
స్కూళ్లకు.. కొత్త వేళలు
పెరగనున్న పనిగంటలు
పాఠశాల విద్యా కేలండర్ ఆవిష్కరణకు ఏర్పాట్లు
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చర్యలు చేపట్టిన విద్యాశాఖ మంత్రికి చేరిన ఫైలు
జగదీశ్‌రెడ్డి ఆమోదముద్ర పడగానే అమల్లోకి కొత్త వేళలు
హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలల వేళలు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే సెలవు దినాలు, పరీక్షలు, ఏయే పీరియడ్లలో ఏయే అంశాలను బోధించాలనే వివరాలతో కూడిన పాఠశాల విద్యా విషయక కేలండర్‌ను ఆవిష్కరించేందుకు కూడా చర్యలు చేపట్టింది. వీటికి సంబంధించిన ఫైలును అధికారులు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆమోదానికి పంపించారు. మంత్రి సంతకం అయిన వెంటనే బడి వేళల మార్పును అమల్లోకి తేనున్నారు. ఈ ఏడాది మొదట్లో స్కూళ్లలో పని గంటలు తక్కువగా ఉన్నాయని, నిబంధనల మేరకు బోధన జరగడంలేదన్న కేసులో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రభుత్వం బడి వేళలను మార్చడంతోపాటు పని గంటల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి బడి వేళల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య చాలా తేడాలున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు బడి వేళలను ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక రకమైన వేళలు ఉండగా, ప్రైవేటు స్కూళ్లు మాత్రం ఒక్కోటి ఒక్కోరకంగా పాఠశాలలు నడుపుతున్నాయి. కొన్ని స్కూళ్లు ఉదయం 8 గంటల నుంచే తరగతులను ప్రారంభిస్తుండగా, మరికొన్ని ఉదయం 8:30 గంటలకు, ఇంకొన్ని 9 గంటలకు తరగతులను ప్రారంభిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అన్ని పాఠశాలలు ఒకే వేళలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించినా, అమలుకు మాత్రం నోచుకోలేదు. ఈ నేపథ్యంలో బడి వేళలు మారుస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తించనుంది. కానీ ఈ విషయంలో అవి ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.
అమల్లోకి రానున్న మార్పులివే...
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో సంవత్సరానికి 800 గంటల బోధన ఉండాలి. 6 నుంచి 8వ తరగతి వరకు వేయి గంటలు బోధించాలి. దీని ప్రకారం వారంలో 45 గంటలు తరగతులు నిర్వహించాలి. ఇందుకు అనుగుణంగా మార్పులు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ప్రైమరీ స్కూళ్లలో వారంలో ఉన్న 42 పీరియడ్లను 48కి పెంచుతారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న 48 పీరియడ్లు యథాతథంగా ఉంటాయి. ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం అమలవుతున్న 48 పీరియడ్లను 54కి పెంచుతారు.ప్రాథమిక పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3:35 గంటల వరకు నడుస్తుండగా, వాటిని 4:30 గంటల వరకు కొనసాగిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలు 9 గంటల నుంచి సాయంత్రం 4:05 గంటల వరకు నడుస్తుండగా, వాటి పనివేళలను సాయంత్రం 4:30 గంటల వరకు పెంచనున్నారు. ఈ స్కూళ్లలో ఉదయం 10:45 గంటల నుంచి 11 వరకు, మధ్యాహ్నం 2:50 నుంచి 3 గంటల వరకు స్వల్ప విరామం ఇస్తారు. 12:30 గంటల నుంచి 1:20 గంటల వరకు భోజన విరామం ఉంటుంది.
ఉన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9:45 గంటల నుంచి సాయంత్రం 4:40 గంటల వరకు నడుస్తున్నాయి. వాటిని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగిస్తారు. ఉదయం 11:20 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:10 వరకు స్వల్ప విరామం ఉంటుంది. మధ్యాహ్నం 12:50 నుంచి 1:40 వరకు భోజన విరామం ఇస్తారు.