Green Channel scheme
-
29 కిలోమీటర్లు...22 నిమిషాలు!
సాక్షి, సిటీబ్యూరో: లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రి–శంషాబాద్‌లోని విమానాశ్రయం మధ్య ఉన్న 29 కిమీ మార్గాన్ని లైవ్ ఆర్గాన్ గుండెతో కూడిన అంబులెన్స్ కేవలం 22 నిమిషాల్లో అదిగమించింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా సిటీ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఇచ్చినట్లు అదనపు సీపీ అనిల్‌కుమార్ తెలిపారు. నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ బుధవారం ఉదయం ఒక్కసారిగా మోగాయి. లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్న డోనర్ తన గుండె, ఊపిరితిత్తులను దానం చేశారని, అవి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతంలోని ఆస్పత్రికి చేరాల్సి ఉందని సమాచారం అందింది. ఆ ఆస్పత్రుల్లో దీన్ని రిసీవ్ చేసుకోవాల్సిన రోగి ఆపరేషన్ మొదలైంది. లైవ్ ఆర్గాన్ గుండెతో కూడిన అంబులెన్స్ మధ్యాహ్నం 12.37 గంటలకు లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రి నుంచి బయలుదేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దింపారు. దీనికి దాదాపు రెండు గంటల ముందు నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్స్‌లో ప్రత్యేక చర్యలు మొదలయ్యాయి. డోనర్ ఇచ్చిన గుండెతో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ విమానాశ్రయం వరకు ఉన్న 29 కిమీ దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు సైబరాబాద్ అధికారుల సాయం కూడా తీసుకున్నారు. ఆ సమయంలో ఈ రూట్ రద్దీగా ఉంటుంది. దీనికితోడు ఇతర జంక్షన్లలోనూ దూసుకువచ్చే వాహనాల వద్ద ప్రమాదాలు, ఆటంకాలు లేకుండా చూడటానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఓ సబ్–ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లడానికి సిద్ధమైంది. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంత పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. గ్లోబల్ ఆస్పత్రి నుంచి బయలుదేరిన ‘లైవ్ ఆర్గాన్స్ బాక్స్’తో కూడిన అంబులెన్స్ మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే మీదుగా ప్రయాణించి సరిగ్గా 12.59 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కాపు కాశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న విమానంలో ఈ ఆర్గాన్‌ను వైద్యులు తీసుకువెళ్లిపోయారు. -
12.6 కిలోమీటర్లు.. 14 నిమిషాలు
సాక్షి, సిటీబ్యూరో: మలక్‌పేటలోని యశోద ఆస్పత్రి– బేగంపేటలోని పాత విమానాశ్రయం మధ్య మార్గం... అనునిత్యం రద్దీగా ఉండే ఈ రూట్లో 12.6 కిమీ దూరాన్ని అంబులెన్స్ కేవలం 14 నిమిషాల్లో అధిగమించింది. ట్రాఫిక్ పోలీసులు గ్రీన్‌ఛానల్ ఇవ్వడంతోనే ఇది సాధ్యమైంది. కోయంబత్తూర్‌లోని పీఎస్జీ ఆసుపత్రికి ‘ప్రయాణించాల్సిన’ ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్ (లైవ్ ఆర్గాన్స్) కోసం నగర ట్రాఫిక్ పోలీసులు ఈ సదుపాయం కల్పించారు. అంబులెన్స్‌కు పైలెట్‌గా వాహనంలో వెళ్ళిన బృందం మొదలు ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమిష్టిగా, సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైంది. ఈ లైవ్ ఆర్గాన్స్‌తో కూడిన అంబులెన్స్ మధ్యాహ్నం 1.21 గంటలకు మలక్‌పేటలోని యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరింది. దీంతో అన్నిస్థాయిల ట్రాఫిక్ అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. డోనర్ ఇచ్చిన లైవ్ ఆర్గాన్స్‌తో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ బేగంపేట విమానాశ్రయం వరకు ఉన్న దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు పని చేశారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లింది. అలానే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో ఉండే అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంత పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 1.35 గంటలకు ‘లైవ్ ఆర్గాన్స్ బాక్స్’లతో కూడిన అంబులెన్స్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో కోయంబత్తూరు వెళ్లాయి. ట్రాఫిక్ పోలీసుల సహకారం వల్లే ఈ తరలింపు సాధ్యమైందంటూ యశోద ఆస్పత్రి యాజమాన్యం ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపింది. -
గ్రీన్ చా‘నిల్’
సాక్షి, సిటీబ్యూరో: నగరాభివృద్ధికి దిశా నిర్దేశం చేయాల్సిన హెచ్ఎండీఏ.. ఇప్పుడు చుక్కానిలేని నావలా మారింది. సంస్థలో సంస్కరణల పేరిట ఉన్నతాధికారులు ప్రవేశపెట్టిన ఆర్భాటపు పథకాలు ఒక్కొక్కటీ వికటిస్తుండడం సంస్థ మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. హెచ్ఎండీఏలో వివిధ అనుమతులకు సంబంధించి సత్వర పరిష్కారం కోసం కమిషనర్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆరు నెలల క్రితం ప్రవేశపెట్టిన ‘గ్రీన్ ఛానెల్’ పథకం ఇప్పుడు వట్టిపోయింది. ఫాస్ట్‌ట్రాక్ క్లియరెన్స్ కోసం ప్రారంభించిన ఈ స్కీమ్‌కు ఒక్క దర ఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. నిజానికి గ్రీన్ ఛానెల్ స్కీం ప్రారంభించక ముందు వివిధ అనుమతులు కోరుతూ నెలకు కనీసం 40-50 దరఖాస్తులు వచ్చేవి. వాటి పరిష్కారం ద్వారా రూ. 20-25 కోట్ల వరకు హెచ్ఎండీఏకు ఆదాయం చేకూరేది. ఈ నేపథ్యంలో కమిషనర్ కొత్త లే అవుట్లు, భవనాల అనుమతుల మంజూరులో జాప్యం నివారణకు ‘గ్రీన్ ఛానెల్’ ప్రారంభించారు. ప్రత్యేకంగా లెసైన్స్డ్ ఆర్కిటెక్ట్స్, డాక్యుమెంట్ ఆడిటర్స్‌ను అధికారికంగా నియమించి వీరి ద్వారా పరిశీలించిన దరఖాస్తులను వెంటనే ఆమోదింప జేస్తామని చెప్పారు. దరఖాస్తు దారు చెల్లించాల్సిన డెవలప్మెంట్ ఛార్జెస్, ఇతర పత్రాల వివరాలను 7 రోజుల్లోగా వారికి లేఖ ద్వారా తెలిపి, సంబంధిత పత్రాల స్వీకరణ, తనఖా వంటి ప్రక్రియ పూర్తి ద్వారా సత్వరం తుది అనుమతి పత్రం అందిస్తామని ప్రకటించారు. అయితే, అవన్నీ ఆచరణ దాల్చలేదు. నిబంధనలకు భయపడి బిల్డర్లు, రియల్టర్లు వెనుకడుగు వేశారు. ఫలితంగా దరఖాస్తులు తగ్గిపోయాయి. సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయంతో హడావుడిగా ప్రారంభించడం వల్లే గ్రీన్ ఛానెల్ పథకం బెడిసికొట్టిందని కింది స్థాయి అధికారులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ లేదట! హైదరాబాద్‌లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్కెట్ లేదని, ఫలితంగా కొత్త పర్మిషన్ల కోసం దరఖాస్తులు రావట్లేదని అధికారులు సాకుగా చూపుతున్నారు. ఇటీవల రాష్ట్రం విడిపోవడంతో కొత్తగా ప్లాట్లు కొనేవారు, అమ్మేవారు లేరని ఆ ప్రభావం గ్రీన్ ఛానెల్‌పై పడిందంటున్నారు. అయితే, బడాబాబులు మాత్రం తమకున్న ‘ప్రత్యేక ఛానెల్’ ద్వారా అనుమతులు పొందుతుండటంతో గ్రీన్ ఛానెల్‌కు దరఖాస్తులు రావట్లేదని తెలుస్తోంది. ప్లానింగ్ విభాగంలో వేళ్లూనుకొన్న అవినీతిని అడ్డుకోకుండా ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదని హెచ్ఎండీఏలో పలువురు ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తున్నారు.