‘నీటి’ లెక్క... లేదు పక్కా!
► నీటి మీటర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం
► ఇంటింటి ప్రచారంపై క్షేత్రస్థాయి సిబ్బంది నిరాసక్తత
► ప్రతి నెలా జలమండలి ఖజానాకు రూ.కోట్లలో నష్టం
► 8.76 లక్షల నల్లాలకు..మీటర్లున్నవి 1.60 లక్షలకే..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో అన్ని నల్లాలకు నీటిమీటర్ల ఏర్పాటు విషయంలో జలమండలి క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వీడడంలేదు. ప్రతి నీటి చుక్కను శాస్త్రీయంగా లెక్కగట్టడం ద్వారా వినియోగదారులకు బిల్లుల మోత లేకుండా చూసేందుకు బోర్డు యాజమాన్యం మీటర్లను తప్పనిసరిచేసింది. కానీ వీటి ఏర్పాటు విషయంలో వినియోగదారుల్లో ఉన్న అపోహలను తొలగించి వారికి అవగాహన కల్పించడంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్మెన్లు, మీటర్ రీడర్లు విఫలమవుతున్నారు. మీటర్లు లేకపోవడంతో ప్రస్తుతం డాకెట్ సరాసరి పేరుతో అశాస్త్రీయంగా జారీ అవుతున్న బిల్లులతో వినియోగదారులకూ బిల్లుల మోత మోగుతుండడం గమనార్హం.
1.60 లక్షల నల్లాలకే మీటర్లు..
గ్రేటర్ పరిధిలో 8.76 లక్షల నల్లా కనెక్షన్లుండగా..ఇందులో 1.60 లక్షల నల్లాలకు మాత్రమే మీటర్లున్నాయి. మిగతా నల్లాలకు మీటర్లు ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ మంత్రి కేటీఆర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర ఎం.దానకిశోర్ల ఆదేశాల మేరకు ఇటీవల జలమండలి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మీటర్ రీడర్లు, లైన్మెన్లు వినియోగదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి మీటర్ల ఏర్పాటుపై అవగాహన కల్పించడంతోపాటు మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అయితే ఈ విషయంలో పలువురు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటివరకు కేవలం 43,328 మంది వినియోగదారులకు మాత్రమే నోటీసులివ్వడం గమనార్హం. ఇక మీటర్లు ఏర్పాటు చేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 1150 మంది వినియోగదారులకు వీటి ఏర్పాటుకు సహకరించే విషయంలోనూ అదే ధోరణి ప్రదర్శిస్తుండడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహానగరం పరిధిలో అన్ని నల్లాలకు నీటిమీటర్లు ఏర్పాటు చేయకపోవడంతో నెలకు జలమండలి ఖజానాకు రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా.