రతన్ టాటా
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎనభై ఆరేళ్ల రతన్ నావల్ టాటాను పరి చయడం చేయడమంటే సూర్యుణ్ణి దివిటీతో చూపే ప్రయత్నం చేయటం. టాటా గురించి మళ్లీ మళ్లీ చెప్పుకోవడం ఎందుకంటే క్యాలెండర్ మారిన ప్రతిసారీ ఆయన కొత్తగా కనిపిస్తారు. పారిశ్రామిక రంగాన్ని సమస్యలు చుట్టిముట్టిన ప్పుడల్లా ఆయన సరికొత్తగా వెలుగులీనుతారు. తోటి పారి శ్రామికవేత్తలకు మాత్రమే కాదు, సమాజం మొత్తానికి భరోసాగా నిలుస్తారు.
బడా పారిశ్రామికవేత్తగానే కాదు... వ్యక్తిగా కూడా రతన్ టాటా సమున్నతుడు. చదువయ్యాక అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒకమ్మాయిపై రతన్ మనసు పారేసుకున్నారు. ఆమె కూడా ఆయన్ను ప్రేమించింది. ఈలోగా 1962లో భారత–చైనా యుద్ధం వచ్చింది.
అంతే! ఈ వివాహానికి తొలుత అంగీకరించిన ఆమె తల్లిదండ్రులు భయంతో మీమాంసలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో నాయనమ్మ నవాజ్ బాయ్ టాటాకు ఒంట్లో బాగోలేదని కబురంది రతన్ భారత్ వెళ్లాల్సి వచ్చింది (రతన్‌కు పదేళ్ల వయసున్నప్పుడే తల్లితండ్రులు నావల్ టాటా, సూనీ టాటా విడాకులు తీసుకున్నారు.
అందుకే రతన్ నాయనమ్మ పెంపకంలో పెరిగారు). అంతా సవ్యంగా పూర్తయి అమెరికా వెళ్లేసరికి ప్రియురాలు తల్లితండ్రుల మాట విని వేరే పెళ్లి చేసుకుంది. పర్యవసానంగా రతన్ బ్రహ్మచారిగానే ఉండిపోయారు.
ఒకరోజు ఎల్‌ఈడీ టీవీ బిగించటానికి రతన్ టాటా
ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లూ అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్, పైన ఒక బనీనుతో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్‌లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదాసీదాగా, పాతకాలం నాటి ఫర్నిచర్‌తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ!
‘సరైన నిర్ణయాలు’ తీసుకోవడంలో నాకు నమ్మకం లేదు. నేనొక నిర్ణయం తీసుకుంటాను. అది సరైనది అయ్యేలా చేస్తాను. అంతే...’ అని అన్నాడాయన ఒకసారి. అందుకే కావొచ్చు, ఆయన హయాంలో టాటా గ్రూపు ఆదాయం 40 రెట్లు మించి పెరిగింది. ఇవాళ టాటా గ్రూపు బ్రాండ్ విలువ 2,600 కోట్ల డాలర్లు.
మొన్న మార్చి నాటికి ఆ గ్రూపు మార్కెట్ వ్యాల్యూ 21.1 లక్షల కోట్లు. ఆయన నెట్‌వర్త్ అక్షరాలా రూ. 8,250 కోట్లు! ఇది ముఖేశ్ అంబానీ నెట్‌వర్త్ రూ. 9,610 కోట్లతో పోలిస్తే కాస్త తక్కువే కావొచ్చు. మరో పారిశ్రామికవేత్త అదానీ నెట్‌వర్త్ 5,510 కోట్లతో పోలిస్తే కొంచెం ఎక్కువే కావొచ్చు.
కానీ రాజకీయ రణరంగంలో ఆ ఇద్దరి పేర్లూ తప్ప రతన్ టాటా గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఆయనపై అస్త్రాలు సంధిస్తూ పార్టీలు పరస్పరం ఎన్నడైనా ఆరోపణలు చేసుకోవటం చూశామా? లేదు. అదీ రతన్ టాటా ప్రత్యేకత.
సంస్థ ఎదగడమే కాదు... అనేకమంది జీవితాల్లో వెలుగులు పంచాలన్నది ఆయన సిద్ధాంతం. అందుకే ఇద్దరు పిల్లలున్న మధ్యతరగతి కుటుంబం ఒక స్కూటర్‌పై ఇరుక్కుని కూర్చుని హోరు వానలో ప్రయాణిస్తుండగా చూసి తనకు ‘నానో’ కారు ఐడియా వచ్చిందని రతన్ చెబితే దేశం విశ్వసించింది.
టాటా గ్రూపు సంస్థలకు సామాజిక సేవంటే చాటింపు వేసుకుని మీడియాకు పోజులిచ్చే సందర్భం కాదు. నెరవేర్చి తీరాల్సిన పవిత్ర కర్తవ్యం. అందుకే ‘టాటా సన్స్’ ఈక్విటీల్లో 66 శాతం టాటా ట్రస్టుల చేతుల్లో ఉంటుంది. వాటిపై వచ్చే డివిడెండ్లు నేరుగా ట్రస్టులు నిర్వహించే సేవాకార్యక్రమాలకు తోడ్పడతాయి.
ఇంకో సంగతి ప్రత్యేకించి చెప్పుకోవాలి. సాఫ్ట్‌వేర్ రంగంలో ఈ మధ్య ఒక అంటువ్యాధిలా మారిన లే–ఆఫ్‌లకు టాటా గ్రూపు అనుబంధ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ టీసీఎస్ పూర్తి వ్యతిరేకం. టాటా గ్రూప్‌లో సాల్ట్ నుంచి స్టీల్ వరకూ ఉన్న సంస్థల్లో సైతం ఎక్కడా సిబ్బందిని అన్యాయంగా తొలగించారన్న నింద ఏనాడూ రాలేదు.
దేశ నిర్మాణంలో, మరీ ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో చేసిన గణనీయమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రతన్ టాటాకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించి గౌరవించింది.
బి.టి. గోవిందరెడ్డి
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment