Govind reddy
-
వ్యక్తిగా వినమ్రుడు... వ్యవస్థగా త్రివిక్రముడు
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎనభై ఆరేళ్ల రతన్ నావల్ టాటాను పరి చయడం చేయడమంటే సూర్యుణ్ణి దివిటీతో చూపే ప్రయత్నం చేయటం. టాటా గురించి మళ్లీ మళ్లీ చెప్పుకోవడం ఎందుకంటే క్యాలెండర్ మారిన ప్రతిసారీ ఆయన కొత్తగా కనిపిస్తారు. పారిశ్రామిక రంగాన్ని సమస్యలు చుట్టిముట్టిన ప్పుడల్లా ఆయన సరికొత్తగా వెలుగులీనుతారు. తోటి పారి శ్రామికవేత్తలకు మాత్రమే కాదు, సమాజం మొత్తానికి భరోసాగా నిలుస్తారు. బడా పారిశ్రామికవేత్తగానే కాదు... వ్యక్తిగా కూడా రతన్ టాటా సమున్నతుడు. చదువయ్యాక అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒకమ్మాయిపై రతన్ మనసు పారేసుకున్నారు. ఆమె కూడా ఆయన్ను ప్రేమించింది. ఈలోగా 1962లో భారత–చైనా యుద్ధం వచ్చింది. అంతే! ఈ వివాహానికి తొలుత అంగీకరించిన ఆమె తల్లిదండ్రులు భయంతో మీమాంసలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో నాయనమ్మ నవాజ్ బాయ్ టాటాకు ఒంట్లో బాగోలేదని కబురంది రతన్ భారత్ వెళ్లాల్సి వచ్చింది (రతన్‌కు పదేళ్ల వయసున్నప్పుడే తల్లితండ్రులు నావల్ టాటా, సూనీ టాటా విడాకులు తీసుకున్నారు. అందుకే రతన్ నాయనమ్మ పెంపకంలో పెరిగారు). అంతా సవ్యంగా పూర్తయి అమెరికా వెళ్లేసరికి ప్రియురాలు తల్లితండ్రుల మాట విని వేరే పెళ్లి చేసుకుంది. పర్యవసానంగా రతన్ బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఒకరోజు ఎల్ఈడీ టీవీ బిగించటానికి రతన్ టాటా ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లూ అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్, పైన ఒక బనీనుతో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్‌లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదాసీదాగా, పాతకాలం నాటి ఫర్నిచర్‌తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ! ‘సరైన నిర్ణయాలు’ తీసుకోవడంలో నాకు నమ్మకం లేదు. నేనొక నిర్ణయం తీసుకుంటాను. అది సరైనది అయ్యేలా చేస్తాను. అంతే...’ అని అన్నాడాయన ఒకసారి. అందుకే కావొచ్చు, ఆయన హయాంలో టాటా గ్రూపు ఆదాయం 40 రెట్లు మించి పెరిగింది. ఇవాళ టాటా గ్రూపు బ్రాండ్ విలువ 2,600 కోట్ల డాలర్లు. మొన్న మార్చి నాటికి ఆ గ్రూపు మార్కెట్ వ్యాల్యూ 21.1 లక్షల కోట్లు. ఆయన నెట్‌వర్త్ అక్షరాలా రూ. 8,250 కోట్లు! ఇది ముఖేశ్ అంబానీ నెట్‌వర్త్ రూ. 9,610 కోట్లతో పోలిస్తే కాస్త తక్కువే కావొచ్చు. మరో పారిశ్రామికవేత్త అదానీ నెట్‌వర్త్ 5,510 కోట్లతో పోలిస్తే కొంచెం ఎక్కువే కావొచ్చు. కానీ రాజకీయ రణరంగంలో ఆ ఇద్దరి పేర్లూ తప్ప రతన్ టాటా గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఆయనపై అస్త్రాలు సంధిస్తూ పార్టీలు పరస్పరం ఎన్నడైనా ఆరోపణలు చేసుకోవటం చూశామా? లేదు. అదీ రతన్ టాటా ప్రత్యేకత. సంస్థ ఎదగడమే కాదు... అనేకమంది జీవితాల్లో వెలుగులు పంచాలన్నది ఆయన సిద్ధాంతం. అందుకే ఇద్దరు పిల్లలున్న మధ్యతరగతి కుటుంబం ఒక స్కూటర్‌పై ఇరుక్కుని కూర్చుని హోరు వానలో ప్రయాణిస్తుండగా చూసి తనకు ‘నానో’ కారు ఐడియా వచ్చిందని రతన్ చెబితే దేశం విశ్వసించింది. టాటా గ్రూపు సంస్థలకు సామాజిక సేవంటే చాటింపు వేసుకుని మీడియాకు పోజులిచ్చే సందర్భం కాదు. నెరవేర్చి తీరాల్సిన పవిత్ర కర్తవ్యం. అందుకే ‘టాటా సన్స్’ ఈక్విటీల్లో 66 శాతం టాటా ట్రస్టుల చేతుల్లో ఉంటుంది. వాటిపై వచ్చే డివిడెండ్లు నేరుగా ట్రస్టులు నిర్వహించే సేవాకార్యక్రమాలకు తోడ్పడతాయి. ఇంకో సంగతి ప్రత్యేకించి చెప్పుకోవాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఈ మధ్య ఒక అంటువ్యాధిలా మారిన లే–ఆఫ్లకు టాటా గ్రూపు అనుబంధ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టీసీఎస్ పూర్తి వ్యతిరేకం. టాటా గ్రూప్‌లో సాల్ట్ నుంచి స్టీల్ వరకూ ఉన్న సంస్థల్లో సైతం ఎక్కడా సిబ్బందిని అన్యాయంగా తొలగించారన్న నింద ఏనాడూ రాలేదు. దేశ నిర్మాణంలో, మరీ ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో చేసిన గణనీయమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రతన్ టాటాకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించి గౌరవించింది. బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
దారి తప్పిన మునుగోడు ఉప ఎన్నిక
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో నరాలు తెగే ఉత్కంఠకు తెరతీసింది. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్వి ళ్లూరుతున్న బీజేపీకీ, అధి కార గులాబీ పార్టీకీ ఇక్కడ విజయం అనివార్యంగా మారింది. రాబోయే శాసనసభ ఎన్నికల పోరా టానికి ఇది కచ్చితంగా మొదటి అడుగు కాబో తోంది. కాంగ్రెస్ కూడా సర్వ శక్తులూ ఒడ్డుతున్నా ధన ప్రవాహమే చోదకశక్తిగా మారినందున ఆ పార్టీ దూకుడు కనబర్చలేకపోతోంది. ఢిల్లీలోనూ, రాష్ట్రం లోనూ ఉన్న అధికార పార్టీలపై ఉన్న వ్యతిరేకత పైనే హస్తం పార్టీ ఆశలన్నీ. అయితే ప్రచారంలో పుంజుకుంటున్న కాంగ్రెస్ మిగతా రెండు పార్టీల గెలుపు ఓటములను శాసించే స్థితిలో ఉంది. కాంగ్రెస్ తెచ్చుకునే ఓట్లను బట్టి ఫలితం ఎటైనా తిరగ బడొచ్చు. రాజధానికి అతి సమీపంలో ఉన్నా మును గోడు అభివృద్ధికి నోచుకోలేదు. 2.42 లక్షల ఓట ర్లున్న ఈ నియోజకర్గం ఫ్లోరోసిస్ నుంచి విముక్తమై ఇప్పుడిపుడే కోలుకుంటోంది. మునుగోడు బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు తమ తమ అభివృద్ధి ఎజెండాలను పేర్కొనడం కంటే పరస్పర విమ ర్శలు, తిట్లదండకాలతో వినోదం పంచుతు న్నాయి. మరోవైపు మెజారిటీ ఓటర్లు తమ ఓట్లకు దక్కే మూల్యంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మొత్తం మీద మునుగోడులో ఏ పార్టీ అభ్యర్థి ఎంత వెదజల్లుతారనేదే గెలుపును నిర్ణయించే ప్రధాన అంశం అయింది. రాజ్యాంగం లోని మూడో అధికరణ, ఆర్టికల్ 84 – 174 ప్రకారం పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రంతో పాటు ఒక ప్రమాణ పత్రం సమర్పిస్తారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్(ఈసీ) నియమాలను కచ్చితంగా పాటిస్తానని చెప్పడమే ఈ ప్రమాణ పత్రం ఉద్దేశం. కానీ జరుగుతున్నదేమిటి? అసెంబ్లీ అభ్యర్థి ప్రచార వ్యయం ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.40 లక్షలు దాటకూడదు. నామినేషన్ వేసిన రోజు నిర్వహించే ర్యాలీలు, ప్రచార హంగామాకే 50 లక్షల దాకా వెదజల్లు తున్న పరిస్థితి. నేతల ప్రసంగాలు వినడానికి రోడ్డుపై గంట సేపు నిలబడటానికి కార్యకర్తలు చేస్తున్న ఛార్జి రూ. 500 లేదా అంతకు మించి. ఊరేగింపులో ద్విచక్ర వాహనంతో పాల్గొంటే ఒక రేటు, కారుతో వస్తే ఇంకాస్త ఎక్కువ భత్యం ఇవ్వాల్సి వస్తోంది. ఉపఎన్నిక షెడ్యూల్ మొదలై నప్పటి నుంచీ రూ. 20 కోట్ల దాకా లెక్క చెప్పని డబ్బు, హవాలా మనీ పట్టుబడింది. ప్రధాన అభ్య ర్థుల ఎన్నికల వ్యయం రూ. 500 కోట్లు దాటు తుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మునుగోడులో మూడు ప్రధాన పార్టీల తరఫున దాదాపు 4 వేల మంది బయటి వాళ్లు తిష్ట వేసి ఉన్నారు. వీరి వాహనాల వ్యయం, బస, తిండి ఖర్చులు అభ్యర్థుల ఖాతాలో వేయాల్సి ఉంది. మునుగోడుకు చెందిన దాదాపు 40 వేల మంది హైదరాబాద్‌లో ఉద్యోగాలు, చిన్న వ్యాపా రాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చాలా మందికి నియోజకవర్గం వెలుపలి ప్రాంతాల్లో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. వాటిలో జమ అయ్యే నిధులను ఎలా లెక్కిస్తారు? పైగా పోలింగ్ రోజు నియోజకవర్గం వెలుపల ఉన్న వారందరినీ డబ్బు ముట్టచెప్పి, రవాణా ఖర్చులు చెల్లించి పిలిపి స్తున్నారు. ఒకప్పటిలా అభ్యర్థులు ప్రచారానికి మీడి యాలో ప్రకటనలు ఇవ్వడం లేదు. పెయిడ్ వార్తలు వేయించుకుని భారీ మొత్తం చెల్లిస్తున్నారు. దీన్ని గుర్తించి నిరూపించడం అంత తేలిక కాదు. ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లు, కుల సంఘ భవ నాలు, పేద వారికి ఇళ్లు కట్టిస్తామని ఇచ్చే హామీలు ఎన్నికల్లో గెలిస్తే నెరవేరుస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత చేసే వ్యయంపై ఎవరి నిఘా ఉంటుంది? దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మునుగోడు నిలవబోతోంది. ఓటుకు ఎంత చెల్లించి కొనుక్కుం టారనేది పోలింగుకు రెండు, మూడు రోజుల ముందు తెలవొచ్చు. మొత్తంమీద ఉప్పెనలా ప్రవహిస్తున్న ధనం ఈసీ నియమావళిని అపహాస్యం చేస్తోంది. 2019 సాధారణ ఎన్నికల్లో రూ. 50,000 కోట్ల బ్లాక్ మనీ చేతులు మారిందని ఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’ వెల్లడించింది. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలని ఆందో ళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత జరగాల్సిన ప్రక్షాళన గురించి, డబ్బు, మద్యం ప్రలోభాలు లేని స్వేచ్ఛా యుత ఎన్నికల గురించి అనేక చర్చలు జరిగాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నా అందులో భాగ స్వాములుగా ఉన్న రాజకీయ పార్టీలు పరివర్తనకు సిద్ధంగా లేనప్పుడు మునుగోడు లాంటి బై ఎలక్ష న్లలో అభ్యర్థుల చెల్లింపు శక్తే జయాపజయాలను నిర్దేశిస్తుంది. ఇటువంటి ఎలక్షన్ నిర్వహించడం కంటే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కువ ‘వితరణ’ కోట్ చేసిన అభ్యర్థి విజయం సాధించినట్టుగా ప్రక టించడం ఉత్తమం అనే నిస్పృహతో కూడిన సూచ నలు వినిపిస్తున్నాయి. ఇలా వచ్చిన డబ్బులో సగం ఓటర్ల ఖాతాలకు బదిలీచేసి మిగిలిన మొత్తాన్నీ అభివృద్ధి పనులకు వ్యయం చేసేలా రాజ్యాంగ సవరణ చేస్తే ఏ గొడవా ఉండదేమో! ప్రజాస్వామ్య విరుద్ధమనిపించినా జరుగుతున్నది అదే కదా!! బీటీ గోవింద రెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రేమంటే... అంత ఈజీ కాదు
పవన్ కల్యాణ్ ‘ఖుషి’ చిత్రంలోని ‘ప్రేమంటే సులువు కాదురా..’ పాట ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో రూపొందుతున్న ప్రేమకథా చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి, సిమ్మిదాస్ జంటగా గోవింద్‌రెడ్డి దర్శకత్వంలో భవనాసి రాంప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నందన్‌రాజ్ స్వరపరిచిన పాటలను సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి ఆవిష్కరించారు. రాజీవ్ మంచి విజయాలు సాధించి, పెద్ద హీరో కావాలని ఆయన ఆకాంక్షించారు. ‘‘ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన అత్యుత్తమ ప్రేమకథా చిత్రాల సరసన ఈ సినిమా నిలుస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని నిర్మాత చెప్పారు. దర్శకుడు బి.గోపాల్, నిర్మాతలు ‘మధుర’ శ్రీధర్, బెక్కెం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
సాక్షి, నెల్లూరు: ‘సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వస్తామనుకున్నాం. దురదృష్టవశాత్తు రాలేకపోయాం. అయినా వెరవం. కార్యకర్తలకు అండగా నిలబడతాం. వారికి ఏ చిన్న సమస్య వచ్చినా పార్టీ అండ ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించేలా కృషి చేద్దాం’ అని వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, అంబటి రాంబాబు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం జరి గింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కోవూరు, నెల్లూరుసిటీ, రూరల్, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, కావలి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమీక్షించారు. పార్టీ గెలుపోటములపై అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలను తెలుసుకున్నారు. పరిశీలకులుగా వచ్చిన రామచంద్రారెడ్డి, గోవిందరెడ్డి, అంబటి రాంబాబు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాలేదన్న బాధ అందరికీ ఉందన్నారు. ఆ బాధను మరిచి పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వైఎస్సార్సీపీ స్వల్ప ఓట్లతేడా అధికారానికి దూరమైందన్నారు. భవిష్యత్‌లో పార్టీని గ్రామస్థాయిలో మరింత పటిష్టం చేసి ముందుకు సాగుదామన్నారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, రూర ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సర్వేపల్లి నుంచి పార్టీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు మేయర్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్, ఆనం వెంకటరమణారెడ్డి, పాండురంగారెడ్డి, వహీద్‌బాషా పాల్గొన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటాం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాబోయే ఐదేళ్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడుకుంటామని పార్టీ ముఖ్యనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరులతో చెప్పారు. పార్టీ అభ్యర్థుల గెలుపోటములకు కారణాలను తెలుసుకునేందుకే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారన్నారు. పార్టీ పటిష్టతకు చర్యలు : డీసీ గోవిందరెడ్డి పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకుని వాటిని సరిదిద్ది పార్టీ పటిష్టతకు చర్యలు చేపట్టనున్నట్టు పరిశీలకుడు డీసీ గోవిందరెడ్డి విలేకరులతో చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. నేతలు, కార్యకర్తల అభిప్రాయాల నివేదికల ఆధారంగా పార్టీ అధినేత సైతం సమీక్షించి రాబోయే కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారన్నారు. వైఎస్సార్సీపీ స్వల్ప ఓట్లతోనే ఓటమి చెందిందన్నారు. దీనిని సరిదిద్దుకుని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని గోవిందరెడ్డి చెప్పారు. కార్యక ర్తలకు పార్టీ అండగా ఉంటుంది : అంబటి రాంబాబు ‘పార్టీ అధికారంలోకి వస్తుందని అందరం ఆశించాం. దురదృష్టవశాత్తు ఓటమి చెందాం. అయినా తిరిగి లేచి పార్టీ కోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది’ అని అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో చెప్పారు. వైఎస్సార్సీపీ 67 మంది శాసన సభ్యులను గెలవడం సామాన్య విషయం కాదన్నారు. పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. చిన్న సమస్య వచ్చినా పోరాటం సాగిస్తామన్నారు. కాంగ్రెస్ అంతరించిందన్నారు. అక్రమ కేసులు, బెదిరింపులకు వైఎస్సార్సీపీ శ్రేణులు బెదరవన్నారు. -
‘దుర్గం’ దేశంలో అల్లకల్లోలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాయదుర్గం నియోజకవర్గం టీడీపీలో పుట్టిన ముసలం ఆ పార్టీని నిలువునా దహించి వేస్తోంది. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ దీపక్‌రెడ్డికి పోటీగా ఉషారాణిని ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి తెరపైకి తెచ్చారు. తనకు టికెట్ ఇవ్వని పక్షంలో ఉషారాణికి అవకాశం ఇవ్వాలని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. ఇక మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులుతో కలిసి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి మంగళవారం రాత్రి అధినేత చంద్రబాబుతో సమావేశమై.. రాయదుర్గం నుంచి కాలవకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన దీపక్‌రెడ్డి.. అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని బుధవారం రాత్రి ప్రకటించారు. రాయదుర్గంలో టీడీపీ మూడు వర్గాలుగా చీలిపోవడంతో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే.. రెండున్నరేళ్ల క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు.. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డికి ఒప్పందం కుదిరింది. ఆ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి విజయానికి జేసీ దివాకర్‌రెడ్డి కృషి చేశారు. ఆ ఒప్పందంలో భాగంగానే రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో రాయదుర్గం టీడీపీ టికెట్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడైన దీపక్‌రెడ్డికి ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రభంజనంలో దీపక్‌రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. ఓడిపోయిన దీపక్‌రెడ్డినే రాయదుర్గం టీడీపీ ఇన్చార్జ్గా నియమించారు. అదే సమయంలో 2014 ఎన్నికల్లో కూడా తనకే టీడీపీ టికెట్ దక్కుతుందని దీపక్‌రెడ్డి భావించారు. కానీ.. రాయదుర్గం టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి కన్నేశారు. నియోజకవర్గంలో దీపక్‌రెడ్డికి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని.. తనకే టికెట్ ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం మూడున్నరేళ్లు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. వ్యూహం మార్చిన మెట్టు.. తనకు టికెట్ దక్కే అవకావం లేకపోవడంతో మెట్టు వ్యూహం మార్చారు. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఉషారాణిని.. జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ వద్దకు మెట్టు తీసుకెళ్లారు. దేవెగౌడ ద్వారా చంద్రబాబుకు లేఖ రాయించి.. ఉషారాణికి టికెట్ ఇప్పించాలని కోరారు. చంద్రబాబూకు దేవేగౌడకు ఉన్న సంబంధాల రీత్యా ఉషారాణిని నియోజకవర్గంలో పనిచేసుకోవాలని ఆయన సూచించారు. ఇదే అదనుగా తీసుకున్న ఉషారాణి నియోజకవర్గంలో విసృ్తతంగా పర్యటిస్తున్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఉషారాణి తనకు పోటీగా పర్యటిస్తోండటంతో దీపక్‌రెడ్డి తీవ్రంగా ఆగ్రహించారు. ఆమె పర్యటనలను అడ్డుకునేలా తన వర్గీయులను ఉసిగొల్పారు. ఎమ్మెల్సీ మెట్టు, ఉషారాణి ఒక వర్గంగా.. దీపక్‌రెడ్డి మరో వర్గంగా విడిపోవడంతో ఆ స్థానంపై కాలవ శ్రీనివాసులు కన్నేశారు. మంగళవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశం కావాలని తొలుత కాలవ భావించారు. తనకు తోడుగా మరో బీసీ నేత ఉంటే బలం చేకూరుతుందనే భావనతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని కూడా తీసుకెళ్లారు. ఇద్దరూ కలిసి చంద్రబాబుతో అర్ధగంట పాటు చర్చించారు. రాయదుర్గంలో తన సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయని.. ఇరు వర్గాలు విభేదిస్తున్న దృష్ట్యా, ఆ టికెట్ తనకు కేటాయించాలని చంద్రబాబును కాలవ కోరారు. ఈ ప్రతిపాదనను బీకే పార్థసారథి బలపరిచారు. అనంతపురం లోక్‌సభ, తాడిపత్రి శాసనసభ టికెట్లు జేసీ బ్రదర్స్‌కు ఇస్తోన్న నేపథ్యంలో.. రాయదుర్గం టికెట్‌ను వారి అల్లుడైన దీపక్‌రెడ్డికి కేటాయిస్తే ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు పంపినట్లు అవుతుందని వారిద్దరూ వాదించారు. ఈ వాదన విన్న చంద్రబాబు.. ‘చూద్దాం.. చేద్దాం’ అంటూ కాలవకు ఎలాంటి హామీ ఇవ్వనట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. దూకుడు పెంచిన దీపక్‌రెడ్డి.. ఎమ్మెల్సీ మెట్టు, ఉషారాణి ఓ వైపు.. కాలవ, బీకే మరో వైపు రాయదుర్గం టికెట్ కోసం ప్రయత్నిస్తోండటంపై దీపక్‌రెడ్డి మండిపడుతున్నారు. రాయదుర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో తాను పోటీ చేసి, భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేశానని ఆయన చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్టీని వీడలేదని, శ్రేణులకు అండగా ఉన్నానని అంటున్నారు. కానీ.. తనను అధిష్టానం గుర్తించడం లేదని వాపోతున్నారు. నియోజకవర్గంలో శ్రేణులు మొత్తం తననే అభ్యర్థిగా నిలపాలని డిమాండ్ చేస్తున్నా.. అధిష్టానం చెవికెక్కించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గం అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని బుధవారం ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటన ఆధారంగా దీపక్‌రెడ్డిపై అటు ఎమ్మెల్సీ మెట్టు, ఉషారాణి.. ఇటు కాలవ, బీకేలు గురువారం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు.