నేను యాక్టివ్గానే ఉన్నా...: దానం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారులోని 50 డివిజన్లపై దానం నాగేందర్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య విభేధాలను పరిష్కరించేందుకు గురువారం ఆయన గ్రేటర్ నేతలతో భేటీ అయ్యారు.
త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రానుండటంతో.. పార్టీ అంతర్గత వ్యవహారాలను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈ భేటీలో పాల్గొన్న రంగారెడ్డి కాంగ్రెస్ నేతలు.. దానం వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. గ్రేటర్ కాంగ్రెస్ ను దానం బలో పేతం చేయడం లేదని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న 50 డివిజన్ల వ్యవహారాలు.. జిల్లా కాంగ్రెస్ కే అప్పగించాలని కోరారు.
మరో వైపు ఆ 50 డివిజన్లు కూడా గ్రేటర్ లో భాగం కనుక.. తన పరిధిలోకే వస్తాయన్నట్లు దానం ప్రవర్తించడాన్ని వారు తప్పుపట్టారు. దీనిపై స్పందించిన దిగ్విజయ్ ఆ 50 డివిజన్ల బాధ్యత గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లలో ఎవరిదో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని, పీసీసీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గ్రేటర్, రంగారెడ్డి జిల్లాల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్ధాయిలో ఆరోపణలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓట్ల తొలగింపుపై స్పందించడంలో దానం ఫెయిల్ అయ్యారని ఈ సందర్భంగా పార్టీ నేతలు ఫిర్యాదు చేయగా...అందుకు దానం తాను యాక్టివ్ గానే ఉన్నానని వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లు వార్తలొస్తున్నాయని దానంను ఈ సందర్భంగా ప్రశ్నించగా, తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని దానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఓ దశలో సహనం కోల్పోయిన దిగ్విజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పని చేయాల్సింది పోయి.. ఈ విబేధాలు ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికలపై సూచలను ఇవ్వాలని కోరితే...ఆరోపణలు చేసుకుంటారా అని అసహనం వ్యక్తం చేశారు. ఈ భేటీలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌లు కూడా పాల్గొన్నారు.