కొంతమంది రాజకీయ నేతలకు అపరాధ భావన అన్నది ఉండదేమో! తప్పు చేస్తున్నా, అది తప్పు కాదు అన్నట్లుగానే వ్యవహరిస్తారేమో! ఇచ్చిన మాటమీద అసలు నిలబడకూడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫలానా విధంగా చెప్పాం కదా.. ఇప్పుడు మాట మార్చితే బాగోదేమో అనే ఆలోచన అసలు రాదేమో.. ఈ విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిష్టాతుడు అనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అబద్ధాలు, నిజాలతో సంబంధం లేకుండా, మనసుతో నిమిత్తం లేకుండా వ్యవహరించడంలో ఆయనకు ఆయనే సాటి అని అంటారు. ఒక రకంగా అది ఆయనకు సర్టిఫికెట్ కూడా కావచ్చు. ఎందుకంటే ఆయన విజయ రహస్యం కూడా అదే కావడం కనుక.
ఇలాంటి రాజకీయ నేతల కన్నా ఘోరంగా మారిన మీడియా గురించి ఏమనాలి? ఏపీలో తెలుగుదేశం మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక, టీవీ ఛానల్ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచక ప్రచారం గురించి ఆలోచిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. అదే మీడియా ఇప్పుడు చంద్రబాబు ఏమి చేసినా భజన చేయడమే సిద్ధాంతంగా పెట్టుకుంది. కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వరంగంలో కాకుండా ప్రైవేటుకు మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతేకాదు.. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలోనే ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించారు.
ఏపీలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పదిహేడు వైద్య కళాశాలలను ప్రభుత్వరంగంలో తీసుకు రావాలని ప్రయత్నాలు చేసి, ఐదింటిని ఇప్పటికే ఆరంభించారు. కొన్ని భవన నిర్మాణ దశలో ఉన్నాయి. ఆ కాలేజీలలో కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో అధిక ఫీజులకు కేటాయించాలని, తద్వారా కాలేజీల నిర్వహణను మెరుగుపరచుకోవాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భావించింది. అంతే! అదంతా దారుణమైన విషయమంటూ తెలుగుదేశం పార్టీ నానా యాగి చేసింది. ఈనాడు మీడియా అయితే ఏకంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఒక కథనం ఇస్తూ వైద్య విద్యనూ అమ్మేశారు అంటూ హెడింగ్ పెట్టింది. అక్కడితో ఆగలేదు. వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అంటూ గోల చేసింది. అప్పటికీ ఈనాడు అధినేత రామోజీ జీవించే ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే పచ్చి అబద్ధాలను, మోసపూరిత కథనాలను ఈనాడు మీడియా ప్రచారం చేసింది.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ తరహాలో తీర్చి దిద్దడానికి నాడు-నేడు కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేటురంగానికి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నమాట. నిజంగానే చంద్రబాబు కాని, ఈనాడు మీడియా కాని ప్రైవేటు విధానానికి కట్టుబడి ఉంటే తప్పు కాదు. చంద్రబాబు అంటే మాట మార్చడంలో సిద్ధహస్తుడు కనుక ఆయన అధికారంలోకి రాగానే యధాప్రకారం తాను గతంలో ఏమి చెప్పింది మర్చిపోయినట్లు నటిస్తున్నారు. ఈనాడు మీడియా ఇప్పుడు ఆయనతో పోటీపడి నటనలో జీవిస్తోందనుకోవాలి.
ప్రభుత్వ వైద్యకళాశాలలను గుజరాత్ మోడల్‌లో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వా్మ్యంలో నడపడానికి విధానం సిద్దం చేయాలని, అందుకు అధ‍్యయనం చేయాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంత్రివర్గంలో కూడా చర్చించారు. గుజరాత్ మోడల్ అంటే కాలేజీకి అవసరమైన భూమిని, ఆస్పత్రిని ప్రభుత్వమే సమకూర్చుతుంది. మెడికల్ కాలేజీని ప్రైవేటువారు నిర్మిస్తారు. ఒక అంచనా ప్రకారం తొలి ఏడాదే ఏభై కోట్ల ఆదాయం ప్రైవేటు నిర్వాహకులకు రావచ్చు. ప్రతి ఏటా నిర్దిష్ట శాతం ఫీజు పెంచుతారు. ముప్పై ఏళ్లపాటు వారు ఈ కాలేజీలను నిర్వహించుకోవచ్చు. నిజానికి ఇదే టీడీపీ విధానం అయితే ఎవరం ఏమీ చేయలేం. అలాకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కాలేజీలలో ఒక్క సీటు కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం కింద అధిక ఫీజుకు ఇవ్వకూడదని, అన్ని ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేసిన టీడీపీ ఇప్పుడు ఏకంగా మొత్తం కాలేజీనే ప్రైవేటుపరం చేయాలని ఆలోచించడం.
ఆ రోజుల్లో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఏమన్నారో గమనించండి. "వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నడిపిస్తున్నది ప్రభుత్వం కాదు. మాయా బజార్. సర్కార్ వైద్య కళాశాలలో ఏడాదికి పదిహేనువేల రూపాయల ఫీజ్ ఉండే ఎమ్‌బీబీఎస్ ఫీజ్‌ను ఇరవై లక్షలు చేసి దోచుకుంటున్నాడు" అని ఆయన తన ట్వీట్‌లలో ప్రచారం చేశారు. ఈనాడు పత్రిక అయితే తానేదో మొత్తం ప్రభుత్వరంగానికి అనుకూలం అయినట్లుగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విరుచుకుపడింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిను ఏకంగా నయా పెత్తందార్ అంటూ అసహ్యకర రాతలు రాసింది. జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైద్యకాలేజీల సీట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపిస్తూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు వీరంతా అధికారంలో ఉన్నారు. అయినా చంద్రబాబు ప్రతిపాదనపై నోరెత్తితే ఒట్టు.
లోకేష్ అంటే చంద్రబాబు కుమారుడు కనుక మాట్లాడడం లేదని అనుకోవచ్చు. కాని పవన్ కల్యాణ్‌కు ఏమైంది? జనసేన ఏమీ టీడీపీ అనుబంద పార్టీ కాదు కదా!అసలు టీడీపీ గెలిచిందంటే తనవల్లేనని ఆయన అనుకుంటున్నారు కదా! అలాంటప్పుడు ఇలా తాము చెప్పినవాటికి విరుద్ధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నప్పుడు పవన్ కనీసం ప్రశ్నించాలి కదా? అలాకాకుండా ఇంతలా సరెండర్ అయిపోవడం ఏమిటో తెలియదు. అధికారాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఇవేమీ కనిపించవేమో!టీడీపీ మొదటి నుంచి అన్ని విషయాలలోనూ ఇదే డబుల్ గేమ్ ఆడుతోంది. తాను చేస్తే అభివృద్ది, ఎదుటివారు అదే పని చేస్తే వినాశనం అని ప్రచారం చేయగల నేర్పు చంద్రబాబుది అయితే, ఆయన ఏమి చేసినా వంత పాడడం ఈనాడు మీడియా నైజంగా ఉంది. ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు అని ఎవరైనా విమర్శించినా పట్టించుకోకపోవడం వారి లక్షణంగా ఉంది.
1992లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన పన్నెండు మెడికల్, పన్నెండు డెంటల్ కాలేజీలను ప్రైవేటు రంగంలో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ విద్యను అమ్ముకుంటారా? చదువుల తల్లి సరస్వతి దేవిని విక్రయిస్తారా? అంటూ గోల చేసింది. ఎన్‌టీ రామారావు, చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు దీనిపై పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దగ్గుబాటి దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు కూడా వేశారు. ఆ తర్వాత కాలంలో టీడీపీ అధికారంలోకి రావడం, ఎన్‌టీఆర్‌ను పదవీచ్యుతిడిని చేసి చంద్రబాబు సీఎం కావడం జరిగింది. అప్పటి నుంచి స్వరం మారిపోయింది.
ప్రైవేటు రంగంలోనే ఇంజనీరింగ్, వైద్య కళాశాలలకు తలుపులు బార్లా తెలిచారు. దానికి ఒక ధీరి అల్లారు. వృత్తి విద్య కాలేజీలు అవసరం అయినన్ని లేకపోవడం వల్ల మన విద్యార్దులు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని, అందుకే ప్రైవేటు రంగంలో కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రచారం చేశారు. ఏదో ఒక కమిటీ పేరుతో కథ నడిపంచారు. కాని అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పలువురు ఈ కాలేజీలకు అనుమతి పొందారు. చంద్రబాబుతో సత్సంబంధాలు కలిగిన కొందరు కాంగ్రెస్ నేతలు కూడా కాలేజీలు తీసుకున్నారని చెబుతారు. ఈ రకంగా ఆయా పార్టీలను కూడా మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడిగా పేరొందారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులలో యూజర్ చార్జీల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది కూడా చంద్రబాబు టైమ్‌లోనే. ఆ పిమ్మట ఆయన ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్, లేదా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే మళ్లీ వాటన్నిటిని విమర్శించింది కూడా చంద్రబాబే కావడం విశేషం.
2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తొలుత లీక్‌లు ఇవ్వడం, గత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి ప్రచారం చేయడం, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం, అభివృద్ది కావాలంటే ప్రజలు అదనపు వ్యయాన్ని భరించాలని సైకలాజికల్ గేమ్ ఆడడం.. వాటికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో గ్యాంగ్ వంత పాడడం.. ఇదే నిత్యకృత్యంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటివాటిని వ్యతిరేకించారు కదా అని ఎవరిని అడగనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మాట మార్చడం మా జన్మహక్కు అన్నట్లు టీడీపీ, ఎల్లో మీడియా వ్యవహరిస్తున్నాయి.
పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, మారుమూల ప్రాంతాలలో వైద్యం అభివృద్ధిని కాంక్షిస్తూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కాలేజీలను ప్రతిపాదించింది. ఉదాహరణకు ఎవరూ ఉహించని విధంగా పల్నాడులో పిడుగురాళ్లలో ఒక వైద్యకాలేజీని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. గిరిజన ప్రాంతమైన పాడేరులో భవనాల నిర్మాణం కూడా దాదాపు పూర్తి చేశారు. మచిలీపట్నం తదితర చోట్ల కొత్త కాలేజీలను ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. అలాంటి దశలో వైఎస్సార్‌సీపీ ఓటమిపాలవడం విషాదం. ఇప్పుడు పదిహేడు కాలేజీలలో ఎన్నిటిని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తీసుకు వస్తుందో, వాటిని ప్రైవేటు రంగానికి ఎలా అప్పగిస్తారో తెలియదు.
ఎన్నికల మానిఫెస్టోలో కనుక ఇన్ని ప్రభుత్వ వైద్యకాలేజీలు అవసరం లేదని భావిస్తున్నామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రకటించి ఉంటే, ఇప్పుడు వారి ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. అలాకాకుండా ఎన్నికల సమయంలో పచ్చి అబద్ధాలను ప్రచారం చేసి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ప్రైవేటు సీట్లు ఉండకూడదన్నట్లుగా మాట్లాడి, అధికారంలోకి రాగానే పూర్తి రివర్స్‌లో అసలు కాలేజీలనే ప్రైవేటుపరం చేయాలని ఆలోచించడం దుర్మార్గం కాదా! అందువల్లనే చంద్రబాబు, ఈనాడు మీడియాలకు మనసు లేదని అనవలసి వస్తోంది. మాట మార్చడానికి సిగ్గుపడనవసరం లేదని వీరు పదే, పదే రుజువు చేసుకుంటున్నారు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment