దారులన్నీ గోదావరి పుష్కరాల వైపే
భక్తి, సెంటిమెంట్‌తో ప్రజలంతా పయనం
బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాల ఆశ్రయం
ఇంకా మూడు రోజులే ఉండడంతో మరింత హడావుడి
పల్లెల్లో వీధులన్నీ ఖాళీ అవుతున్న వైనం
ఆర్టీసీ, ప్రైవేటు సర్వీసులకు కాసులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జిల్లాలో ఎక్కడ చూసినా గోదావరి పుష్కరాల గురించే చర్చ. ఏ ఇంట్లో అయినా మహా పుష్కరాల కోసం ప్రయాణ హడావుడే. పుణ్యం కోసం కొందరైతే... పక్కింటివారెళ్లారనీ మనమూ వెళ్లాలనే పట్టుదలతో కొందరు. ఒకవైపు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినా జాగ్రత్తగా వెళ్లొచ్చేద్దామంటూ రాజీ. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన గోదావరి పుష్కరాలు ఈ నెల 25తో ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ఊళ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది జనం పుష్కరాలకు వెళ్లొచ్చారు. ప్రస్తుతం కాస్త రద్దీ తగ్గినా సమయం సమీపిస్తోందంటూ మిగిలిన వారంతా తమ ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు.
ఇక్కడి నుంచే ఎక్కువ
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే అధికశాతం పుష్కరాలకు వస్తున్నారనేది ఓ అంచనా. ఆమదాలవలస రైల్వేస్టేషన్‌తో పాటు జిల్లాలో ఉన్న పాలకొండ, టెక్కలి, పలాస, శ్రీకాకుళం 1, 2 బస్ డిపోల నుంచి ఆర్టీసీ భారీగా భక్తుల్ని తరలించింది. ఇది కాకుండా కార్లు, ఆటోలు, టాటా మ్యాజిక్ వంటి ప్రైవేట్ వాహనాల్లో కూడా కుటుంబాలకు కుటుంబాలు పుష్కరాలకు వెళ్తున్నాయి. రాజమండ్రే కదా ఎంత సేపు అంటూ కుర్రకారు తమ ద్విచక్రవాహనాలనూ వినియోగించేశారు. పుష్కరాలు అంటే కేవలం పిత్రుదేవతలకు పిండ ప్రదానం చేయాల్సిన వ్యక్తులే వెళ్లేవారు. ఇప్పుడలా కాదు. పుష్కరాల జాతర చూద్దామని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. పక్కింటి వాళ్లు వెళ్లారనో, చుట్టాలంతా చూసొచ్చారనో, తమకూ చూడాలని ఉందనో, తాము వెళ్లకపోతే ఎలా అనో, మళ్లీ 12ఏళ్లకు గానీ రాదు అంటూనో, ఇవి 144యేళ్లకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలు అనో, టీవీలు, పత్రికల్లో వస్తున్న కథనాలకు ఆకర్షితులయ్యో చాలా మంది పుష్కరాల బాట పడుతున్న మాట మాత్రం నిజమే. గ్రామాల్లో అయితే ఈ సెంటిమెంట్, భక్తి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. గామాల్లో ఏ ఇల్లు చూసినా తాళమే దర్శనమిస్తోంది.
రైళ్లలో ఇలా
ఆమదాలవలస రైల్వేస్టేషన్ నుంచి పుష్కరాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కనీసం లక్ష మంది రైళ్లలో వెళ్లినట్లు అంచనా. రిజర్వేషన్ ద్వారా 20వేల మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ.1కోటి ఆదాయం సమకూరినట్టు అంచనా. ఒక ప్రత్యేక రైలుతో పాటు ఆమదాలవలస నుంచి గోదావరి పుష్కరాల సందర్శనకు మరో 10రైళ్ల ద్వారా జనం వెళ్తున్నారు.
బస్సుల్లో ఇలా..
జిల్లా పరిధిలో ఐదు బస్ డిపోల నుంచి ఇప్పటివరకు 1072బస్సులు గోదావరి పుష్కరాలకు వెళ్లాయి. సుమారు లక్షమంది ప్రయాణం చేశారు. ఈనెల 4వ తేదీ నుంచి 16వ తేదీ వరకు డీలక్స్ సర్వీసుల్లో చాలా మంది రిజర్వేషన్ చేయించుకుని పుష్కరాలకు వెళ్లారు. ఒక్క పుష్కరాల సీజన్‌లోనే ఐదు డిపోల ద్వారా ఇప్పటివరకు కనీసం రూ. 6.68కోట్ల ఆదాయం సమకూరినట్టు అంచనా. అదే విధంగా చాలామంది రాత్రి ప్రయాణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పనులన్నీ ముగించుకుని రాత్రి భోజనాలయ్యాక బయల్దేరితే తెల్లారేసరికి రాజమండ్రి వెళ్లిపోవచ్చని, సూర్యోదయం ముందు మామూలు స్నానం, అనంతరం పుష్కర స్నానం చేసి సమీపంలో ఉన్న దేవాలయాల దర్శనాలకు వెళ్లిపోవచ్చని ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రైవేట్ వాహనాలూ బిజీబిజీ
పట్టణంలో వైఎస్సార్ కూడలితో పాటు డే అండ్ నైట్ కూడళ్లలో 70చొప్పున టాక్సీ కార్లున్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ మరికొన్ని ఉన్నాయి. చాలా చోట్ల ఇతర ప్రాంతాల నుంచి మినీ వాహనాలు తెప్పించుకుని కుటుంబమంతా ఒకే సారి వెళ్లొచ్చేందుకు ప్రయాణాలు సిద్ధం చేసుకుంటున్నారు. బలగ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ బస్సుల్లో కూడా రాజమండ్రి టిక్కెట్లే అధికంగా బుక్ అవుతున్నాయి. కార్లలో సుమారు రూ.4వేల నుంచి రూ.10వేలు వసూలు చేసి రాజమండ్రి-శ్రీకాకుళం అంటూ మధ్యమధ్యలో పుణ్యక్షేత్రాలూ చూపించి తీసుకువస్తున్నారు. వాహనాలేవీ ఖాళీగా ఉండడం లేదు. ఇలాంటప్పుడే కదా నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని డ్రైవర్లు చెబుతున్నారు. పుష్కరాల తొలిరోజు ఘాట్లో చోటు చేసుకున్న తోపులాటలో జిల్లాకు చెందిన మొత్తం 9మంది మృతిచెందితే వారిలో ఒకే కుటుంబానికి చెందినవారే నలుగురు ఉండడం బాధాకరం. ఆ తరువాత కూడా రోజూ మృతుల వార్తలే చూస్తున్నాం. మిగిలిన మూడు రోజుల్లో అయినా పుష్కర ప్రయాణం సాఫీగా జరిగి జనం అంతా ఇంటికి తిరిగి రావాలని కోరుకుందాం.
ఊళ్లు ఖాళీ!
Published Wed, Jul 22 2015 12:00 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement