కుంటుపడుతున్న ‘ఉపాధి’ | Kuntupadutunna 'employment' | Sakshi
Sakshi News home page

కుంటుపడుతున్న ‘ఉపాధి’

Published Mon, Aug 4 2014 3:50 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

Kuntupadutunna 'employment'

  •      కొత్త ప్రభుత్వం ప్రకటనతో ఫీల్డ్ అసిస్టెంట్లలో నిరుత్సాహం
  •      తగ్గుతున్న కూలీల సంఖ్య
  • చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు రోజురోజుకూ కుంటుపడుతోంది. ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కొత్త ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లు నిరుత్సాహంగా ఉండడమే దీనికి కారణం. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద 28 వేల శ్రమశక్తి సంఘాలకుగాను దాదాపు 4 లక్షల మంది కూలీలు ఉన్నారు. కూలీలకు ఆయా గ్రామాల పరిధిలో నిత్యం పనులు కల్పించేందుకు ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల విధానాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాలోని 1347 గ్రామ పంచాయతీలకు గాను ప్రతి పంచాయతీకి ఒకరు చొప్పున ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించింది.

    ప్రతిరోజు కూలీలు చేపట్టిన పనులకు మార్కింగ్ చేయడం, కూలీల వేతనాలను నిర్ణయించేందుకు చేసిన పనుల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలపడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలకపాత్ర వ హిస్తారు. దీంతో ప్రతివారం కూలీలకు నేరుగా ఆయా గ్రామాల్లోని పోస్టాఫీసుల్లో బయోమెట్రిక్ విదానం ద్వారా వేతనాలు అందేవి. దీంతో కూలీలు కూడా ప్రతిరోజు ఉపాధి పనులకు వచ్చేందుకు ఆసక్తిని కనబరిచేవారు.
     
    నిరుత్సాహంలో ఫీల్డ్ అసిస్టెంట్లు

     
    ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల విధానానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తామంటూ రెండు నెలల క్రితం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 1347 పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లలో ఏడాది క్రితం వివిధ కారణాలతో కొందరిని, లక్ష్యాలను చేరుకోలేదన్న సాకుతో మరికొందరిని ప్రభుత్వ తొలగించింది. దీంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 811 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరిని కూడా తొలగిస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించడంతో ఫీల్డ్ అసిస్టెంట్లలో నిరుత్సాహం చోటు చేసుకుంది.
     
    తగ్గిన కూలీల సంఖ్య
     
    ఉపాధి హామీ పనులకు విచ్చేసే కూలీల సంఖ్య జిల్లా వ్యాప్తంగా తగ్గింది. రెండు నెలల క్రితం రోజుకు దాదాపు లక్ష మంది కూలీలు పనులకు వచ్చేవారు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తామంటూ కొత్త ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలోని ఫీల్డ్ అసిస్టెంట్లు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. కూలీలకు పనులను కల్పించడంలో వెనుకబడ్డారు. దీంతో ప్రస్తుతం రోజుకు 60 వేల మంది కూలీలు కూడా పనులకు రావడం లేదు. ఫలితంగా జిల్లాలో ఉపాధి హామీ పనులు కుంటుపడుతున్నాయి. దీంతో కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement