సాక్షి, సిటీబ్యూరో: నగరాభివృద్ధికి దిశా నిర్దేశం చేయాల్సిన హెచ్‌ఎండీఏ.. ఇప్పుడు చుక్కానిలేని నావలా మారింది. సంస్థలో సంస్కరణల పేరిట ఉన్నతాధికారులు ప్రవేశపెట్టిన ఆర్భాటపు పథకాలు ఒక్కొక్కటీ వికటిస్తుండడం సంస్థ మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. హెచ్‌ఎండీఏలో వివిధ అనుమతులకు సంబంధించి సత్వర పరిష్కారం కోసం కమిషనర్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆరు నెలల క్రితం ప్రవేశపెట్టిన ‘గ్రీన్ ఛానెల్’ పథకం ఇప్పుడు వట్టిపోయింది. ఫాస్ట్‌ట్రాక్ క్లియరెన్స్ కోసం ప్రారంభించిన ఈ స్కీమ్‌కు ఒక్క దర ఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.
నిజానికి గ్రీన్ ఛానెల్ స్కీం ప్రారంభించక ముందు వివిధ అనుమతులు కోరుతూ నెలకు కనీసం 40-50 దరఖాస్తులు వచ్చేవి. వాటి పరిష్కారం ద్వారా రూ. 20-25 కోట్ల వరకు హెచ్‌ఎండీఏకు ఆదాయం చేకూరేది. ఈ నేపథ్యంలో కమిషనర్ కొత్త లే అవుట్లు, భవనాల అనుమతుల మంజూరులో జాప్యం నివారణకు ‘గ్రీన్ ఛానెల్’ ప్రారంభించారు. ప్రత్యేకంగా లెసైన్స్‌డ్ ఆర్కిటెక్ట్స్, డాక్యుమెంట్ ఆడిటర్స్‌ను అధికారికంగా నియమించి వీరి ద్వారా పరిశీలించిన దరఖాస్తులను వెంటనే ఆమోదింప జేస్తామని చెప్పారు.
దరఖాస్తు దారు చెల్లించాల్సిన డెవలప్‌మెంట్ ఛార్జెస్, ఇతర పత్రాల వివరాలను 7 రోజుల్లోగా వారికి లేఖ ద్వారా తెలిపి, సంబంధిత పత్రాల స్వీకరణ, తనఖా వంటి ప్రక్రియ పూర్తి ద్వారా సత్వరం తుది అనుమతి పత్రం అందిస్తామని ప్రకటించారు. అయితే, అవన్నీ ఆచరణ దాల్చలేదు. నిబంధనలకు భయపడి బిల్డర్లు, రియల్టర్లు వెనుకడుగు వేశారు. ఫలితంగా దరఖాస్తులు తగ్గిపోయాయి. సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయంతో హడావుడిగా ప్రారంభించడం వల్లే గ్రీన్ ఛానెల్ పథకం బెడిసికొట్టిందని కింది స్థాయి అధికారులు అంటున్నారు.
ప్రస్తుతం మార్కెట్ లేదట!
హైదరాబాద్‌లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్కెట్ లేదని, ఫలితంగా కొత్త పర్మిషన్ల కోసం దరఖాస్తులు రావట్లేదని అధికారులు సాకుగా చూపుతున్నారు. ఇటీవల రాష్ట్రం విడిపోవడంతో కొత్తగా ప్లాట్లు కొనేవారు, అమ్మేవారు లేరని ఆ ప్రభావం గ్రీన్ ఛానెల్‌పై పడిందంటున్నారు. అయితే, బడాబాబులు మాత్రం తమకున్న ‘ప్రత్యేక ఛానెల్’ ద్వారా అనుమతులు పొందుతుండటంతో గ్రీన్ ఛానెల్‌కు దరఖాస్తులు రావట్లేదని తెలుస్తోంది.
ప్లానింగ్ విభాగంలో వేళ్లూనుకొన్న అవినీతిని అడ్డుకోకుండా ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదని హెచ్‌ఎండీఏలో పలువురు ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తున్నారు.