మళ్లీ రోడ్లపైకి బ్యాటరీ బస్సులు
సాక్షి, ముంబై: గతంలో అలా కనిపించి.. ఇలా మాయమైన బ్యాటరీ(ఎలక్ట్రిక్) బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్(బీకేసీ) నుంచి వీటిని తిరిగి ప్రారంభించేందుకు ముంబై మహానగర ప్రాంతీయాభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీఏ) సన్నాహాలు చేస్తోంది. గతంలో ప్రయోగాత్మకంగా ఈ బస్సులను నడిపినా అనుకున్న స్థాయిలో సఫలీకృతం కాకపోవడంతో ఈ సేవలను నిలిపివేశారు. గతంలో తలెత్తిన సమస్యలను అధిగమించి, తిరిగి బ్యాటరీ బస్సులనే నడపాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ బస్సులను బీకేసీ నుంచి సమీపంలోని శివారు ప్రాంతాల రైల్వే స్టేషన్ల వరకు నడపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
కాగా గత ఏడాది బీకేసీలో ‘గ్రీన్ ట్రాన్స్పోర్ట్’ను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించింది. అయితే ఆచరణలో అనుకున్నస్థాయిలో సాధ్యం కాకపోవడంతో మానుకుంది. తర్వాత దీనికి బదులుగా బృహన్ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) సంస్థ సహకారంతో డీజిల్ బస్సులను నడపాలని యోచించింది. బెస్ట్ సంస్థ బస్సులను నడపడంలో కొన్ని సమస్యలు ఎదురవుతుండడంతో మళ్లీ బ్యాటరీ బస్సులవైపే మొగ్గుచూపుతోంది. బీకేసీలో బస్ డిపో కోసం స్థలం లేకపోవడం, సంవత్సరాలు గడుస్తున్నా డిపో కోసం స్థల సేకరణ పూర్తి కాకపోవడంతో ఎమ్మెమ్మార్డీఏ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ఎమ్మెమ్మార్డీఏ కమిషనర్ యూపీఎస్ మదన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... బెస్ట్ సంస్థ సేవలను అందిస్తున్న తీరు తమకు సౌకర్యవంతంగా లేదని, వ్యవస్థకు అనుకూలంగా ఉండే విధంగా బస్సు సేవలను అందిస్తామన్నారు. అందుకే తాము ఎలక్ట్రిక్ బస్సులను నడపాలనే అభిప్రాయానికి వచ్చామన్నారు. అయితే ఈ బస్సు సేవలను అందించడంలో ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేయడానికి ‘ఎంపీఈఎన్ సిస్టమ్ అడ్వయిజరీ ప్రైవేట్ లిమిటెడ్’ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ ఎనిమిది వారాల్లో నివేదికను అందిస్తుందని చెప్పారు. కన్సల్టెన్సీ రుసుము కోసం ఎమ్మెమ్మార్డీఏ రూ.9.5 లక్షలను కమిటీకి చెల్లించనుందని మదన్ తెలిపారు.