the governments decision
-
విపత్తు నిర్వహణపై విద్యార్థులకు శిక్షణ
- వెల్లడించిన విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే - వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని స్పష్టం సాక్షి, ముంబై: ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, ప్రమాదాల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే మంత్రాలయ భవనంలో చెప్పారు. ఇందుకోసం వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు నేపాల్, పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పాఠశాలలోకి ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అభం శుభం తెలియని విద్యార్థులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. కొద్ది సంవత్సరాల కిందట తమిళనాడులో ఓ పాఠశాల భవనానికి అగ్ని ప్రమాదం సంభవించింది. పాఠశాల భవనానికి ఒకే వైపు మెట్లు ఉండటంతో ఎటు వెళ్లాలో విద్యార్థులకు అర్థంకాక పాఠశాలలో తొక్కిసలాట జరిగింది. దీంతో అనేక మంది విద్యార్థులు మృతి చెందారు. దీంతో ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
స్కూళ్లకు.. కొత్త వేళలు
పెరగనున్న పనిగంటలు పాఠశాల విద్యా కేలండర్ ఆవిష్కరణకు ఏర్పాట్లు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చర్యలు చేపట్టిన విద్యాశాఖ మంత్రికి చేరిన ఫైలు జగదీశ్‌రెడ్డి ఆమోదముద్ర పడగానే అమల్లోకి కొత్త వేళలు హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలల వేళలు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే సెలవు దినాలు, పరీక్షలు, ఏయే పీరియడ్లలో ఏయే అంశాలను బోధించాలనే వివరాలతో కూడిన పాఠశాల విద్యా విషయక కేలండర్‌ను ఆవిష్కరించేందుకు కూడా చర్యలు చేపట్టింది. వీటికి సంబంధించిన ఫైలును అధికారులు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆమోదానికి పంపించారు. మంత్రి సంతకం అయిన వెంటనే బడి వేళల మార్పును అమల్లోకి తేనున్నారు. ఈ ఏడాది మొదట్లో స్కూళ్లలో పని గంటలు తక్కువగా ఉన్నాయని, నిబంధనల మేరకు బోధన జరగడంలేదన్న కేసులో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రభుత్వం బడి వేళలను మార్చడంతోపాటు పని గంటల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి బడి వేళల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య చాలా తేడాలున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు బడి వేళలను ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక రకమైన వేళలు ఉండగా, ప్రైవేటు స్కూళ్లు మాత్రం ఒక్కోటి ఒక్కోరకంగా పాఠశాలలు నడుపుతున్నాయి. కొన్ని స్కూళ్లు ఉదయం 8 గంటల నుంచే తరగతులను ప్రారంభిస్తుండగా, మరికొన్ని ఉదయం 8:30 గంటలకు, ఇంకొన్ని 9 గంటలకు తరగతులను ప్రారంభిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అన్ని పాఠశాలలు ఒకే వేళలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించినా, అమలుకు మాత్రం నోచుకోలేదు. ఈ నేపథ్యంలో బడి వేళలు మారుస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తించనుంది. కానీ ఈ విషయంలో అవి ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే. అమల్లోకి రానున్న మార్పులివే... విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో సంవత్సరానికి 800 గంటల బోధన ఉండాలి. 6 నుంచి 8వ తరగతి వరకు వేయి గంటలు బోధించాలి. దీని ప్రకారం వారంలో 45 గంటలు తరగతులు నిర్వహించాలి. ఇందుకు అనుగుణంగా మార్పులు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రైమరీ స్కూళ్లలో వారంలో ఉన్న 42 పీరియడ్లను 48కి పెంచుతారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న 48 పీరియడ్లు యథాతథంగా ఉంటాయి. ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం అమలవుతున్న 48 పీరియడ్లను 54కి పెంచుతారు.ప్రాథమిక పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3:35 గంటల వరకు నడుస్తుండగా, వాటిని 4:30 గంటల వరకు కొనసాగిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలు 9 గంటల నుంచి సాయంత్రం 4:05 గంటల వరకు నడుస్తుండగా, వాటి పనివేళలను సాయంత్రం 4:30 గంటల వరకు పెంచనున్నారు. ఈ స్కూళ్లలో ఉదయం 10:45 గంటల నుంచి 11 వరకు, మధ్యాహ్నం 2:50 నుంచి 3 గంటల వరకు స్వల్ప విరామం ఇస్తారు. 12:30 గంటల నుంచి 1:20 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ఉన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9:45 గంటల నుంచి సాయంత్రం 4:40 గంటల వరకు నడుస్తున్నాయి. వాటిని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగిస్తారు. ఉదయం 11:20 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:10 వరకు స్వల్ప విరామం ఉంటుంది. మధ్యాహ్నం 12:50 నుంచి 1:40 వరకు భోజన విరామం ఇస్తారు. -
కుంటుపడుతున్న ‘ఉపాధి’
కొత్త ప్రభుత్వం ప్రకటనతో ఫీల్డ్ అసిస్టెంట్లలో నిరుత్సాహం తగ్గుతున్న కూలీల సంఖ్య చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు రోజురోజుకూ కుంటుపడుతోంది. ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కొత్త ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఉపాధి హామీ ఫీల్డ్అసిస్టెంట్లు నిరుత్సాహంగా ఉండడమే దీనికి కారణం. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద 28 వేల శ్రమశక్తి సంఘాలకుగాను దాదాపు 4 లక్షల మంది కూలీలు ఉన్నారు. కూలీలకు ఆయా గ్రామాల పరిధిలో నిత్యం పనులు కల్పించేందుకు ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల విధానాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాలోని 1347 గ్రామ పంచాయతీలకు గాను ప్రతి పంచాయతీకి ఒకరు చొప్పున ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించింది. ప్రతిరోజు కూలీలు చేపట్టిన పనులకు మార్కింగ్ చేయడం, కూలీల వేతనాలను నిర్ణయించేందుకు చేసిన పనుల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలపడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలకపాత్ర వ హిస్తారు. దీంతో ప్రతివారం కూలీలకు నేరుగా ఆయా గ్రామాల్లోని పోస్టాఫీసుల్లో బయోమెట్రిక్ విదానం ద్వారా వేతనాలు అందేవి. దీంతో కూలీలు కూడా ప్రతిరోజు ఉపాధి పనులకు వచ్చేందుకు ఆసక్తిని కనబరిచేవారు. నిరుత్సాహంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల విధానానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తామంటూ రెండు నెలల క్రితం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 1347 పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లలో ఏడాది క్రితం వివిధ కారణాలతో కొందరిని, లక్ష్యాలను చేరుకోలేదన్న సాకుతో మరికొందరిని ప్రభుత్వ తొలగించింది. దీంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 811 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరిని కూడా తొలగిస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించడంతో ఫీల్డ్ అసిస్టెంట్లలో నిరుత్సాహం చోటు చేసుకుంది. తగ్గిన కూలీల సంఖ్య ఉపాధి హామీ పనులకు విచ్చేసే కూలీల సంఖ్య జిల్లా వ్యాప్తంగా తగ్గింది. రెండు నెలల క్రితం రోజుకు దాదాపు లక్ష మంది కూలీలు పనులకు వచ్చేవారు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తామంటూ కొత్త ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలోని ఫీల్డ్ అసిస్టెంట్లు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. కూలీలకు పనులను కల్పించడంలో వెనుకబడ్డారు. దీంతో ప్రస్తుతం రోజుకు 60 వేల మంది కూలీలు కూడా పనులకు రావడం లేదు. ఫలితంగా జిల్లాలో ఉపాధి హామీ పనులు కుంటుపడుతున్నాయి. దీంతో కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.