శంకర్రావుపై సీబీఐ విచారణ జరిపించాలి
హైదరాబాద్: గ్రీన్ ఫీల్డ్ ప్లాట్స్ కబ్జాకు పాల్పడుతున్న మాజీ మంత్రి శంకర్రావుపై వెంటనే సీబీఐ విచారణ జరిపించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రీన్ ఫీల్డ్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆయన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి శంకర్రావు సోదరుడు దయానంద ఇటీవల గూండాలతో వచ్చి ఎనిమిది ప్లాట్లను ఆక్రమించి ప్రహరీ నిర్మించాడని, ఈ విషయమై నేరెడ్మెట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.
శంకర్రావును అరెస్టు చేయాలని మల్కాజ్గిరి పదో మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల ట్రస్టు భూముల విషయంలో చొరవ చూపిన విధంగానే గ్రీన్ ఫీల్డ్ కబ్జాల విషయమై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ప్లాట్స్ ఓనర్స్ సత్యనారాయణ మూర్తి, ఎంవీ నరిసింహరావు, కేశవమ్మ, గోవిందరాజుశర్మ, సీహెచ్ అంజయ్యతోపాటు గ్రీన్ ఫీల్డ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు రాంబాబు, నాగరాజన్, ఇనాయక్ హాసన్, విజయానంద తదితరులు పాల్గొన్నారు.