొనుగోలుదారులు తమ సొంత ఖర్చులతో వేతనదారులను(లోడింగ్, అన్‌లోడింగ్) ఏర్పాటు చేసుకోవాలన్నారు. దేనికోసం ఇసుకను కొనుగోలు చేస్తున్నారో అదే అవసరం నిమిత్తం అదే స్థలంలో ఉపయోగించాల్సి ఉందన్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక రీచ్ వద్ద ఎడ్లబండి, ట్రాక్టర్లకు మాత్రమే అనుమతిస్తామన్నారు. ఇసుక తవ్వడానికి యంత్రాల వినియోగం నిషేధమని తెలిపారు. అనధికార ఇసుక స్టాకు పాయింట్ల నిర్వహణను కూడా నిషేధించినట్టు చెప్పారు.
ఇసుక అక్రమ రవాణా, ఇతర అవకతవకలకు సంబంధించిన ఫిర్యాదులకు 8008201341 నంబర్‌కు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి గ్రామ మండల స్థాయిలో రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, గ్రామీణ నీటి సరఫరా, నీటి పారుదల శాఖలు పర్యవేక్షిస్తాయని, జిల్లా స్థాయిలో గనులు భూగర్బ జలశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు పర్యవేక్షిస్తాయని చెప్పారు. కొసమెరుపు ఏంటంటే కొత్తగా అమలు చేస్తున్న ఈ ప్రక్రియలో లోపాలు ఎదురవుతాయని, అవకతవకలకు అవకాశం ఉంటుందని, అరికట్టేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పడం విశేషం.
ఈ సమావేశంలో డీఆర్‌డీఎ ప్రాజెక్టు డెరైక్టర్ పెద్దిరాజు, అదనపు పీడీ సుధాకర్, భూగర్భగనుల శాఖ ఏడీ చౌదరి, ఇనిస్టిట్యూషనల్ బిల్డింగ్ ప్రాజెక్టు మేనేజర్ డైసీ పాల్గొన్నారు.
ఎట్టకేలకు ఇసుక రీచ్‌లకు అనుమతి
Published Sun, Oct 26 2014 1:35 AM | Last Updated on Fri, Aug 17 2018 6:08 PM
Advertisement
Advertisement