రాజమహేంద్రవరం : గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనపై రాష్ట్రప్రభుత్వం నియమించిన జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ సోమవారం మూడోసారి విచారణ చేపట్టనుంది. అంతకుముందు ఈ ఏడాది జనవరి 18న, ఫిబ్రవరి 23న రెండు దఫాలుగా జరిగింది. తొలిదఫా ఒక్క అఫిడవిట్ మాత్రమే అందగా, తర్వాత 31 అఫిడవిట్లు దాఖలయ్యాయి. అఫిడవిట్ల సమర్పణకు ఈ నెల 5తో గడువు ముగిసింది. అఫిడవిట్ల సమర్పణకే మూడు నెలలు గడిచింది. మిగిలిన మూడు నెలల కాలంలో విచారణ పూర్తిస్థాయిలో జరిపి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. కాగా ఈ సంఘటనలో ప్రభుత్వ లోపాలు ఉండడం వల్లే బాధ్యులపై చర్యలు ఉంటాయా అని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ శాఖల నుంచి అందని ఆధారాలు
తొక్కిసలాట సంఘటనపై వివిధ శాఖల అధికారులు ఇంకా ప్రభుత్వానికి ఆధారాలు సమర్పించలేదు. క్రౌడ్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు ఎవరు నిర్వహించారు, ఏ శాఖలు ఉన్నాయి, వాటి ఇన్‌చార్జిలు ఎవరు, పుష్కర సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఎంత మందిని వలంటీర్లుగా నియమించారు తదితర విషయాలపై రికార్డులు కమిషన్‌కు అందజేయాలి. ఇలాఉండగా బాధితుల పక్షాన ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు వేసిన పిటీషన్‌పై కమిషన్ ఎదుట ప్రభుత్వ ప్లీడర్ ప్రాథమిక అభ్యంతరాలు తెలిపారు. కమిషన్ ముందు ముప్పాళ్ల సుబ్బారావు పార్టీగా కాకుండా సాక్షిగా మాత్రమే హాజరవుతున్నారని, ఆర్డర్ 12, రూల్ 8 సివిల్ ప్రొసీజర్ కింద అడిగే హక్కు లేదని పేర్కొన్నారు. అందువల్ల కమిషన్ ముందు డాక్యుమెంట్లను దాఖలు పరిచే అంశాన్ని తిరస్కరించాలని ఫిబ్రవరి 22న ఫైల్ చేశారు.
నిజనిర్ధారణ ఎలా!
పుష్కర తొక్కిసలాటకు సంబంధించి ఆయా శాఖల వద్ద ఉన్న ఆధారాలు కమిషన్ కు సమర్పించకపోతే నిజనిర్ధారణ ఎలా జరుగుతుందన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బాధితుల తరఫున ముప్పాళ్ల సుబ్బారావు నిబంధనల మేరకు తన వాదనలు దాఖలు చేస్తున్నారు. కమిషన్ కూడా సివిల్ ప్రొసీజర్ కోడ్‌ను విచారణ సమయంలో అనుసరిస్తామని బహిరంగంగా చెప్పింది. పుష్కరాల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడుతుందన్న భయంతోనే విజువల్స్ సాక్ష్యాలను మాయం చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ నెల 19లోగా ఆధారాలు సమర్పించాల్సి ఉన్నప్పటికీ.. ఇంకా ఇవ్వలేదు.