Govt failure
-
ఏం కొనేటట్లు లేదు...ఏం తినేటట్లు లేదు
సాక్షి, ఆమదాలవలస రూరల్ : కొన్ని రోజులుగా ఎండలతో పాటు కూరగాయల ధరలు కూడా పెరుగుతుండడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఇదివరకు కొద్దిపాటి సొమ్ముతో మార్కెట్‌కు వెళ్తే వారం రోజులకు సరిపడా సరుకులు వచ్చేవని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని వాపోతున్నారు. ఇలాగే ధరలు కొనసాగితే పూట గడవడం కూడా కష్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దడ పుట్టిస్తున్న ధరలు బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు బజార్ దుకాణాల్లో కూడా అధిక ధరలే ఉన్నాయి. దీంతో అరకొరగా కూరగాయలు కొనుగోలు చేసి పొదుపుగా వాడుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కానీ ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తనట్లు వ్యవరిస్తోంది. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాంసం ప్రియులకు చేదు వార్త కూరగాయల ధరలతో పాటు చికెన్ ధరలు కూడా పెరుగుతుండడంతో మాంసం ప్రియులు చికెన్ తినే పరిస్థితి లేదు. బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గుతుండడంతో చికెన్ ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కిలో చికెన్ ధర రిటైల్ మార్కెట్లో రూ.160లుగా ఉంది. ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున ధరలు మరో రూ.20 నుంచి రూ.50 పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ధరలు అదుపు చేయాలి ధరలు నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుడు మూడుపూటలా తినే పరిస్థితి లేదు. ధరల దెబ్బతో ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పప్పుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -కూన రామకృష్ణ, కృష్ణాపురం ఏమీ కొనే పరిస్థితి లేదు గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో కూరగాయల ధరలు ఆమాంత పెరిగిపోయాయి. దీనివలన ఏమీ కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. ధరలను ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. -బొడ్డేపల్లి రవికుమార్, తిమ్మాపురం -
ఉద్దానంపై సర్కార్ నిర్లక్ష్యం
కవిటి/సోంపేట: తిత్లీ తుపానుతో కకావికలమైన ఉద్దానం ప్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భీకర తుపానుకు సర్వస్వం కోల్పోయిన కొబ్బరి రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో కూడా పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీ ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, పలువురు పార్టీ నేతలు కవిటి, సోంపేట మండలాల్లో సోమవారం పర్యటించారు. కవిటిలో ఉమారెడ్డి, ధర్మాన మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీరు కూడా అందించలేని నిస్సహాయ స్థితిలో, కరెంటు అందించలేని దుస్థితిలో పాలన దిగజారిందన్నారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో సర్కార్ తీరుకు నిరసనగా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం విషయంలో ఏ ఒక్క రైతు కూడా సంతృప్తిగా లేరన్నారు. కొబ్బరి చెట్టుకు 1200 రూపాయల పరిహారం ప్రకటన కంటితుడుపు చర్యగా ఉందని ఉమ్మారెడ్డి విమర్శించా రు. సుమారు తొమ్మిదేళ్ల పాటు ఎటువంటి ఫలసాయం దక్కని రైతుకు ఇంత టి ఘోరమైన పరిహార ప్రకటన ముఖ్య మంత్రి చేయడం దురదృష్టకరమన్నారు. కనీసం చెట్టుకు రూ.5000 అందించాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో సంభవించిన తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. సీఎం చంద్రబాబు నుంచి పలువురు మంత్రులు వచ్చినా ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన మంచినీటిని అందించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని.. అందుకే ప్రజలు ఆగ్రహావేశాలతో భగ్గుమంటున్నారన్నారు. నష్టపరిహారాల ప్రకటనలో కూడా కొబ్బరిరైతు పట్ల ప్రభుత్వ వివక్షత వ్యక్తమైందనిన్నారు. ఈ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, ఇచ్ఛాపురం సమన్వయకర్త పిరియా సాయిరాజ్, రాష్ట్రకార్యదర్శి నర్తు రామారావు, మామిడి శ్రీకాంత్, కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, కంచిలి జెడ్పీటీసీ సభ్యుడు జామి జయ,ఇచ్ఛాపురం మున్సి పల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి , సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి, డాక్టర్ దాస్, మంగి గణపతి, పిఎం తిలక్, హనుమంతు కిరణ్‌కుమార్ తదితర నేతలు పాల్గొన్నారు. ఆ సాయం సరిపోదు వైఎస్సార్ సీపీ నేతల ఎదుట వాపోయిన సోంపేట, కంచిలి రైతులు సోంపేట/కంచిలి: తుపాను దెబ్బకు పూర్తిగా నష్ట పోయామని, ప్రభుత్వం అందజేస్తామన్న సహాయం ఎటూ సరిపోదని కంచిలి మండలం కుత్తుమ, సోంపేట మండలం రుషికుడ్డ, కొర్లాం గ్రామం రైతులు వైఎస్సార్ సీపీ నేతల ఎదుట వాపోయారు. సోంపేట, కంచిలి మండలాల్లో ధర్మాన ప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శ్రీకాకుళం జిల్లా పార్ల మెంటరీ నియోజకవర్గ సమన్వయక్తర దువ్వాడ శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, పిరియా సాయిరాజ్, రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగాగా రైతులతో ఉమ్మారెడ్డి, ధర్మాన మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తామన్న నష్ట పరిహారం సరిపోతుందా అని ఆరా తీశారు. దీనికి వారు స్పందిస్తూ ప్రభుత్వం ప్రకటించిన సాయం ఎటూ సరిపోదన్నారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వం తరం కాదని వాపోయారు. కుత్తుమ గ్రామానికి చెందిన రైతులు మన్మథరావు, జి.వైకుంఠరావు, రవి, బొన్నయ్య తదితరులు మాట్లాడుతూ తుపానుతో తీవ్రంగా నష్టపోయామన్నారు. ఎకరానికి సుమారు 50 కొబ్బరి చెట్లు వరకు నేలకొరిగా యని, ఉన్న చెట్లు కూడా పూర్తిగా పాడైపోయావన్నారు. పది సంవత్సరాల వరకు రైతులకు ఎటువంటి ఆదాయం ఉండదని ఆవేదన చెప్పారు. రైతులను ఆదుకోవాలంటే రైతు కమిటీలతో సమావేశం నిర్వహించి.. ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఎటువంటి సంప్రదింపులు జరపకుండా కొబ్బరి చెట్టుకు రూ. 1200 రూపాయలు ప్రకటించడం దారుణమన్నారు. తుపాను వచ్చి నాలుగు రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందలేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటసీ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్.దాసు, ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్మన్ పిలక రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ మంగి గణపతి, మండల కమిటీ అధ్యక్షుడు తడక జోగారావు, కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, ఉలాల శేషుయాదవ్, పూడి నేతాజి, రజనికుమార్ దొలాయి, మడ్డు రాజారావు, మార్పు సూర్యం, త్రినాథ, రవి పాల్గొన్నారు. -
విషాదం
పరమపావని గోదావరి నదిలో పుష్కరస్నానం... కోటిపుణ్యఫలం. ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. ముందుగానే చేసుకున్న ఏర్పాట్ల ప్రకారం రాజమండ్రికి పయనమయ్యారు. పుణ్యకాల వేళ స్నానమాచరించేందుకు సన్నద్ధమయ్యారు. ఇంతలో దుర్ఘటన. ఒక్కసారిగా తోపులాట... ఎవరెటు వెళ్తున్నారో తెలీదు... తప్పుకునే మార్గం కానరాలేదు... అంతే ఒక్కొక్కరుగా కింద పడ్డారు. ఎవరెవరో తొక్కేశారు. ఆ గోదావరి సాక్షిగా జిల్లాకు చెందిన తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. విషయం టీవీ మాద్యమాల ద్వారా తెలుసుకున్న వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపారు. శ్రీకాకుళం సిటీ : కోటిఆశలతో గోదావరి పుష్కరాల్లో స్నానమాచరించేందుకు రాజమండ్రి చేరుకున్న జిల్లా వాసులు తీరని విషాదం మూటగట్టుకున్నారు. అనుకోని విధంగా జరిగిన తొక్కిసలాటలో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. కిందపడి దారుణంగా నలిగిపోయారు. అందులో ఊపిరాడని స్థితిలో తొమ్మిదిమంది జిల్లావాసులు మృత్యువాత పడ్డారు. ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న పుష్కరాలకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులకు కూడా నడిపింది. స్నానాలకు తరలిరావాలని రకరకాలుగా ప్రచారం చేశారు. వారి పిలుపునందుకున్న ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కానీ జరిగినదుర్ఘటన జిల్లావాసుల్ని తీవ్రంగా కలచివేసింది. తమవారికోసం ఇక్కడ వేచిఉన్నవారు ఆందోళన చెందారు. మరణించినవారి కుటుంబసభ్యులు తీరని విషాదంలో మునిగిపోయారు. కొడుకుతో కోటి ఆశలతో... చిన్నదిమలి(భామిని): చాలా ఏళ్ల తరువాత వచ్చిన అవకాశంతో కుమారుడు, కోడలితో కలసి వెళ్లిన ఓ వృద్ధురాలు రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మృత్యువాత పడింది. భామిని మండలం చిన్నదిమిలికి చెందిన సాసుపిల్లి అమ్మాయమ్మ(77) కొడుకు సాసుపిల్లి లక్ష్మణరావు, కోడలు రవణమ్మలతో కలసి మంగళవారం రాజమండ్రి పుష్కరఘాట్‌లో పవిత్ర పుష్కర స్నానానికి వెళుతుండగా అశువులు బాసింది. అమ్మాయమ్మకు ముగ్గురు కుమారులు, నలుగురు కూతుళ్ళున్నారు. వారంతా తల్లి మరణవార్త విని తల్లడిల్లారు. అమె కడసారి చూపుకోసం రాజమండ్రి తరలి వెళ్లారు. కుటుంబ సభ్యులంతా రాజమండ్రిలోనే ఉండటంలో అక్కడే అంతిమ సంస్కారం చేయనున్నట్టు బంధువులు తెలిపారు. ఇప్పటికే చిన్నదిమిలి, కీసర, కోసలి గ్రామాల నుంచి బంధువులు తరలి వెళ్ళారు. భర్త కళ్లెదుటే... సంతబొమ్మాళి: మండలంలోని కోటపాడు పంచాయతీ కాశీపురం గ్రామానికి చెందిన లమ్మత తిరుపతమ్మ(37) భర్త కళ్లెదుటే తోపులాటలో ఇరుక్కుని తుదిశ్వాస విడిచింది. రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి పుష్కర స్నానంకోసం మంగళవారం భర్త రమణయ్యతో పాటు గ్రామంలో 30 మందితో కలిసి మండలంలోని దండుగోపాలపురం రైల్వే గేటు వద్ద సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈఎంయూ రైల్లో వెళ్లి విశాఖలో స్పెషల్ ట్రైన్ ఎక్కి రాజమండ్రి చేరుకున్నారు. పవిత్ర పుష్కర స్నానం చేసేందుకు కోటగుమ్మం పుష్కర ఘాట్‌కు వెళ్లగాగంటల తరబడి గేట్లు మూసేసి, అటు తరువాత ఒకేసారి తెరవడంతో తోపులాట జరిగి తిరుపతమ్మ మృతి చెందింది. ఈమె మృతి పట్ల స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. బోరుమన్న సరసనపల్లి రేగిడి: గోదావరి పుష్కరాలు రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. పుష్కర స్నానాలకు వెళతామని గత వారం రోజులు నుంచి ప్లాన్ చేసుకొని వెళ్లిన కొద్ది గంటల్లోనే మృత్యువు వారిని కబళించడంతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది. మండలంలోని సరసనాపల్లి గ్రామంలో రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందారు. పుణ్యస్నానాల కోసం కోటిలింగాల రేవు వద్దకు మంగళవారం ఉదయం ఆరు గంటలకు చేరుకున్నారు. ఒక్కసారిగా భక్తుల మద్య భారీ తోపులాట జరిగింది. ఈ ఘటనలో పైల పెంటంనాయుడు అలియాస్ రామకృష్ణ(65), జడ్డు అప్పలనరసమ్మ(60) మృతిచెందారు. విషయం గ్రామానికి చేరడంతో వారి కుటుంబాలకుచెందిన వారంతా బోరున రోదిస్తున్నారు. ఇదే గ్రామం నుంచి వేరువేరుగా సుమారు 70 మంది వరకు మొదటి రోజున గోదావరి పుష్కరాల్లో స్నానం ఆచరించేందుకు తరలివెళ్లారు. వీరంతా ఏమయ్యారని గ్రామస్తులంతా ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఉన్న వారికి ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ బి.సూరమ్మ, ఆర్ఐ హనుమంతురావు, వీఆర్ఓ శివప్రసాద్‌లు గ్రామానికి చేరుకొని బాధితులను ఓదార్చారు. పెద్ద దిక్కు కోల్పోవడంతో వీధిన పడ్డ కుటుంబం... జడ్డు అప్పలనరసమ్మ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈమె భర్త జడ్డు లక్ష్మునాయుడు 20 సంవత్సరాల క్రితమే మృతిచెందారు. వీరికి అప్పలనారాయణ, శొంఠ్యాన మంగమ్మ, దాసరి సుజాతతోపాటు కుమారుడు జడ్డు నాగభూషణరావు ఉన్నారు. వీరందరినీ అప్పలనరసమ్మ కాయకష్టంచేసి పోషిస్తోంది. నాగభూషణరావు విశాఖపట్నం టింబర్డిపోలో రోజువారి కూలీగా పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె అప్పలనారాయణ మినహా మిగిలిన ఇద్దరు కుమార్తెలకు వివాహం అయింది. తల్లి మరణించడంతో వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు. కళ్లముందే భర్త మృతి.... పుణ్యం వస్తుందని గోదావరి పుష్కరాలకు తన భార్య అప్పలనరసమ్మ, పెద్ద కూతురు లక్ష్మీలను వెంటపెట్టుకొని పైల పెంటంనాయుడు రాజమండ్రి వెళ్లారు. తొక్కిసలాటలో కళ్లముందే భర్త పెంటంనాయుడు మృతిచెందడంతో భార్యతోపాటు కుమార్తె బోరున విలపించిన సంఘటన కుటుంబ సభ్యులను కలిచివేసింది. ఇంటందరూ శుభ్రంగా ఉండండి...పుష్కరాలకు వెళ్లి వస్తామని సరదాగా వెళ్లిన ఆయన విగతజీవిగా రావడంతో కుమార్తెలు చిన్నమ్మడు, అనూరాధ, కోడలు లక్ష్మి కన్నీరుమున్నీరవుతున్నారు.