ఆ నలుగురు... ఒకే కుటుంబానికి చెందినవారు
శ్రీకాకుళంసిటీ/ఆమదాలవలస/సంతకవిటి: శ్రీకాకుళం జిల్లాలోని ఒకే కుటుబానికి చెందిన 14మంది కలసి పుష్కరాలకు వెళ్లగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో అందులో నలుగురు మృతి చెందారు. వారిలో తల్లీకూతుళ్లే ముగ్గురు ఉండటం విషాదం. సంతకవిటి మండలం బొద్దూరుకు చెందిన కొత్తకోట కళావతి(70)కి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు రాజు, కోడలు జానకి, వారిద్దరు పిల్లలు బొద్దాంలోనే నివాసం ఉంటున్నారు. పెద్దకుమార్తె పొట్నూరు అమరావతి(50) ఆమదాలవలసలో ఉంటోంది. ఆమె భర్త జనార్దనరావు ఆమదాలవలస గేటువద్ద కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటారు.
చిన్నకుమార్తె పొట్నూరు అనంతలక్ష్మి(40) శ్రీకాకుళంలో ఉంటోంది. ఈమె భర్త ఆస్పత్రి రోడ్డులోని బావాజీనగర్ తోటలో హోటల్ నడుపుతున్నారు. వీరి పిల్లలు బాగ్యరాజు, హరిణి, బంధువులు బరాటం కామేశ్వరరావు, ఇందిర(వీరిది చిరువ్యాపారం), వారి కుమారుడు బరాటం ప్రశాంత్(పట్టణంలో వికాస్ టాలెంట్ స్కూల్‌లో ఆరవ తరగతి చదువుతున్నాడు.)లతో గోదావరి పుష్కరాలకు పయనమయ్యారు.
ఈ నెల 12వ తేదీ మద్యాహ్నం 2.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ నుంచి అన్నవరం వరకు రైలులో పయనమయ్యారు. అక్కడ సత్యదేవుని దర్శనం అనంతరం 13వ తేదీ ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. అక్కడ ఇందిర బంధువులు నవీన్ ఇంట్లో బస చేసి అక్కడి నుంచి మంగళవారం పుష్కర స్నానాలకు వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో కళావతి, అమరావతి, అనంతలక్ష్మితోపాటు ప్రశాంత్ మృత్యువాత పడ్డారు.
బొద్దూరులో విషాదాం...
సంతకవిటి మండలంలోని బొద్దూరు గ్రామంలో వీరి మరణ వార్తతో విషాదఛాయలు అలముకున్నాయి. కళావతి కుమారుడు అక్కయ్యరాజు రాజాం సెంట్రల్ బ్యాంకులో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నారు. వీరి సమాచారం కోసం గ్రామస్తులు ముమ్మర ప్రయత్నాలు జరుపుతున్నారు. అక్కయ్యరాజు ఫోన్ ఓ మహిళ వద్ద ఉండడంతో అక్కడి నుంచి సమాచారం సేకరించి గొల్లుమన్నారు.
కోటిలింగాలు రేవుకు వెళ్లాలనుకుని...
సరుబుజ్జిలి: రాజమండ్రి ఘాట్‌లన్నింటిలోకి కొటిలింగాల రేవు విశాలంగా ఉండడంవల్ల అక్కడ సులువుగా స్నానాలు చేయొచ్చని వారంతా అనుకున్నారు. అయితే కోటిలింగాల రేవు కంటే కోటగుమ్మం రేవు సమీపంలో ఉండటంతో వారంతా అక్కడకు చేరుకున్నారు. చివరి నిమిషంలో మనసు మార్చుకొని ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారని అక్కడినుంచి వారి బంధువులు తెలిపారు.
పుణ్యంకోసం వెళ్లి...
వంగర: మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన లచ్చుభుక్త పారమ్మ(65) పుష్కర స్నానాలు ఆచరించేందుకు వెళ్లి రాజమండ్రిలో మృతిచెందారు. ఈ నెల 13వ తేదీన గ్రామం నుంచి 50 మంది గ్రామస్తులు వారం రోజులుగా ప్లాన్ చేసుకొని ప్రత్యేక బస్సులో మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయానికి చేరుకున్నారు.
రాజమండ్రిలోని కోటిలింగాల పుష్కర ఘాట్ వ ద్దకు ఉదయం ఆరు గంటల సమయానికి చేరుకొని ఆరున్నర గంటల సమయంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు గేట్లు వద్ద వేచిఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో పారమ్మ మృతిచెందగా ఇదే గ్రామానికి చెందిన ముని గన్నెమ్మకు ఎడమ చేయి, నడుం భాగం పూర్తిగా విరిగిపోగా, కాళ్ల కాలమ్మకు కుడి చేయి భాగం విరిగిపోయింది. దీంతో గ్రామంలోని కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరై రోదిస్తున్నారు.
గోదావరి నదిలో స్నానం చేస్తే పుణ్యం సిద్ధిస్తుందని తమ అమ్మ వెళ్లిందని, ఇలా జరుగుతుందని అనుకోలేదని పారమ్మ కుమారులు రాము, వెంకటి, వారి కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు రాజమండ్రిలో సరైన వైద్యసేవలందడం లేదని వారి కుటుంబ సభ్యులు ముని వెంకటి, మాన్యం జనార్దనరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.