govt medical colleges
-
అబద్ధాల బాబు.. ఆ సీక్రెట్ ఇదేనట!
కొంతమంది రాజకీయ నేతలకు అపరాధ భావన అన్నది ఉండదేమో! తప్పు చేస్తున్నా, అది తప్పు కాదు అన్నట్లుగానే వ్యవహరిస్తారేమో! ఇచ్చిన మాటమీద అసలు నిలబడకూడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫలానా విధంగా చెప్పాం కదా.. ఇప్పుడు మాట మార్చితే బాగోదేమో అనే ఆలోచన అసలు రాదేమో.. ఈ విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిష్టాతుడు అనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అబద్ధాలు, నిజాలతో సంబంధం లేకుండా, మనసుతో నిమిత్తం లేకుండా వ్యవహరించడంలో ఆయనకు ఆయనే సాటి అని అంటారు. ఒక రకంగా అది ఆయనకు సర్టిఫికెట్ కూడా కావచ్చు. ఎందుకంటే ఆయన విజయ రహస్యం కూడా అదే కావడం కనుక.ఇలాంటి రాజకీయ నేతల కన్నా ఘోరంగా మారిన మీడియా గురించి ఏమనాలి? ఏపీలో తెలుగుదేశం మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక, టీవీ ఛానల్ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచక ప్రచారం గురించి ఆలోచిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. అదే మీడియా ఇప్పుడు చంద్రబాబు ఏమి చేసినా భజన చేయడమే సిద్ధాంతంగా పెట్టుకుంది. కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వరంగంలో కాకుండా ప్రైవేటుకు మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతేకాదు.. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలోనే ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించారు.ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పదిహేడు వైద్య కళాశాలలను ప్రభుత్వరంగంలో తీసుకు రావాలని ప్రయత్నాలు చేసి, ఐదింటిని ఇప్పటికే ఆరంభించారు. కొన్ని భవన నిర్మాణ దశలో ఉన్నాయి. ఆ కాలేజీలలో కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో అధిక ఫీజులకు కేటాయించాలని, తద్వారా కాలేజీల నిర్వహణను మెరుగుపరచుకోవాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం భావించింది. అంతే! అదంతా దారుణమైన విషయమంటూ తెలుగుదేశం పార్టీ నానా యాగి చేసింది. ఈనాడు మీడియా అయితే ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక కథనం ఇస్తూ వైద్య విద్యనూ అమ్మేశారు అంటూ హెడింగ్ పెట్టింది. అక్కడితో ఆగలేదు. వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ గోల చేసింది. అప్పటికీ ఈనాడు అధినేత రామోజీ జీవించే ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే పచ్చి అబద్ధాలను, మోసపూరిత కథనాలను ఈనాడు మీడియా ప్రచారం చేసింది.వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ తరహాలో తీర్చి దిద్దడానికి నాడు-నేడు కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేటురంగానికి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నమాట. నిజంగానే చంద్రబాబు కాని, ఈనాడు మీడియా కాని ప్రైవేటు విధానానికి కట్టుబడి ఉంటే తప్పు కాదు. చంద్రబాబు అంటే మాట మార్చడంలో సిద్ధహస్తుడు కనుక ఆయన అధికారంలోకి రాగానే యధాప్రకారం తాను గతంలో ఏమి చెప్పింది మర్చిపోయినట్లు నటిస్తున్నారు. ఈనాడు మీడియా ఇప్పుడు ఆయనతో పోటీపడి నటనలో జీవిస్తోందనుకోవాలి.ప్రభుత్వ వైద్యకళాశాలలను గుజరాత్ మోడల్లో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వా్మ్యంలో నడపడానికి విధానం సిద్దం చేయాలని, అందుకు అధ్యయనం చేయాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంత్రివర్గంలో కూడా చర్చించారు. గుజరాత్ మోడల్ అంటే కాలేజీకి అవసరమైన భూమిని, ఆస్పత్రిని ప్రభుత్వమే సమకూర్చుతుంది. మెడికల్ కాలేజీని ప్రైవేటువారు నిర్మిస్తారు. ఒక అంచనా ప్రకారం తొలి ఏడాదే ఏభై కోట్ల ఆదాయం ప్రైవేటు నిర్వాహకులకు రావచ్చు. ప్రతి ఏటా నిర్దిష్ట శాతం ఫీజు పెంచుతారు. ముప్పై ఏళ్లపాటు వారు ఈ కాలేజీలను నిర్వహించుకోవచ్చు. నిజానికి ఇదే టీడీపీ విధానం అయితే ఎవరం ఏమీ చేయలేం. అలాకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కాలేజీలలో ఒక్క సీటు కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం కింద అధిక ఫీజుకు ఇవ్వకూడదని, అన్ని ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేసిన టీడీపీ ఇప్పుడు ఏకంగా మొత్తం కాలేజీనే ప్రైవేటుపరం చేయాలని ఆలోచించడం.ఆ రోజుల్లో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఏమన్నారో గమనించండి. "వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నది ప్రభుత్వం కాదు. మాయా బజార్. సర్కార్ వైద్య కళాశాలలో ఏడాదికి పదిహేనువేల రూపాయల ఫీజ్ ఉండే ఎమ్‌బీబీఎస్ ఫీజ్‌ను ఇరవై లక్షలు చేసి దోచుకుంటున్నాడు" అని ఆయన తన ట్వీట్లలో ప్రచారం చేశారు. ఈనాడు పత్రిక అయితే తానేదో మొత్తం ప్రభుత్వరంగానికి అనుకూలం అయినట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ఏకంగా నయా పెత్తందార్ అంటూ అసహ్యకర రాతలు రాసింది. జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యకాలేజీల సీట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపిస్తూ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు వీరంతా అధికారంలో ఉన్నారు. అయినా చంద్రబాబు ప్రతిపాదనపై నోరెత్తితే ఒట్టు.లోకేష్ అంటే చంద్రబాబు కుమారుడు కనుక మాట్లాడడం లేదని అనుకోవచ్చు. కాని పవన్ కల్యాణ్‌కు ఏమైంది? జనసేన ఏమీ టీడీపీ అనుబంద పార్టీ కాదు కదా!అసలు టీడీపీ గెలిచిందంటే తనవల్లేనని ఆయన అనుకుంటున్నారు కదా! అలాంటప్పుడు ఇలా తాము చెప్పినవాటికి విరుద్ధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నప్పుడు పవన్ కనీసం ప్రశ్నించాలి కదా? అలాకాకుండా ఇంతలా సరెండర్ అయిపోవడం ఏమిటో తెలియదు. అధికారాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఇవేమీ కనిపించవేమో!టీడీపీ మొదటి నుంచి అన్ని విషయాలలోనూ ఇదే డబుల్ గేమ్ ఆడుతోంది. తాను చేస్తే అభివృద్ది, ఎదుటివారు అదే పని చేస్తే వినాశనం అని ప్రచారం చేయగల నేర్పు చంద్రబాబుది అయితే, ఆయన ఏమి చేసినా వంత పాడడం ఈనాడు మీడియా నైజంగా ఉంది. ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు అని ఎవరైనా విమర్శించినా పట్టించుకోకపోవడం వారి లక్షణంగా ఉంది.1992లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన పన్నెండు మెడికల్, పన్నెండు డెంటల్ కాలేజీలను ప్రైవేటు రంగంలో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ విద్యను అమ్ముకుంటారా? చదువుల తల్లి సరస్వతి దేవిని విక్రయిస్తారా? అంటూ గోల చేసింది. ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు దీనిపై పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దగ్గుబాటి దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు కూడా వేశారు. ఆ తర్వాత కాలంలో టీడీపీ అధికారంలోకి రావడం, ఎన్టీఆర్‌ను పదవీచ్యుతిడిని చేసి చంద్రబాబు సీఎం కావడం జరిగింది. అప్పటి నుంచి స్వరం మారిపోయింది.ప్రైవేటు రంగంలోనే ఇంజనీరింగ్, వైద్య కళాశాలలకు తలుపులు బార్లా తెలిచారు. దానికి ఒక ధీరి అల్లారు. వృత్తి విద్య కాలేజీలు అవసరం అయినన్ని లేకపోవడం వల్ల మన విద్యార్దులు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని, అందుకే ప్రైవేటు రంగంలో కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రచారం చేశారు. ఏదో ఒక కమిటీ పేరుతో కథ నడిపంచారు. కాని అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పలువురు ఈ కాలేజీలకు అనుమతి పొందారు. చంద్రబాబుతో సత్సంబంధాలు కలిగిన కొందరు కాంగ్రెస్ నేతలు కూడా కాలేజీలు తీసుకున్నారని చెబుతారు. ఈ రకంగా ఆయా పార్టీలను కూడా మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడిగా పేరొందారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులలో యూజర్ చార్జీల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది కూడా చంద్రబాబు టైమ్‌లోనే. ఆ పిమ్మట ఆయన ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్, లేదా వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే మళ్లీ వాటన్నిటిని విమర్శించింది కూడా చంద్రబాబే కావడం విశేషం.2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తొలుత లీక్‌లు ఇవ్వడం, గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి ప్రచారం చేయడం, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం, అభివృద్ది కావాలంటే ప్రజలు అదనపు వ్యయాన్ని భరించాలని సైకలాజికల్ గేమ్ ఆడడం.. వాటికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో గ్యాంగ్ వంత పాడడం.. ఇదే నిత్యకృత్యంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటివాటిని వ్యతిరేకించారు కదా అని ఎవరిని అడగనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మాట మార్చడం మా జన్మహక్కు అన్నట్లు టీడీపీ, ఎల్లో మీడియా వ్యవహరిస్తున్నాయి.పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, మారుమూల ప్రాంతాలలో వైద్యం అభివృద్ధిని కాంక్షిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కాలేజీలను ప్రతిపాదించింది. ఉదాహరణకు ఎవరూ ఉహించని విధంగా పల్నాడులో పిడుగురాళ్లలో ఒక వైద్యకాలేజీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. గిరిజన ప్రాంతమైన పాడేరులో భవనాల నిర్మాణం కూడా దాదాపు పూర్తి చేశారు. మచిలీపట్నం తదితర చోట్ల కొత్త కాలేజీలను ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. అలాంటి దశలో వైఎస్సార్సీపీ ఓటమిపాలవడం విషాదం. ఇప్పుడు పదిహేడు కాలేజీలలో ఎన్నిటిని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తీసుకు వస్తుందో, వాటిని ప్రైవేటు రంగానికి ఎలా అప్పగిస్తారో తెలియదు.ఎన్నికల మానిఫెస్టోలో కనుక ఇన్ని ప్రభుత్వ వైద్యకాలేజీలు అవసరం లేదని భావిస్తున్నామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రకటించి ఉంటే, ఇప్పుడు వారి ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. అలాకాకుండా ఎన్నికల సమయంలో పచ్చి అబద్ధాలను ప్రచారం చేసి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ప్రైవేటు సీట్లు ఉండకూడదన్నట్లుగా మాట్లాడి, అధికారంలోకి రాగానే పూర్తి రివర్స్‌లో అసలు కాలేజీలనే ప్రైవేటుపరం చేయాలని ఆలోచించడం దుర్మార్గం కాదా! అందువల్లనే చంద్రబాబు, ఈనాడు మీడియాలకు మనసు లేదని అనవలసి వస్తోంది. మాట మార్చడానికి సిగ్గుపడనవసరం లేదని వీరు పదే, పదే రుజువు చేసుకుంటున్నారు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పేద విద్యార్థులకు సారీ.. ఉచిత వైద్యం హరీ
-
వైద్య విద్యలో విప్లవం.. పేద కుటుంబాల్లో డాక్టర్లు..
-
నేడు 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది నుంచే కొత్తగా తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. శుక్ర వారం సీఎం కేసీఆర్ ఈ కాలేజీలను ప్రారంభించనున్నారు. ఇందులో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్ర సొంత నిధులతో ఇలా పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలను ప్రారంభించడం దేశంలో ఇదే ప్రథమమని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా.. సీఎం కేసీఆర్ గత తొమ్మిదేళ్లలోనే కొత్త 21 కాలేజీలను ఏర్పాటు చేశారని అంటున్నాయి. వచ్చే ఏడాది మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారని.. వాటితో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యం పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. -
బీఎస్సీ హెల్త్ సైన్సెస్ ఫీజు రూ.15వేలు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్తగా ప్రవేశపెట్టబోయే బీఎస్సీ హెల్త్ సైన్సెస్ కోర్సులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. అందుకు సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. నాలుగేళ్ల ఈ హెల్త్‌సైన్సెస్ కోర్సులను గాంధీ, ఉస్మానియా సహా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది ప్రవేశపెడుతున్నారు. కొత్త కోర్సులు కావడంతో వీటికి మరింత డిమాండ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ కాలేజీలు యూనివర్సిటీకి చెల్లించాల్సిన ఫీజు రూ. 6వేలు కాగా, విద్యార్థుల నుంచి ఏడాదికి రూ.15 వేల వరకు ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అంటే మూడేళ్లకు రూ.45 వేల ఫీజు ఉండొచ్చు. మరో ఏడాది ఇంటర్న్‌షిప్ ఉంటుంది. చివరి ఏడాదిలో విద్యార్థులకే స్కాలర్షిప్ ఇస్తారు. ఫీజు వివరాలను త్వరలో వెల్లడిస్తామని వర్సిటీ ప్రకటించింది. ఈనెల 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం పదో తరగతి ఆధారంగా పారామెడికల్ కోర్సులు ఉండగా, బీఎస్సీ డిగ్రీతో మొదటిసారిగా వీటిని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల మరింత నైపుణ్యం కలిగిన ఆరోగ్య సాంకేతిక నిపుణులు తయారుకానున్నారు. దీనివల్ల వైద్య సేవలు మరింత పటిష్టం కానున్నాయి. వీటిల్లో చేరే విద్యార్థులకు ప్రైవేట్ రంగంలోనూ మంచి ఆఫర్లు ఉంటాయి. అలాగే విదేశాల్లోనూ డిమాండ్ ఉంటుందని కాళోజీ వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో మున్ముందు ఇతర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సహా ప్రైవేట్ కాలేజీల్లోనూ ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. కోటా అభ్యర్థులు లేకుంటే ఓపెన్‌లోకి.. ►మొత్తం సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వు చేశారు. ఈ కేటగిరీ అభ్యర్థులు లేకుంటే రిజర్వ్డ్ సీట్లు ఓపెన్ కేటగిరీకి వెళ్తాయి. వాటిని మెరిట్ ఆధారంగా కేటాయిస్తారు. ►29 శాతం సీట్లు బీసీలకు కేటాయిస్తారు. అర్హతగల అభ్యర్థులు లేకుంటే, మిగిలిన సీట్లను తదు పరి సబ్–గ్రూప్ అభ్యర్థులకు కేటాయించవచ్చు. వారు కూడా అందుబాటులో లేకుంటే, ఓపెన్ కేటగిరీకి మారుస్తారు. ►ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% సీట్లు ఉన్నాయి. ►ప్రతి కేటగిరీలో మహిళా అభ్యర్థులకు 33.3 శాతం కేటాయిస్తారు. 5 శాతం దివ్యాంగులకు కేటాయిస్తారు. ►స్థానిక రిజర్వేషన్ 85 శాతం ఉంటుంది. ►మెరిట్ జాబితాను బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో పొందిన మార్కుల ఆధారంగా తయారుచేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఒకే ప్రయత్నంలో ఉత్తీర్ణులైనవారా కాదా అనేది కూడా చూస్తారు. పాత అభ్యర్థులకు అధిక మెరిట్ ఉంటుంది. ►కోర్సు వ్యవధిలో ఒక కళాశాల నుంచి మరొక కళాశాలకు విద్యార్థుల బదిలీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ►ఈ సంవత్సరం 860 సీట్లను భర్తీ చేస్తారు. ప్రస్తుతం నేరుగా దరఖాస్తు చేయొచ్చు. ఇంటర్మీడియెట్ మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. రాబోయే రోజుల్లో ఎంసెట్కుగానీ లేదా ఇతరత్రా ఏదైనా ప్రవేశ పరీక్షకు అనుసంధానిస్తారు. బీఎస్సీ హెల్త్‌సైన్సెస్ కోర్సులివీ.. ►అనెస్థీషియా టెక్నాలజీ ►ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ►కార్డియాక్ కార్డియో వాస్క్యూలర్ టెక్నాలజీ ►రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ ►ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ ►న్యూరో సైన్స్ టెక్నాలజీ ►క్రిటికల్ కేర్ టెక్నాలజీ ►రేడియాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ ►ఆడియోలజీ స్పీచ్ థెరపీ టెక్నాలజీ ►మెడికల్ రికార్డ్స్ సైన్సెస్ ►న్యూక్లియర్ మెడిసిన్ ►రేడియో థెరపీ టెక్నాలజీ -
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, అమరావతి: 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభించింది. ఈ క్రమంలో ఎంబీబీఎస్ సీట్ల వివరాలను ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం అదనంగా 300 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది బాగా తగ్గింది. గత ఏడాది 14 వేల మంది వరకూ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఆ సంఖ్య 11 వేల లోపునకే పరిమితమైంది. 10,782 మంది విద్యార్థులు విశ్వవిద్యాలయం విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర కోటాలో 1,865 సీట్లు.. రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేట్, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలు ఉన్నాయి. 11 ప్రభుత్వ కళాశాలల్లో 2,185 సీట్లు ఉన్నాయి. వీటిలో 325 సీట్లు ఆలిండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన 1,860 సీట్లు రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు 16 ప్రైవేట్, రెండు మైనార్టీ కళాశాలల్లో 3 వేల సీట్లు ఉన్నాయి. వీటిలో 1,500 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లను బీ, సీ కేటగిరీల్లో భర్తీ చేస్తారు. మరోవైపు శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో 175 సీట్లు ఉండగా 126 రాష్ట్ర కోటాలో, 26 ఆల్ ఇండియా కోటాలో, 23 ఎన్నారై కోటా కింద భర్తీ అవుతాయి. ఇలా మొత్తంగా ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్, మైనార్టీ, ఇతర కళాశాలల్లో మొత్తం 5,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ వివరాల కోసం https://ugcq.ntruhs admissions.com/ చూడొచ్చు. అన్ని కౌన్సెలింగ్లకు వన్‌టైమ్ ఆప్షన్ విధానం.. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి తొలి దశ ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆప్షన్ల నమోదుకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు మంగళవారం (నవంబర్ 8) రాత్రి ఏడు గంటల్లోగా ఆప్షన్లను నమోదు చేయాలి. ఒక్కసారి ఆప్షన్లు నమోదు చేస్తే చాలు.. వీటినే అన్ని విడతల కౌన్సెలింగ్‌కు పరిగణనలోకి తీసుకుంటారు. రీటెయిన్ విధానాన్ని ఈ ఏడాది విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం.. విద్యార్థి తనకు ఇష్టమైన కళాశాలలో తొలి దశలోనే సీటు వస్తే.. ఆ సీటుకే పరిమితం అవుతానని అంగీకారం తెలపొచ్చు. ఇలాంటి విద్యార్థులను తర్వాతి కౌన్సెలింగ్లకు పరిగణనలోకి తీసుకోరు. విద్యార్థుల మొగ్గు ఆంధ్రా వైద్య కళాశాలకే.. విద్యార్థుల మొగ్గు విశాఖపట్నంలోని ఆంధ్రా వైద్య కళాశాల వైపే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత స్థానాల్లో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, కాకినాడ రంగరాయ, కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్నాయి. గతేడాది ఆంధ్రా కళాశాలలో ఎస్టీ కేటగిరీలో 472 స్కోరుతో 1,10,270 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఇక ఎస్సీల్లో 79,876 ర్యాంక్, బీసీ కేటగిరీలో 32,693 ర్యాంక్, ఓసీల్లో 15,824 ర్యాంక్, ఈడబ్ల్యూఎస్‌లో 20,137 ర్యాంక్ తుది కటాఫ్ ర్యాంకులుగా నిలిచాయి. ఆప్షన్ల నమోదులో జాగ్రత్త.. విద్యార్థులు ప్రాధాన్యత క్రమంలో ఒకేసారి ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆప్షన్ల నమోదు విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. అన్ని సీట్లు భర్తీ అయ్యేంత వరకూ మాప్–అప్ రౌండ్ కౌన్సెలింగ్‌లు చేపడతాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఏమైనా సందేహాలు ఉంటే విశ్వవిద్యాలయం ఇచ్చిన ఫోన్ నంబర్లను సంప్రదించొచ్చు. – డాక్టర్ శ్యామ్‌ప్రసాద్, వీసీ, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం -
29 నుంచి తెలంగాణలో మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ (లబ్బీపేట): తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 1525 ఎంబీబీఎస్, 1140 బీడీఎస్ సీట్ల భర్తీకి ఈ నెల 29 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజ్ చెప్పారు. బుధవారం యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కౌన్సెలింగ్ వివరాలను తెలిపారు. 29న ఉదయం ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తామన్నారు. అదేరోజు మధ్యాహ్నం జనరల్ కేటగిరి అభ్యర్థులకు కౌన్సెలింగ్ ప్రారంభమై 30, 31 తేదీల్లో కూడా కొనసాగుతుందన్నారు. ఆగస్టు 1,2,3 తేదీల్లో రిజర్వేషన్ కేటగిరి (ఎస్సీ, ఎస్టీ, బీసీ) అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. 4న సీఏపీ (ఆర్మీ), 5న ఎన్సీసీ, స్పోర్ట్స్‌అండ్ గేమ్స్, పోలీస్ అమర వీరుల పిల్లలకు కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ, మసాబ్‌ట్యాంక్‌లోని ఓ కళాశాల, వరంగల్‌లోని వైద్య కళాశాల, విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మెడికల్ కౌన్సిలింగ్ విషయమై ఈ నెల 13న జరగనున్న ఉన్నత విద్యాశాఖ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.