Granite Association leaders
-
గ్రానైట్ పోరు ఉధృతం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో గ్రానైట్ పరిశ్రమ చేపట్టిన నిరసన రెండోరోజు కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమకు చెందిన క్వారీలు, కటింగ్ ఫ్యాక్టరీలు, ట్రాన్స్‌పోర్టు కంపెనీలన్నీ బంద్‌లో పాల్గొన్నాయి. క్వారీలన్నీ మూతపడగా, కటింగ్, ప్రాసెసింగ్ యూనిట్లలో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. క్వారీలు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. ట్రాన్స్‌పోర్టు కంపెనీలకు చెందిన 550 లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లా గ్రానైట్ క్వారీ అసోసియేషన్, గ్రానైట్ లారీ అసోసియేషన్, జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌తో పాటు ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న వర్కర్లు, ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని డి మాండ్ చేస్తూ సోమవారం పద్మానగర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి క లెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. పరిస్థితి మారకపోతే నిరవధిక బంద్ ఈ సందర్భంగా గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శంకర్, ప్రధాన కార్యదర్శి గంగుల ప్రదీప్, లారీ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు తోట శ్రీపతిరావు, అధ్యక్షుడు రెడ్డవేని మధు తదితరులు వేర్వేరుగా ఆదివారం మీడియా సమావేశాల్లో మాట్లాడారు. గ్రానైట్ పరిశ్రమను విధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. శనివారం నుంచి పరిశ్రమతో సంబంధం ఉన్న అన్ని విభాగాలను మూసివేసి బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. సోమవారం భారీ ర్యాలీతో తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. గ్రానైట్ ఇండస్ట్రీని మాఫియాగా చిత్రీకరించి, తమను వేధింపులకు గురిచేయడం ఆపకపోతే నెలరోజుల తరువాత నిరవధిక బంద్ పాటించనున్నట్లు హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికే 250 క్వారీల సంఖ్య సగానికి సగం తగ్గిపోగా, ఇప్పటికీ జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా వేలాది మంది క్వారీల్లో పనిచేస్తున్నారని చెప్పారు. 300 గ్రానైట్, కటింగ్ , పాలిషింగ్ యూనిట్లలో పరిశ్రమల యజమానులతోపాటు 10 వేల మంది వర్కర్లు పనిచేస్తున్నారని వివరించారు. ఎంపీ బండి సంజయ్‌కుమార్ చేస్తున్న అసత్య ప్రచారంతో వీరంతా రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. గ్రానైట్ క్వారీల మీద ఆధారపడే ఈ పరిశ్రమలు నడుస్తుండగా, క్వారీలు నిర్వహిస్తున్న వారిని మాఫియాతో పోలుస్తూ , ప్రభుత్వానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తూ పరిశ్రమను మూసివేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రానైట్ లారీ అసోసియేషన్ పరిధిలో 550 లారీలు ఉండగా వేలాది మంది వీటిని ఆధారం చేసుకుని జీవిస్తున్నారని పేర్కొన్నారు. సంజయ్ చర్యలతో గనుల శాఖ వేధింపులకు గురిచేస్తే క్వారీలు మూత పడతాయని, అప్పుడు లక్షలాది మందికి ఉపాధి కరువవుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
చెక్‌పోస్టులకు చెక్
గ్రానైట్ ఓవర్‌లోడ్‌కు రైట్.. గ్రానైట్ లారీల ఓవర్‌లోడ్‌పై ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో సరిగ్గా నెలరోజుల క్రితం ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను అధికారులు రాత్రికి రాత్రే ఎత్తివేశారు. ఈ విషయంలో గ్రానైట్ అసోసియేషన్ నాయకులు తమ పంతం నెగ్గించుకున్నారు. జిల్లా కీలక నేతలతో సంబంధం లేకుండానే చెక్‌పోస్టులను ఎత్తివేయించుకున్నారు. ఇందుకోసం ఇద్దరు ఎమ్మెల్యేల సాయంతో రాష్ట్ర రాజధానిలో చక్రం తిప్పారు. ‘ముఖ్య’నేతను కలిసి డీల్ కుదుర్చుకున్నారు. సదరు ‘ముఖ్య’నేత సానుకూలంగా స్పందించడం, అక్కడినుంచి రవాణా శాఖకు సంకేతాలు వెళ్లడం, ఆ వెంటనే జిల్లా అధికారులు చెక్‌పోస్టులను ఎత్తివేయడం చకచకా జరిగిపోయాయి. చెక్‌పోస్టుల ఎత్తివేతపై అధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు. తమకేమీ సంబంధం లేదంటూ జవాబు దాటవేస్తున్నారు. పంతం నెగ్గించుకున్న గ్రానైట్ యాజమాన్యాలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో 427 గ్రానైట్ క్వారీలున్నాయి. వీటి ద్వారా సగటున ప్రతినెలా దాదాపు రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. గ్రానైట్ లారీల ఓవర్‌లోడ్‌పై అనేక విమర్శలు రావడంతో గతనెల 30న ఎస్పీ శివకుమార్, మైనింగ్ ఏడీ కష్ణప్రతాప్, డీటీసీ మీరాప్రసాద్ హడావుడిగా సమావేశమయ్యారు. గతంలో నాలుగు చెక్పోస్టులుండగా, అదనంగా మరో ఎనిమిది చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. దీంతోపాటు చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేశారు. గ్రానైట్‌తోపాటు ఇసుక, ఇతరత్రా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వద్ద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఆయా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన తొలి వారంలో పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. లక్షలాది రూపాయల మొత్తంలో జరిమానా విధించారు. అధికారుల లెక్కల ప్రకారం పక్షం రోజుల్లోనే 322 కేసులు నమోదు చేసి రూ.33.86 లక్షల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. రోడ్డు మార్గంలో ఓవర్‌లోడ్‌ను తీసుకెళ్లే సదుపాయం లేకపోవడంతో చేసేదేమీలేక గ్రానైట్ యాజమాన్యాలు రైల్వేలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా రైల్వే ఆదాయం అమాంతం పెరిగిపోయింది. గతంతో పోలిస్తే సరిగ్గా నెలరోజుల్లోనే రూ.10 కోట్ల మేరకు రైల్వే అదాయం పెరిగినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. అకస్మాత్తుగా చెక్‌పోస్టుల ఎత్తివేత గ్రానైట్ ఓవర్‌లోడ్‌తో పాటు ఇతరత్రా జరుగుతున్న అక్రమ రవాణాను అడ్డుకుంటున్న సమయంలో సరిగ్గా మూడు రోజుల క్రితం రాత్రికి రాత్రే చెక్‌పోస్టులను ఎత్తివేయడం చర్చనీయాంశమైంది. ప్రధానంగా గత నెలలో ఏర్పాటు చేసిన ఎనిమిది చెక్‌పోస్టులను పూర్తిగా ఎత్తివేయగా, మిగిలిన చోట్ల నామమాత్రంగా కొనసాగిస్తున్నారు. చెక్‌పోస్టులను ఎందుకు ఎత్తివేశారనే అంశంపై సమాధానం చెప్పడానికి ఇటు మైనింగ్, అటు రవాణా, పోలీసు అధికారులెవరూ ముందుకు రావడం లేదు. ఓవర్ లోడింగ్ వ్యవహారంతో తమకు సంబంధమే లేదని మైనింగ్ అధికారులు చెబుతుండగా, చెక్‌పోస్టుల నిర్వహణ వ్యయాన్ని మైనింగ్ శాఖ అధికారులే భరించాలని కలెక్టర్ ఆదేశాలున్నందున చెక్‌పోస్టుల ఎత్తివేతపై ఆ శాఖ అధికారులనే అడగాలని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వం కూడా అదాయం వస్తున్న మార్గాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేనప్పటికీ... అలాంటిది ప్రభుత్వ ఆదాయాన్ని వదులుకుని రాత్రికి రాత్రే చెక్‌పోస్టులను ఎత్తివేయడం పెద్ద చర్చనీయాంశమైంది. దీనివెనుక పెద్ద మతలబే జరిగిందని గ్రానైట్, అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా కీలక నేతలు, మంత్రులతో సంబంధం లేకుండానే పెద్ద డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, గ్రానైట్ అసోసియేషన్ నాయకుడు రాష్ట్ర రాజధానిలో ‘ముఖ్య’నేతను కలవడం, ఆ వెంటనే చెక్‌పోస్టుల ఎత్తివేయడం చకచకా జరిగిందని తెలుస్తోంది. ‘ముఖ్య’నేత స్థాయిలో జరిగిన వ్యవహారం కావడంతో దీనివెనుక ఎంత ‘డీల్’ జరిగిందనే అంశంపై పెదవి విప్పేందుకు ఏ ఒక్కరూ సాహసించకపోవడం గమనార్హం. పట్టపగలే ఇష్టారాజ్యంగా... హైదరాబాద్ నుంచి చెక్‌పోస్టుల ఎత్తవేతపై ఆదేశాలు రావడంతో గ్రానైట్ లారీలకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. నిబంధనల ప్రకారం అయితే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7గంటల మధ్యలోనే నగరం నుంచి గ్రానైట్ రవాణా చేయాల్సి ఉన్నప్పటికీ గత రెండ్రోజులుగా అందుకు భిన్నంగా పట్టపగలు కూడా గ్రానైట్ లారీలు కరీంనగర్ మీదుగా వెళుతున్నాయి. అయితే అధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేకుండా మిన్నకుండిపోవడం విశేషం. -
‘గ్రానైట్’ సమస్యలపై మంత్రికి వినతిపత్రం
సాక్షి, ఖమ్మం: గ్రానైట్ పరిశ్రమల సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రానైట్ అసోసియేషన్ నాయకులు మంత్రి హరీష్‌రావుకు శనివా రం వినతిపత్రమిచ్చారు. వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాలతోపాటు జిల్లాకు చెందిన అసోసియేషన్ నాయకులు మంత్రికి తమ సమస్యలను విన్నవిం చారు. మైనింగ్ రాయల్టీని తగ్గించాలని, పెండిం గులో ఉన్న క్వారీల లీజులకు వెంటనే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, పెండిం గులోగల సబ్సిడీలను విడుదల చేయాలని, సేల్స్ ట్యాక్స్‌ను 14.5శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని కోరారు. కరెంటు కొరతతో గ్రానైట్ పరిశ్రమ నడిచే పరిస్థితి లేదని చెప్పారు. ఇచ్చే సరఫరాలోనూ అంతరాయం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో గ్రానైట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాధు రమేష్‌రెడ్డి, నాయకులు రాయల నాగేశ్వరరావు, గాయత్రి రవి, యలమద్ది శ్రీనివాసరావు, పారా నాగేశ్వరరావు, పుసులూరి సురేష్‌కుమార్, వేముల రవికుమార్, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.