సాక్షి, సిటీబ్యూరో: విశ్వ నగరానికి విధి విధానాలు రూపొందించాల్సిన హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు పూర్తిస్థాయి బాధ్యత వహించే నాథుడు కరవయ్యాడు. పది నెలలుగా ఈ సంస్థ తల లేని మొండెంలా తయారైంది. తాజాగా ఆదివారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో హెచ్‌ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్‌ను ప్రభుత్వం నియమించక పోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. హెచ్‌ఎండీఏ పాలనా పగ్గాలను మళ్లీ ఎఫ్‌ఏసీకే పరిమితం చేయడం ప్రభుత్వ పెద్దల వైఖరికి అద్దంపడుతోందని కొందరు సిబ్బంది బాహాటంగా విమర్శిస్తున్నారు.
ప్రజలకు సత్వర సేవలందించడంలో కృషి చేసే అధికారిగా పేరున్న బి. జనార్దన్‌రెడ్డినే హెచ్‌ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్‌గా నియమించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి కమిషనర్ అండ్ డెరైక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న జనార్దన్‌రెడ్డి నిత్యం సవాలక్ష పనులతో బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించడం వల్ల అత్యవసర ఫైళ్లను క్లియర్ చేయడానికే సమయం సరిపోతుందని, ఇక పాలసీ నిర్ణయాలు తీసుకొనేందుకు ఆయనకు టైం ఉండకపోచ్చని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవలి వరకు హెచ్‌ఎండీఏ ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు వహించిన ప్రదీప్ చంద్ర కూడా తగిన సమయం దొరక్క చాలావరకు సచివాలయానికే తెప్పించుకునేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవతుందన్న వాదనలు విన్పిస్తున్నాయి. పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించడం వల్ల నగరాభివృద్ధికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించి వాటికి ప్రభుత్వం నుంచి ఆమోదం పొందేందుకు గట్టిగా కృషి చేస్తారని, తద్వారా సంస్థకు పూర్వవైభవం వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసులో కమిషనర్ ఉంటేనే.. సిబ్బందిలో అటెన్షన్ ఉంటుందని, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు కూడా భరోసా ఉంటుందని రియల్టర్లు, బిల్డర్లు పేర్కొంటున్నారు.
వెంటాడుతోన్న శాపం..
గతంలో హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్ పనిచేసిన సమయంలో అనేక అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో సీఎం కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకుని ఆయన్ని బదిలీ చేశారు. ఆయన నిర్వాకాలే సంస్థకు శాపంగా మారాయని సిబ్బంది వాపోతున్నారు. ఆ తర్వాత ఈ సంస్థలో పలువురు అధికారులు, కిందిస్థాయి సిబ్బందిపై కూడా ఇలాంటి ఫిర్యాదులే రావడంతో సీఎం హెచ్‌ఎండీఏపై ఏహ్య భావంతో ఉన్నారన్న పుకార్లు వెల్లువెత్తాయి.
ఈ తరుణంలో హెచ్‌ఎండీఏను సంస్కరించేందుకు ఉన్నతాధికారి ప్రదీప్ చంద్రను ఇన్‌చార్జిగా నియమించారు. అయితే, ఆయన హెచ్‌ఎండీఏకు సమయం కేటాయించకపోవడంతో అక్రమాలు యథావిధిగానే కొనసాగుతున్నట్లు విజిలెన్స్ నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఏసీబీ దాడులు చేసి అక్రమార్కులను ఏరివేయండంతో కొంత అలజడి నెలకొంది. ఈ తరుణంలో బి.జనార్దన్‌రెడ్డిని ప్రభుత్వం హెచ్‌ఎండీఏ ఇన్‌చార్జి కమిషనర్‌గా పగ్గాలు అప్పగించడం చర్చనీయాంశమైంది.
హెచ్‌ఎండీఏను వీడని గ్రహణం !
Published Tue, Apr 14 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM
Advertisement