దిగంతాలకు తెలుగు సంతకం
ఆకాశంలో సూర్యుడు మర్డర్ చేసినట్టుగా లేడు...
కన్నీటి ముద్దలా ఉన్నాడు.
ముత్యమంతా పసుపు... ముఖమెంతొ చాయ... కూనిరాగం మూగబోయింది.
సగటు ఇల్లాలి గొంతు దుఃఖంతో రుద్ధమైంది.
పట్టీల పాదాల ఆడపిల్లలందరూ చిన్నబుచ్చుకుని పక్కకు తప్పుకున్నారు.
బుడుగు అల్లరి ఆపేశాడు...
సీగాన పెసూనాంబ నోటికి తాళం పడింది.
ఇంతకాలం నవ్వించిన తెలుగు వ్యంగ్య రేఖా పాత్రలన్నీ
తండ్రి కనిపించని పిల్లల్లా కేర్కేర్మని ఏడుస్తున్నాయి.
రామయ్య దర్పం, సీతమ్మ చిర్నవ్వు క్షణమాత్రం చెదిరి వదనాలు విషణ్ణమయ్యాయి.
బాపు మరి లేరు.
కుదురుగా బలిష్టంగా ఉండే ఆయన బొటనవేలు, చూపుడు వేలు మధ్య ఆ కుంచె మరి లేదు.
తెలుగు అందం మరి లేదు. తెలుగు హాస్యం మరి లేదు. పాశ్చాత్య ప్రపంచాన్ని తన వైపు లాగిన
రామాయణ, భారత, భాగవతాల తెలుగు రేఖా సౌరభం మరి లేదు. తెలుగుదనంతో నిండిన
ఆ సినిమా మరి లేదు. తెలుగు స్నేహానికి తార్కాణంగా నిలిచిన ఆ జోడి మరి లేదు.
50 ఏళ్ల చలనచిత్రకారుడు బాపు... 65 ఏళ్ల చిత్రకారుడు బాపు... 81 ఏళ్ల చరిత్రకారుడు బాపు
ఇక మనకు లేరు.
సాక్షి ప్రతినిధులు: సుప్రసిద్ధ దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్టు బాపు (81) ఆదివారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతూ సాయంత్రం 4.45 గంటలకు తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా వృద్ధాప్య కారణాలతో ఇంటిపట్టునే ఉంటున్న బాపు మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురై ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. రాత్రి 7.30 గంటలకు బాపు భౌతికకాయాన్ని చెన్నై అడయారులోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. బాపు మరణవార్త నగరంలో వేగంగా వ్యాపించడంతో పలువురు ప్రముఖులు ఇంటికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. బాపు భార్య భాగీరథి గత ఏడాది ఏప్రిల్ 24న కన్నుమూశారు. ఆయనకు కుమార్తె భానుమతి, కుమారులు వేణుగోపాల్, వెంకటరమణ ఉన్నారు. బాపు పెద్ద కుమారుడు వేణుగోపాల్ ఈ నెల 29న జపాన్‌కు వెళ్లారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న ఆయన సోమవారం చెన్నై చేరుకుంటారని తెలిసింది. హైదరాబాద్ నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరుకానున్నారు. సోమవారం సాయంత్రం చెన్నైలో అంత్యక్రియలు జరగనున్నాయి.
చిత్రకారుడు బాపు
పదిహేనేళ్ల వయసులోనే బాపు కుంచె చేతబూనారు. బాలానంద సంఘం నుంచి బాలపత్రికలో బాపు బొమ్మల కథ మొదలయ్యింది. నవ యవ్వన దశలోనే కవర్ డిజైన్లు, కామిక్సు, కార్టూన్లు గీయడం మొదలుపెట్టారు. బాపు బొమ్మల్లో ఆడతనం, జాణతనం, కన్నెతనం, గడుసుతనం మద్రాసు మేధావుల్ని విస్తుపోయేలా చేసింది. ‘ఎవరయ్యా ఈ ఆర్టిస్టూ’ అంటూ కనురెప్పలెగరేసేలా చేసింది. అప్పట్నుంచి బాపు బొమ్మలు కూడా వారికి దీటుగా మాట్లాడటం, వెక్కిరించడం, ఎగతాళి చేయడం, ముక్కున వేలేసుకోవడం నేర్చాయి. ఇలస్ట్రేటర్‌గా, కార్టూనిస్ట్‌గా, పెయింటర్‌గా, డిజైనర్‌గా... బాపుది అద్వితీయ ప్రస్థానం. వాలుజడను విసురుతూ.. చారడేసి కళ్ళు, కోటేరు ముక్కుతో వయ్యారాలు ఒలకబోసే బాపు బొమ్మ తెలుగువారి ఆస్తి. అడపాదడపా బాపు బొమ్మను స్మరించకుండా మన సినీ గేయ రచయితలు కూడా ఉండలేరు. బాపు ఆగమనంతో సినిమా వాల్‌పోస్టర్ల రూపు రేఖలు మారిపోయాయి. ఈ అద్వితీయ ప్రతిభే ఆయన్ను తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన చిత్రకారునిగా నిలబెట్టింది. బాపు కుంచె నుంచి జాలువారిన తిరుమల శ్రీవారి చిత్రాలు, అన్నమయ్య నాట్య విన్యాసాలు తిరుమల భక్తులను నేటికీ తన్మయానికి గురి చేస్తుంటాయి.
వెండితెరపై బాపు అద్భుతాలు
‘సాక్షి’ తర్వాత బాపు వెండితెర అద్భుతం అంటే ‘బుద్ధిమంతుడు’ (1969) సినిమానే చెప్పుకోవాలి. నాస్తికునిగా, ఆస్తికునిగా రెండు విభిన్న పాత్రల్లో అక్కినేనిని చూపించి శభాష్ అనిపించారు బాపు. ఫాంటసీలో ఇదొక వినూత్న ప్రయత్నం. ఇప్పటికీ ఈ సినిమా కొత్తగానే ఉంటుంది.
ఇక అప్పటివరకూ వచ్చిన పౌరాణికాలు ఒక ఎత్తు, బాపూ ‘సంపూర్ణ రామాయణం’(1971) ఒక ఎత్తు. శోభన్‌బాబుని రామునిగా చేసి బాపు తీసిన ఈ సినిమా ఓ క్లాసిక్. వాల్మీకి రామాయణాన్ని ఇంత మధురంగా తీర్చిదిద్దిన సినిమా ఇప్పటికీ లేదంటే అతిశయోక్తికాదు.
1973లో అక్కినేనితో చేసిన ‘అందాల రాముడు’ సినిమా అయితే.. ఓ అందమైన గోదారి ప్రయాణమే.
శ్రీరాముడంటే బాపు-రమణలకు మహాభక్తి. ఎంత భక్తంటే.. రాముడే తమను నడిపిస్తున్నాడనుకునేంత. ఆ భక్తినంతా క్రోడీకరించి వారు తీసిన సినిమా ‘శ్రీరామాంజనేయ యుద్ధం’. వెండితెరపై రాముడిగా అప్పటికే చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్.. బాపు దృక్కోణంలో రాముడిగా శోభతో వెలిగిపోయారు. ఈ కల్పిత కథను జనరంజకంగా మలిచి, శభాష్ అనిపించుకున్నారు బాపు.
బాపు ‘ముత్యాలముగ్గు’ సాంఘిక చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్.
1975లో ‘ముత్యాలముగ్గు’ తెలుగు సినిమా గమనాన్ని మార్చేసింది. ముళ్లపూడి వెంకటరమణ అయితే.. సంభాషణలతో చెలరేగిపోయారు. రావుగోపాలరావు అనే నటుడు దశాబ్దంన్నర పాటు తిరుగులేని విలన్‌గా తెలుగుతెరను ఏలారంటే కారణం ‘ముత్యాలముగ్గు’. రామాయణాన్ని సోషలైజ్ చేసి తీసిన సినిమా ఇది.
‘సీతా కల్యాణం’(1976) చిత్రంలో తెలుగు తెరపై సాంకేతిక విప్లవం సృష్టించారు బాపు.
లండన్, షికాగో ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన చిత్రమిది. అలాగే లండన్‌లోని ఆర్కైవ్స్‌లో ఈ చిత్రాన్ని భద్రపరిచారు. ఈ సినిమా చూసిన దర్శకుడు కె.బాలచందర్ ఢిల్లీలోని ఓ అవార్డు ఫంక్షన్లో బాపుని కలిసి.. ‘నేను గుడికి వెళ్లను. దేవుణ్ణి నమ్మను. కానీ... నీ ‘సీతాకల్యాణం’ చూశాక.. ఆ దృశ్యాలే నా కళ్లలో మెదులుతున్నాయి’ అన్నారు పారవశ్యంతో.
వెండితెరకు కన్నప్ప..
ధూర్జటి ‘కాళహస్తి మహత్యం’(1976) కావ్యానికి బాపు ఇచ్చిన వెండితెర రూపం ‘భక్త కన్నప్ప’. కృష్ణంరాజుని కన్నప్పగా, బాలయ్యను పరమశివునిగా చూపిస్తూ ఆయన తీసిన ఈ కావ్యం ఇప్పటికీ ప్రేక్షకుల్ని తన్మయానికి గురి చేస్తుంది.
సామాజిక దృక్పథంతో కూడిన కథాంశంతో బాపు తీసిన సినిమా ‘మనవూరి పాండవులు’(1978). చిరంజీవి తొలి శతదినోత్సవ చిత్రమిదే. బాపూలోని విప్లవభావాలకూ ఈ సినిమా అద్దం పడుతుంది.
ఇంకా గోరంత దీపం, తూర్పువెళ్లే రైలు, వంశవృక్షం, బైబిల్ కథాంశంతో తీసిన ‘రాజాధిరాజు’, త్యాగయ్య, రాధాకల్యాణం, మంత్రిగారి వియ్యంకుడు, జాకీ, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం, శ్రీరామరాజ్యం... ఇలా ఎన్నో అద్భుతాలు బాపు సృజన నుంచి జాలువారాయి. పదికి పైగా హిందీ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు బాపు.
ఎక్కడ చూసినా ఆయన అక్షరాలే..
అక్షరాలు గుండ్రంగానే ఉండాలా? అలాగైతే పాత అక్షరాలనే కంపోజ్ చేసుకోవచ్చుగా అంటూ ముద్రణ రంగంలోని పాత చింతకాయ విధానాలపై ఉద్యమించారు బాపు. ఇక బాపు ఫ్రీస్టయిల్ అక్షరాలు ముద్రణ రంగంలో పోటెత్తాయి. సినిమా పోస్టర్లు, సైన్ బోర్డులు, పత్రిక శీర్షికలు ఇలా ప్రతి వాటిపై బాపు అక్షరాలే. ఈ సాఫ్ట్వేర్ యుగంలో కూడా బాపు బ్రష్, బాపు నిబ్ అంటూ పలు రకాల లిపులు అక్షర చరిత్రలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. తెలుగునాట ఏ శుభకార్యం జరిగినా సదరు శుభలేఖలపై ఉండే బాపు అక్షరాలే తెలుగువారికి శుభాక్షితలు.
ముళ్లపూడితో స్నేహం
బాపు-రమణ.. వీరిద్దరి శరీరాలే వేరు. ఆత్మలు ఒక్కటే. బాపు విజయాల్లో సగభాగం రమణకు ఇవ్వాల్సిందే. ముళ్లపూడి చివరి శ్వాస విడిచే వరుకూ బాపూ చేయి విడువలేదు. బాపు గీత, ముళ్లపూడి రాత జీవ నదుల్లా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ముళ్లపూడి మరణం బాపుని మానసికంగా కుంగదీసింది. అప్పట్నుంచే ఆయన ఆనారోగ్యానికి గురయ్యారు. ఈరోజు బాపు మన మధ్య లేకపోవడం యావత్ భారతావనికే తీరని లోటు.
చలన చిత్రకారుడు..
బాపుకు మొదట్నుంచీ సినిమాల పిచ్చి. వచ్చిన ప్రతి సినిమానూ చూసేవారు. నచ్చితే మళ్లీ మళ్లీ చూసేవారు. చూసొచ్చిన తర్వాత మిత్రులతో ‘నేనైతే.. ఇలా తీసేవాణ్ణి’ అంటూ చర్చాగోష్టి పెట్టేవారు. చిత్రకారుడైన తనకు ఎప్పటికైనా చలనచిత్రకారుడు కూడా కావాలని ఆకాంక్ష. ఆ కోరికను ప్రాణమిత్రుడైన ముళ్లపూడి వెంకటరమణ తీర్చేశారు. అప్పటికే రమణ స్టార్ రైటర్. రక్తసంబంధం, మూగ మనసులు, దాగుడు మూతలు, గుడిగంటలు లాంటి సిల్వర్‌జూబ్లీ చిత్రాలకు రచనలు చేసిన అనుభవం ఆయనది. పైగా బాపు ప్రతిభ బాగా తెలిసిన వ్యక్తి. అందుకే బాపు ‘డెరైక్షన్’ అనగానే రమణ ‘యాక్షన్’ అనేశారు. 1967లో కేవలం రెండున్నర లక్షల ఖర్చుతో ‘సాక్షి’ సినిమాను తీసేశారు బాపు. బొమ్మలు గీసుకునేవాడికి సినిమాలేంటి? అని వెటకారం చేసిన వారే ముక్కున వేలేసుకున్నారు. ఇక అప్పట్నుంచి ‘శ్రీరామరాజ్యం’ వరకూ 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు బాపు.
తెలుగుదనానికి బ్రాండ్ అంబాసిడర్
1977లో ‘స్నేహం’ సినిమా ద్వారా బాపూరమణలు నన్ను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ రమణగారు నాముందు ప్రత్యక్షమయ్యారు. ‘పెళ్లిపుస్తకం’ సినిమా తీశారు. ఇవాళ ఏ తెలుగువారి ఇంట పెళ్లి జరిగినా ఇందులోని శ్రీరస్తు.. శుభమస్తు.. పాట మోగాల్సిందే కదా. వారే మళ్లీ మిస్టర్ పెళ్లాం చేశారు. మధ్యతరగతి లలిత శృంగారాన్ని చూపిన సినిమాగా అదెలా నిలిచిపోయిందో మనందిరికీ తెలుసు. వీటన్నింటికన్నా బాపూగారిని మనం తలుచుకోవాల్సింది ఆయన బొమ్మలని, వాటిలోని తెలుగుదనాన్ని. ఆయన తెలుగుదనానికి బ్రాండ్ అంబాసిడర్.
- నటుడు రాజేంద్రప్రసాద్
వెండితెర అమరశిల్పి జక్కన్న
కళాత్మక చిత్రాలకు పెట్టింది పేరు బాపుగారు. ఆయన తీసిన ప్రతి చిత్రమూ సకుటుంబ సమేతంగా చూడదగ్గవే. ప్రతి ఫ్రేమ్‌ను అందంగా ఆవిష్కరించిన వెండితెర అమరశిల్పి జక్కన్న బాపుగారు. అసలు రమణగారు పోయినప్పుడే బాపూగారు మానసికంగా చనిపోయారు. ఇప్పుడు భౌతికంగా దూరమయ్యారు. తెలుగు సినిమా తెర మీద ఆయన ముద్ర ప్రగాఢమైనది. అందమైన అమ్మాయి కనిపిస్తే బాపు బొమ్మ అనడం మన తెలుగువారికి పరిపాటి అయ్యింది. ఆయన మరణం తీరని లోటు.
- దర్శకుడు దాసరి నారాయణరావు
తొలి కథానాయికను..
దర్శకునిగా ‘సాక్షి’ ఆయనకు తొలి సినిమా. ఆ విధంగా బాపూగారి తొలి కథానాయికను నేను కావడం నాకెప్పటికీ ఆనందంగా ఉంటుంది. నేను దర్శకురాల్ని కావడానికి కారణం బాపూగారే. సినిమా గురించి ఏ సందేహం అడిగినా విసుక్కోకుండా చెప్పేవారు. ‘సాక్షి’ చిత్రం ద్వారానే నాకు కృష్ఱగారితో పరిచయం ఏర్పడింది. బాపూగారి దయవల్ల కృష్ణగారు నా జీవితంలోకి వచ్చారు. ఏడాది క్రితం ఆయన్ను ఓ ఫంక్షన్లో కలిశాను. కానీ, ఇంత త్వరగా మనకు దూరమవుతారని ఊహించలేదు.
- నటి, దర్శకురాలు విజయనిర్మల
బొమ్మల దర్శకులను చూడలేదు
నా తొలి చిత్రం ‘తేనె మనసులు’కి రమణగారే కథ రాశారు. ఆ చిత్రం లొకేషన్‌కి రమణగారు, బాపూగారు అప్పుడప్పుడు వస్తుండేవారు. నేను హీరోగా బాపు గారు తీసిన ‘సాక్షి’ సినిమాను 17, 18 రోజుల్లోనే పూర్తి చేసేశారు. ప్రతి సీన్ తీసే ముందు బొమ్మలు గీసి, కెమెరామేన్‌కి చూపించి ‘ఈ షాట్ నాకిలా రావాలి’ అని చెప్పేవారు బాపూగారు. నేనిప్పటివరకు 300కు పైగా సినిమాల్లో నటించాను. కానీ, అలా బొమ్మలు గీసి, ఆ ప్రకారమే సీన్స్ రావాలని చెప్పిన దర్శకులను చూడలేదు. అంతటి మహా దర్శకుణ్ణి కోల్పోవడం దురదృష్టం.
- సూపర్‌స్టార్ కృష్ణ
ఆ ఘనత బాపూగారిదే: మోహన్‌బాబు
వాలు జడ, సొగసు కళ్లు.. ఇంత అందంగా ఉండాలని చూపించిన కుంచె ఆయనది. కంప్యూటర్ గ్రాఫిక్స్ అందుబాటులో లేని రోజుల్లోనే ‘సీతమ్మ పెళ్లి’ చిత్రంలో సీతాదేవి భూమి నుంచి పైకి వచ్చే సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించిన బాపు ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మహోన్నత వ్యక్తి తన స్నేహితుడు రమణగారితో ‘మోహన్‌బాబు చాలా బాగా నటించాడు’ అనడం నా జీవితంలో మర్చిపోలేని అభినందన.
అది ఆయనకే సాధ్యం: బాలకృష్ణ
పౌరాణిక చిత్రాలు కనుమరుగవుతున్న రోజుల్లో బాపూగారు నాతో ‘శ్రీరామరాజ్యం’ చిత్రం తీశారు. నన్ను శ్రీరాముడిగా మలిచిన తీరు, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన వైనం ఒక్క బాపూగారికే సాధ్యం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో బాపూగారితో ఉన్న ప్రతి క్షణం ఓ తీపి గుర్తు.