విషాదం
పరమపావని గోదావరి నదిలో పుష్కరస్నానం... కోటిపుణ్యఫలం. ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. ముందుగానే చేసుకున్న ఏర్పాట్ల ప్రకారం రాజమండ్రికి పయనమయ్యారు. పుణ్యకాల వేళ స్నానమాచరించేందుకు సన్నద్ధమయ్యారు. ఇంతలో దుర్ఘటన. ఒక్కసారిగా తోపులాట... ఎవరెటు వెళ్తున్నారో తెలీదు... తప్పుకునే మార్గం కానరాలేదు... అంతే ఒక్కొక్కరుగా కింద పడ్డారు. ఎవరెవరో తొక్కేశారు. ఆ గోదావరి సాక్షిగా జిల్లాకు చెందిన తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. విషయం టీవీ మాద్యమాల ద్వారా తెలుసుకున్న వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపారు.
శ్రీకాకుళం సిటీ : కోటిఆశలతో గోదావరి పుష్కరాల్లో స్నానమాచరించేందుకు రాజమండ్రి చేరుకున్న జిల్లా వాసులు తీరని విషాదం మూటగట్టుకున్నారు. అనుకోని విధంగా జరిగిన తొక్కిసలాటలో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. కిందపడి దారుణంగా నలిగిపోయారు. అందులో ఊపిరాడని స్థితిలో తొమ్మిదిమంది జిల్లావాసులు మృత్యువాత పడ్డారు. ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న పుష్కరాలకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులకు కూడా నడిపింది. స్నానాలకు తరలిరావాలని రకరకాలుగా ప్రచారం చేశారు. వారి పిలుపునందుకున్న ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కానీ జరిగినదుర్ఘటన జిల్లావాసుల్ని తీవ్రంగా కలచివేసింది. తమవారికోసం ఇక్కడ వేచిఉన్నవారు ఆందోళన చెందారు. మరణించినవారి కుటుంబసభ్యులు తీరని విషాదంలో మునిగిపోయారు.
కొడుకుతో కోటి ఆశలతో...
చిన్నదిమలి(భామిని): చాలా ఏళ్ల తరువాత వచ్చిన అవకాశంతో కుమారుడు, కోడలితో కలసి వెళ్లిన ఓ వృద్ధురాలు రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మృత్యువాత పడింది. భామిని మండలం చిన్నదిమిలికి చెందిన సాసుపిల్లి అమ్మాయమ్మ(77) కొడుకు సాసుపిల్లి లక్ష్మణరావు, కోడలు రవణమ్మలతో కలసి మంగళవారం రాజమండ్రి పుష్కరఘాట్‌లో పవిత్ర పుష్కర స్నానానికి వెళుతుండగా అశువులు బాసింది. అమ్మాయమ్మకు ముగ్గురు కుమారులు, నలుగురు కూతుళ్ళున్నారు. వారంతా తల్లి మరణవార్త విని తల్లడిల్లారు. అమె కడసారి చూపుకోసం రాజమండ్రి తరలి వెళ్లారు. కుటుంబ సభ్యులంతా రాజమండ్రిలోనే ఉండటంలో అక్కడే అంతిమ సంస్కారం చేయనున్నట్టు బంధువులు తెలిపారు. ఇప్పటికే చిన్నదిమిలి, కీసర, కోసలి గ్రామాల నుంచి బంధువులు తరలి వెళ్ళారు.
భర్త కళ్లెదుటే...
సంతబొమ్మాళి: మండలంలోని కోటపాడు పంచాయతీ కాశీపురం గ్రామానికి చెందిన లమ్మత తిరుపతమ్మ(37) భర్త కళ్లెదుటే తోపులాటలో ఇరుక్కుని తుదిశ్వాస విడిచింది. రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి పుష్కర స్నానంకోసం మంగళవారం భర్త రమణయ్యతో పాటు గ్రామంలో 30 మందితో కలిసి మండలంలోని దండుగోపాలపురం రైల్వే గేటు వద్ద సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈఎంయూ రైల్లో వెళ్లి విశాఖలో స్పెషల్ ట్రైన్ ఎక్కి రాజమండ్రి చేరుకున్నారు. పవిత్ర పుష్కర స్నానం చేసేందుకు కోటగుమ్మం పుష్కర ఘాట్‌కు వెళ్లగాగంటల తరబడి గేట్లు మూసేసి, అటు తరువాత ఒకేసారి తెరవడంతో తోపులాట జరిగి తిరుపతమ్మ మృతి చెందింది. ఈమె మృతి పట్ల స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈమెకు ఇద్దరు కుమార్తెలున్నారు.
బోరుమన్న సరసనపల్లి
రేగిడి: గోదావరి పుష్కరాలు రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. పుష్కర స్నానాలకు వెళతామని గత వారం రోజులు నుంచి ప్లాన్ చేసుకొని వెళ్లిన కొద్ది గంటల్లోనే మృత్యువు వారిని కబళించడంతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది. మండలంలోని సరసనాపల్లి గ్రామంలో రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందారు. పుణ్యస్నానాల కోసం కోటిలింగాల రేవు వద్దకు మంగళవారం ఉదయం ఆరు గంటలకు చేరుకున్నారు. ఒక్కసారిగా భక్తుల మద్య భారీ తోపులాట జరిగింది. ఈ ఘటనలో పైల పెంటంనాయుడు అలియాస్ రామకృష్ణ(65), జడ్డు అప్పలనరసమ్మ(60) మృతిచెందారు. విషయం గ్రామానికి చేరడంతో వారి కుటుంబాలకుచెందిన వారంతా బోరున రోదిస్తున్నారు. ఇదే గ్రామం నుంచి వేరువేరుగా సుమారు 70 మంది వరకు మొదటి రోజున గోదావరి పుష్కరాల్లో స్నానం ఆచరించేందుకు తరలివెళ్లారు. వీరంతా ఏమయ్యారని గ్రామస్తులంతా ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఉన్న వారికి ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ బి.సూరమ్మ, ఆర్‌ఐ హనుమంతురావు, వీఆర్‌ఓ శివప్రసాద్‌లు గ్రామానికి చేరుకొని బాధితులను ఓదార్చారు.
పెద్ద దిక్కు కోల్పోవడంతో వీధిన పడ్డ కుటుంబం...
జడ్డు అప్పలనరసమ్మ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈమె భర్త జడ్డు లక్ష్మునాయుడు 20 సంవత్సరాల క్రితమే మృతిచెందారు. వీరికి అప్పలనారాయణ, శొంఠ్యాన మంగమ్మ, దాసరి సుజాతతోపాటు కుమారుడు జడ్డు నాగభూషణరావు ఉన్నారు. వీరందరినీ అప్పలనరసమ్మ కాయకష్టంచేసి పోషిస్తోంది. నాగభూషణరావు విశాఖపట్నం టింబర్‌డిపోలో రోజువారి కూలీగా పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె అప్పలనారాయణ మినహా మిగిలిన ఇద్దరు కుమార్తెలకు వివాహం అయింది. తల్లి మరణించడంతో వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు.
కళ్లముందే భర్త మృతి....
పుణ్యం వస్తుందని గోదావరి పుష్కరాలకు తన భార్య అప్పలనరసమ్మ, పెద్ద కూతురు లక్ష్మీలను వెంటపెట్టుకొని పైల పెంటంనాయుడు రాజమండ్రి వెళ్లారు. తొక్కిసలాటలో కళ్లముందే భర్త పెంటంనాయుడు మృతిచెందడంతో భార్యతోపాటు కుమార్తె బోరున విలపించిన సంఘటన కుటుంబ సభ్యులను కలిచివేసింది. ఇంటందరూ శుభ్రంగా ఉండండి...పుష్కరాలకు వెళ్లి వస్తామని సరదాగా వెళ్లిన ఆయన విగతజీవిగా రావడంతో కుమార్తెలు చిన్నమ్మడు, అనూరాధ, కోడలు లక్ష్మి కన్నీరుమున్నీరవుతున్నారు.