2185 MBBS Seats in Government Medical Colleges of Andhra Pradesh - Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు

Published Mon, Nov 7 2022 3:10 AM | Last Updated on Mon, Nov 7 2022 8:59 AM

2185 MBBS seats in government medical colleges Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ ప్రక్రియను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభించింది. ఈ క్రమంలో ఎంబీబీఎస్‌ సీట్ల వివరాలను ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం అదనంగా 300 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది బాగా తగ్గింది. గత ఏడాది 14 వేల మంది వరకూ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఆ సంఖ్య 11 వేల లోపునకే పరిమితమైంది. 10,782 మంది విద్యార్థులు విశ్వవిద్యాలయం విడుదల చేసిన తుది మెరిట్‌ జాబితాలో ఉన్నారు. 

రాష్ట్ర కోటాలో 1,865 సీట్లు..
రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేట్, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలు ఉన్నాయి. 11 ప్రభుత్వ కళాశాలల్లో 2,185 సీట్లు ఉన్నాయి. వీటిలో 325 సీట్లు ఆలిండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన 1,860 సీట్లు రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు 16 ప్రైవేట్, రెండు మైనార్టీ కళాశాలల్లో 3 వేల సీట్లు ఉన్నాయి. వీటిలో 1,500 సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీ అవుతాయి.

మిగిలిన సీట్లను బీ, సీ కేటగిరీల్లో భర్తీ చేస్తారు. మరోవైపు శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌)లో 175 సీట్లు ఉండగా 126 రాష్ట్ర కోటాలో, 26 ఆల్‌ ఇండియా కోటాలో, 23 ఎన్నారై కోటా కింద భర్తీ అవుతాయి. ఇలా మొత్తంగా ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్, మైనార్టీ, ఇతర కళాశాలల్లో మొత్తం 5,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్‌ వివరాల కోసం https://ugcq.ntruhs admissions.com/ చూడొచ్చు.

అన్ని కౌన్సెలింగ్‌లకు వన్‌టైమ్‌ ఆప్షన్‌ విధానం..
ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించి తొలి దశ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆప్షన్‌ల నమోదుకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం అర్ధరాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. విద్యార్థులు మంగళవారం (నవంబర్‌ 8) రాత్రి ఏడు గంటల్లోగా ఆప్షన్‌లను నమోదు చేయాలి. ఒక్కసారి ఆప్షన్లు నమోదు చేస్తే చాలు.. వీటినే అన్ని విడతల కౌన్సెలింగ్‌కు పరిగణనలోకి తీసుకుంటారు. రీటెయిన్‌ విధానాన్ని ఈ ఏడాది విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం.. విద్యార్థి తనకు ఇష్టమైన కళాశాలలో తొలి దశలోనే సీటు వస్తే.. ఆ సీటుకే పరిమితం అవుతానని అంగీకారం తెలపొచ్చు. ఇలాంటి విద్యార్థులను తర్వాతి కౌన్సెలింగ్‌లకు పరిగణనలోకి తీసుకోరు. 

విద్యార్థుల మొగ్గు ఆంధ్రా వైద్య కళాశాలకే..
విద్యార్థుల మొగ్గు విశాఖపట్నంలోని ఆంధ్రా వైద్య కళాశాల వైపే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత స్థానాల్లో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, కాకినాడ రంగరాయ, కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్నాయి. గతేడాది ఆంధ్రా కళాశాలలో ఎస్టీ కేటగిరీలో 472 స్కోరుతో 1,10,270 ర్యాంక్‌ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఇక ఎస్సీల్లో 79,876 ర్యాంక్, బీసీ కేటగిరీలో 32,693 ర్యాంక్, ఓసీల్లో 15,824 ర్యాంక్, ఈడబ్ల్యూఎస్‌లో 20,137 ర్యాంక్‌ తుది కటాఫ్‌ ర్యాంకులుగా నిలిచాయి. 

ఆప్షన్ల నమోదులో జాగ్రత్త..
విద్యార్థులు ప్రాధాన్యత క్రమంలో ఒకేసారి ఆప్షన్‌లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆప్షన్‌ల నమోదు విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. సీనియర్‌ల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. అన్ని సీట్లు భర్తీ అయ్యేంత వరకూ మాప్‌–అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌లు చేపడతాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఏమైనా సందేహాలు ఉంటే విశ్వవిద్యాలయం ఇచ్చిన ఫోన్‌ నంబర్లను సంప్రదించొచ్చు.
– డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్, వీసీ, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement