Gowri Reddy Sridhar Reddy
-
ప్రజా ప్రస్థాన యాత్రను విజయవంతం చేయాలి
కొండాపూర్(సంగారెడ్డి): వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర శనివారం జిల్లాలోకి ప్రవేశించనుందని పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు 160 రోజులుగా షర్మిల పాదయాత్ర చేస్తోందన్నారు. శనివారం జిల్లాలోని కంబాలపల్లి గ్రామంలో యాత్ర ప్రారంభం అవుతుందని, అక్కడి నుంచి సదాశివపేట పట్టణం, పెద్దాపూర్, నందికంది, తొగర్పల్లి, మల్కాపూర్, సంగారెడ్డి, చిద్రుప్ప, బేగంపేట మీదుగా కొనసాగనుందన్నారు. ఈ నెల 25వ తేదీన సంగారెడ్డిలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. తెలంగాణలో రాజన్న పాలన రావాలంటే షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలన్నారు. సంగారెడ్డిలో నిర్వహించే సభకు వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కోఆర్డినేటర్ చంద్రశేఖర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రామలింగారెడ్డి, సంగారెడ్డి జిల్లా పరిశీలకులు శాంతికుమార్, నాయకులు తుకారాం గౌడ్, తులపీదాస్ గౌడ్, భీంరెడ్డి, అందోల్ నాయకులు ఆమోస్, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. -
'ఆ ఘనత వైఎస్సార్ కుటుంబానిదే'
వైఎస్సార్సీపీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి నర్సాపూర్ రూరల్: ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కుతుందని వైఎస్సార్సీపీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌ను జైలులో పెట్టిన సమయంలో.. తట్టుకోలేక ఆత్మ హత్యకు పాల్పడిన మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన పొట్టి వీరారెడ్డి కుటుంబానికి మంగళవారం వైఎస్సార్సీపీ తరఫున రూ.లక్ష చెక్కును ఆయన అందజేశారు. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ మృతిని తట్టుకోలేక మెదక్ జిల్లాలో ప్రాణాలు వదిలిన కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్ షర్మిల జిల్లాకు వచ్చిన సమయంలో.. నర్సాపూర్‌కు చెందిన పొట్టి వీరారెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని తెలుసుకున్నారన్నారు. ఓదార్పు యాత్రలో భాగంగా హత్నూర మండలంతోపాటు నర్సాపూర్‌లోని వైఎస్సార్ విగ్రహా నికి పూలమాల వేసిన షర్మిల దృష్టికి స్థానికులు ఈ విషయాన్ని తీసుకెళ్లారన్నారు. వీరారెడ్డి భార్య నవీన, పిల్లలు అనుష్క, పల్లవిలను షర్మిలతో కలిపించగా, వీరారెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే వీరారెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని తనతో పంపించారని చెప్పారు. పార్టీ అభిమానులకు ఏ సమస్య తలెత్తినా.. వైఎస్సార్ కుటుంబంతోపాటు పార్టీ ఎప్పుడూ అందుబాటులో ఉండి ఆ సమస్య పరిష్కారంలో ముందుంటుందని శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.