Groundwater Department
-
రాష్ట్రంలో 2 లక్షల మంది రైతులకు ఉచితంగా బోర్లు
భవానీపురం (విజయవాడ పశ్చిమ): వైఎస్సార్ జలకళ పథకం కింద రాష్ట్రంలోని రెండు లక్షల మంది రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్విస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ అన్నారు. భూగర్భజల శాఖ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం భూగర్భజల వ్యవస్థలు, సవాళ్లు, అవకాశాలు అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకుని నీటి ప్రాధాన్యతను తెలియచేసేలా ఎంతో బాధ్యతతో భూగర్భజల శాఖ విధులు నిర్వహిస్తుందని చెప్పారు. భావి తరాలకు తాగు, సాగు నీరు అందించేందుకు నీటిని పొదుపుగా వాడటంలో, భూగర్భ జలాల వివరాలను తెలియచేయటంలో భూగర్భజల శాఖ గత ఐదు దశాబ్దాలుగా విశేష కృషి చేసిందని తెలిపారు. జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో జలవనరులు కీలకమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం దేశంలోనే తొలి హైడ్రాలజీ ప్రాజక్ట్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు సుస్థిర స్థానం ఉందన్నారు. ఈ స్వర్ణోత్సవ వేళ నిర్వహించిన ఈ సదస్సు భావితరాలకు, తదుపరి ప్రణాళికలకు ఒక వేదికగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 13 జిల్లాల అధికారులు రూపొందించిన 13 పుస్తకాలను, గత 50 ఏళ్లుగా భూగర్భ జలశాఖ అమలు చేసిన ప్రణాళికలు, పరిశోధనల సమాహారంగా రూపొందించిన పుస్తకం, సావనీర్‌ను మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఆవిష్కరించారు. -
ఇక గంట గంటకూ పాతాళగంగ లెక్క
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఒక ప్రాంతంలో భూగర్భ జలమట్టం లెక్కించాలంటే భూగర్భజల శాఖ అధికారులు స్వయంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పైజోమీటర్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి నెల 15వ తేదీ తర్వాత పైజోమీటర్ల వద్దకు వెళ్లి ఆ నెలలో నీటి మట్టం ఎంత పెరిగింది, ఎంత తగ్గిందనే వివరాలు రికార్డు చేస్తున్నారు. అయితే.. ఇకపై ఈ తిప్పలు తప్పను న్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కార్యాలయంలో కూర్చునే ఆయా ప్రాంతాల్లో భూగర్భజల మట్టం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే వెసులు బాటు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం పైజోమీటర్లకు డిజిటల్ వాటర్ లెవల్ రికార్డర్ల (డీడబ్ల్యూఎల్‌ఆర్)ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రతి గంటకు ఏ స్థాయిలో నీటి మట్టం ఉందో కూడా తెలుసుకునే వీలు కలిగింది. వెబ్‌సైట్‌తో అనుసంధానం : పైజోమీటర్లకు బిగించే డబ్ల్యూఎల్ఆర్లను ప్రత్యేక వెబ్‌సైట్‌తో అనుసంధానిస్తున్నారు. దీంతో ఈ వెబ్సైట్ ద్వారా అవసరం ఉన్న ప్రాంతాల్లోని పైజోమీటర్కు సంబంధించిన భూగర్భ నీటి మట్టం వివరాలను ఎప్పటికప్పుడు పొందవచ్చు. వీటి పనితీరుపై ఆ శాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న హైడ్రాల జిస్టులు, జియాలజిస్టులకు శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు భూగర్భజల వనరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పైజోమీటర్లలో కట్టుదిట్టమైన రక్షణ ఉన్న వాటికి డీడబ్ల్యూఎల్ఆర్లను అమర్చుతోంది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 240 పైజోమీటర్లకు ఈ రికార్డర్లను అమర్చారు. రెండో విడతలో పెద్ద సంఖ్యలో ఈ రికార్డర్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు సైతం తీసుకున్నారు. ఒక్కో మండలానికి కనీసం రెండు చొప్పున రికార్డర్లను అమర్చాలని ప్రతిపాదనలు వెళ్లాయి. బోర్ల ద్వారా నీటి వాడకం తెలిసిపోతుంది డిజిటల్ వాటర్ లెవల్ రికార్డర్ల ద్వారా ఏఏ ప్రాంతాల్లో బోర్లు నడుస్తున్నాయనే సమాచారం సైతం అధికారులకు తెలిసిపోతుంది. ఈ సమాచారం అటు విద్యుత్‌శాఖకు కూడా ఉపయోగపడుతుంది. వారు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించుకునేందుకు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. పథకం పేరు : నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పైజోమీటర్లు : 966 డీడబ్ల్యూఎల్ఆర్లు అమర్చిన ఫీజోమీటర్లు : 240 -
నీళ్లు నిండాయి!
సాక్షి, హైదరాబాద్: గడిచిన రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భూగర్భ నీటిమట్టాలు పెరిగాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందున్న పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం భూగర్భ నీటిమట్టాలు గణనీయంగా మెరుగయ్యాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారడం, చిన్ననీటి వనరుల్లో సమృధ్ధిగా నీటి లభ్యత ఉండటం పాతాళగంగ పైకి వచ్చేందుకు దోహదపడింది. జూన్ మొదటి వారంలో 15 మీటర్ల దిగువకు పడిపోయిన నీటిమట్టం... ప్రస్తుతం 9.75 మీటర్లకు చేరింది. ఇక రాష్ట్రంలోనూ ప్రస్తుతం పంటలన్నీ పొట్ట దశలో ఉండటం, వాటికి భూగర్భ వినియోగం అవసరం లేకపోవడం, ఇంకా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భూగర్భ నీటిమట్టాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. గణనీయ వృధ్ధి.. గత నెలలో రాష్ట్ర సగటు వర్షపాతం 726 మిల్లీమీటర్లకుగాను 795 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఏకంగా 9 జిల్లాల్లో (హైదరాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నారాయణపేట, సిరిసిల్ల, సిధ్దిపేట, నిజామాబాద్, వరంగల్ అర్బన్) ఏకంగా 21 శాతం నుంచి 36 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఈ ఏడాది జూన్‌లో రాష్ట్ర సగటు నీటిమట్టం 15 మీటర్లు ఉండగా ఆగస్టులో అది 11.15 మీటర్లుకు చేరింది. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో అది 9.85 మీటర్లకు చేరింది. అంటే జూన్‌తో పోలిస్తే 5.15 మీటర్లు, ఆగస్టుతో పోలిస్తే 1.30 మీటర్ల మేర భూగర్భమట్టం మెరుగైంది. రాష్ట్ర భూభాగంలో 30 శాతం 5 మీటర్లకన్నా తక్కువ మట్టంలోనే భూగర్భ నీటిలభ్యత ఉండగా 28.7 శాతం భూగర్భ విస్తీర్ణంలో 5 నుంచి 10 మీటర్ల మధ్యన నీటిమట్టాలు రికార్డయ్యాయి. దీనికితోడు గడిచిన నెలంతా కురిసిన వర్షాలతో చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. రాష్ట్రంలో ఉన్న 40 వేలకుపైగా చెరువులకుగాను ఏకంగా 14 వేల మేర చెరువులు నిండుకుండలుగా కనబడుతున్నాయి. ఒక్క గోదావరి బేసిన్లోనే 10,500 చెరువులు పూర్తిస్థాయిలో నిండగా కృష్ణా బేసిన్లో 3,300 చెరువులు జలకళతో కలకళ్లాడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే 10 వేల చెరువులు నిండుగా ఉండటం, మరో 10 వేల చెరువుల్లోనూ సగానికిపైగా నీరు చేరడం భూగర్భ నీటిమట్టాల్లో పెరుగుదలకు దోహదపడింది. రాష్ట్రంలో ఒక్క మెదక్ జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లోనూ 20 మీటర్ల పరిధిలో భూగర్భ నీటిమట్టాలు లభ్యతగా ఉన్నాయి. గతేడాది మెదక్ సహా సిధ్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లల్లోనూ 20 మీటర్లకు దిగువనే భూగర్భ మట్టాలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. -
ఊట బావుల ఊరు..
బావులు తవ్వితే నీళ్లు.. బోర్లు వేస్తే చుక్క రాదు - మహబూబ్‌నగర్ జిల్లా వెంకటాపూర్‌లో చిత్రమిది! - ఈ మర్మమేమిటో తెలియక తలలు పట్టుకుంటున్న అధికారులు సాక్షి, మహబూబ్‌నగర్: జలం కోసం జనం పరితపిస్తున్న రోజులివి. భానుడి విశ్వరూపానికి భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి ఎద్దడితో జనం అల్లాడిపోతున్నారు. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇందుకు భిన్నం. ఇక్కడి వ్యవసాయ పొలాల దగ్గర బోర్లు డ్రిల్లింగ్ చేస్తే చుక్క నీరు రాదు. అదే స్థానంలో బావులను తవ్వితే మాత్రం పుష్కలమైన నీరు లభిస్తుంది. 20 అడుగులు తవ్వితే చాలు.. నీరు ఉబికి వస్తోంది. ఊరు ఊరంతా ఇదే పరిస్థితి. దీంతో ఆ గ్రామంలో బోర్లు వేయడం మానేసి ప్రతిఒక్కరూ బావులు తవ్వుకుంటున్నారు. మొదట 20 బావులతో మొదలైన ప్రస్థానం.. ప్రస్తుతం 130 బావులకు చేరింది. ఇంతటి వేసవిలో కూడా ప్రతీ బావి నిండుకుండలా నీటితో కళకళలాడుతుంటుంది. ఇంటింటికి వ్యవసాయం.. ఇంటింటికి బావి ఉండటంతో ఈ గ్రామం సిరుల పంటలకు నిలయంగా మారింది. ఇదే గ్రామానికి పక్కనే ఉన్న తీలేరు, పెద్ద చింతకుంట, బం డ్రవల్లిలలో ఇలాంటి పరిస్థితి కనిపించదు. మరో పక్క ఈ భిన్నమైన పరిస్థితులకు మూల కారణంపై భూగర్భజలశాఖ అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. ఇదో ప్రత్యేకత... మరికల్ మండలం తీలేర్ గ్రామ పంచాయతీకి అనుబంధమైన గ్రామమే వెంకటాపూర్. 1950లో పది కుటుంబాలతో గ్రామంగా ఏర్పడిన వెంకటాపూర్‌కు 750ఎకరాల శివారుంది. బావి తవ్విన ప్రతిచోట పుష్కలమైన నీరు రావడంతో కాలక్రమంలో గ్రామం విస్తరించిం ది. మొదట 20 బావులతో మొదలైన వెంకటాపూర్ బావుల ప్రస్థానం ఏటా పెరుగుతూనే ఉంది. ప్రతి కుటుంబానికి ఒక బావి ఉండటంతో తమ పొలాల్లో వరి, వేరుశనగ, తోటలను సాగు చేసుకొని మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అంతేకాదు బావుల్లో సంవత్సరం పొడువునా నీరు ఉండడంతో చేపల పెంపకం చేపడుతున్నారు. ఇలా రెండు విధా లా రైతులకు లాభసాటిగా మారుతోంది. 15 నుంచి 20 అడుగుల్లోనే నీరు పాలమూరు ప్రాంతమంటే సరైన వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటుతుండడం మనం చూస్తుంటాం. మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చాలా దారుణంగా భూగర్భజలాలు పడిపోయాయి. చాలా గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేక దాదాపు 500 అడుగుల లోతుకు బోర్లు వేస్తున్నా ఫలితం ఉండటంలేదు. ఈ నేపథ్యంలో వెంకటాపూర్ గ్రామం ఇందుకు భిన్నంగా ఉంది. బోర్లు వేస్తే చుక్కనీరు పడకపోయినా.. బావులు తవ్వితే అది కూడా 15 నుంచి 20 అడుగుల లోతులో పుష్కలమైన నీరు అందుతోంది. పరిశోధన చేస్తున్నాం వెంకటాపూర్ గ్రామ ప్రత్యేక పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నాం. కేవలం బావులలో మాత్రమే నీరు రావడానికి కొన్ని పరిస్థితులుంటాయి. భూమిలో అనేక పొరలుంటాయి. నీటిని భూమిలోకి పూర్తిగా ఇంకకుండా వెదడ్ (ప్రత్యేక పొర), హార్డ్‌రాక్ వంటి పరిస్థితులున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నల్లరేగడి పొర ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అచ్చం ఇలాంటి పరిస్థితే ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని విడుతూరులో కూడా ఉంది. అయినా వెంకటాపూర్ గురించి పరిశోధన చేస్తున్నాం. పూర్తి నివేదిక రాగానే అందజేస్తాం. – కె.లక్ష్మణ్, భూగర్భ జల అధికారి, మహబూబ్‌నగర్ -
కలెక్షన్ సింగ్
► నోట్లు, నాణేల సేకరణలో ప్రభుత్వ ఉద్యోగి ► ఆర్బీఐ విడుదల చేసిన అన్ని నోట్ల కలెక్షన్ ► 35 ఏళ్లుగా హాబీ కొనసాగింపు పోచమ్మమైదాన్ : హన్మకొండలోని బాలసముద్రానికి చెందిన ఠాకూర్ థరమ్సింగ్ జిల్లాలోని భూగర్భ జలశాఖలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గత 35 ఏళ్లుగా ఆయన ఆర్బీఐ విడుదల చేసిన కరెన్సీని, నాణేలను సేకరిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. రూ. వెయ్యి కరెన్సీ నోటును రూ. 70 వేలకు కొనుగోలు చేసి సేకరించాడంటే ఆయనకు కరెన్సీ కలెక్షన్‌పై ఎంత ఇష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్లో కొనుగోలు.. ఆర్బీఐ విడుదల చేస్తున్న కరెన్సీ నోట్లు అన్నీ కూడా తన దగ్గర ఉండాలనే లక్ష్యంతో ధరమ్‌సింగ్ ముందుకు సాగుతున్నారు. 1954లో విడుదల చేసిన రూ.1000 నోట్‌ను ఆయన ఆన్లైన్లో రూ. 70వేలకు కొనుగోలు చేశారు. అలాగే 1935లో ముద్రించిన రూపాయి నోట్‌ను రూ. 15వేలకు తీసుకున్నారు. కాగా, 1995లో ఆర్బీఐ విడుదల చేసిన రూ. 50 కరెన్సీ నోట్లలో ఉన్న చిత్రంలో పార్లమెంట్‌పైన జాతీయ జెండా లేకపోవడంతో వాటిని వెంటనే రద్దు చేసి మళ్లీ విడుదల చేశారు. అరుుతే తప్పుగా ప్రింట్ అయిన నాలుగు నోట్లను సైతం ఆయన ఆన్లైన్లో రూ.5 వేల నుంచి రూ. 7వేల వరకు కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా, 1940 డిసెంబర్ 23న ఇంగ్లండ్ నుంచి ఇండియూకు బయలుదేరిన షిప్ సముద్రం మధ్యలో మునిగిపోయింది. అది మళ్లీ 40 సంవత్సరాలకు లభించింది. అందులో ఉన్న ప్రింట్ కాని కరెన్సీ పేపర్లను ఆన్లైన్లో వేలం ద్వారా విక్రరుుంచారు. ఆ పాటలో ధరమ్‌సింగ్ రూ.5 నోటును రూ.3 వేలకు, రూ.10 నోటును రూ.4 వేలకు కొనుగోలు చేశారు. కాగా, ధరమ్‌సింగ్ కరెన్సీ నోట్ల సేకరణ కోసం ఇప్పటివరకు రూ.20 లక్షలు ఖర్చు పెట్టారు. కలెక్ట్ చేసిన కరెన్సీలను ప్రత్యేక ఫైళ్లలో భద్రంగా దాచిపెడుతున్నారు. కరెన్సీ కలెక్షన్‌కు ప్రత్యేక గ్రూప్.. దేశ వ్యాప్తంగా కరెన్సీ కలెక్షన్‌కు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో ధరమ్‌సింగ్ సభ్యత్వం తీసుకున్నారు. కాగా, ప్రతి నెల రెండో శుక్ర, శని, ఆదివారాల్లో దేశంలోని పలు నగరాల్లో కరెన్సీ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తుంటారు. ఈ ప్రదర్శనలో ఆర్బీఐ విడుదల చేసిన అన్ని నోట్లను ప్రదర్శిస్తుంటారు. ఇందులో కొన్ని నోట్లను విక్రయిస్తుంటారు. ధరమ్‌సింగ్ ఇలా ఎగ్జిబిషన్లలో ఏర్పాటు చేస్తున్న నోట్లను కొనుగోలు చేస్తూ పాఠశాలల్లో ప్రదర్శిస్తూ విద్యార్థులకు కరెన్సీపై అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడ తయారైందో చెప్పేస్తారు.. ఆర్బీఐ ద్వారా వ స్తున్న నాణేలను చూస్తున్న ధరమ్‌సింగ్ వాటిని ఎక్కడ తయారు చేశారనే విషయాన్ని ఇట్టే చెప్పేస్తారు. వాస్తవంగా ఆర్బీఐ ద్వారా విడుదలయ్యే నాణేలు హైదరాబాద్, ముంబాయి, కోల్‌కతా, ఢిల్లీ(నోయిడా)లో తయారు చేస్తారు. కాగా, ఈ నాణేల్లో ఉండే గుర్తులను చూసి అవి ఎక్కడ తయారవుతున్నాయో చెప్పే పరిజ్ఞానాన్ని ఆయన సంపాదించారు. కాయిన్లో తయారైన సంవత్సరం కింద డైమండ్ ఆకారం ఉంటే ముంబయిలో అని, స్టార్ ఉంటే హైదరాబాద్‌లో అని, డాట్ ఉంటే నోయిడాలో అని, ఏమి లేకుండా ఖాళీగా ఉంటే కోల్‌కతాలో తయారైనట్లుగా గుర్తించి చెబుతారు. 371 నోట్ల సేకరణ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 1935 ఏప్రిల్ 1 ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 558 నోట్లను విడుదల చేసింది. అరుుతే అందులో ధరమ్‌సింగ్ 371 కరెన్సీ నోట్లు సేకరించారు. కాగా, ఆర్బీఐ ఇప్పటి వరకు రూ. 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000 నోట్లు విడుదల చేసింది. వరంగల్‌లో కరెన్సీ మ్యూజియం ఏర్పాటు చేస్తా.. నేను గత 35 ఏళ్లుగా నాణేలు, కరెన్సీని సేకరిస్తున్నా. ఆర్బీఐ ఆధ్వర్యంలో పర్మనెంట్ కరెన్సీ మ్యూజియం ముంబరుులో నడుస్తుంది. మన వరంగల్‌లో అలాంటి పర్మనెంట్ మ్యూజియంను త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను. కరెన్సీ నోట్లపై బ్యాంకు ఉద్యోగులతోపాటు ప్రభుత్వ, ప్రభుత్వతేర సంస్థలు, ఆర్థిక, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పని చేసేవారు రాతలు రాయొద్దు. పాలిమర్ కరెన్సీ వాడకంతో నోట్ల జీవిత కాలం పెరగడమే కాకుండా ముద్రణ ఖర్చు తగ్గడంతో పాటు విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. ఆర్బీఐ పాలిమర్ కరెన్సీ వినియోగంలోకి తెవాలి. -ఠాకూర్ ధరమ్‌సింగ్, సూపరింటెండెంట్, జలవనరులశాఖ వరంగల్