టెలికాం కంపెనీలకు కోయ్ గుడ్‌న్యూస్
రిలయన్స్ జియో సంచలన ఎంట్రీతో మొబైల్ చందాదారుల బేస్‌పై తెగ కంగారు పడిన టెలికాం కంపెనీలకు సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(కోయ్) గుడ్ న్యూస్ చెప్పింది. జీఎస్ఎమ్ టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలు ఆగస్టు నెలలో మొబైల్ సబ్స్క్రైబర్స్(మొబైల్ చందాదారులు)ను భారీగానే పెంచేసుకున్నాయని తెలిపింది. ఆగస్టు నెలలో ఈ కంపెనీల మొబైల్ చందాదారులు 2.09 మిలియన్లు పెరిగి, 781 మిలియన్‌ను క్రాస్ చేసినట్టు కోయ్ వెల్లడించింది. జూలై నెలలో 779 మిలియన్లకు పెరిగిన ఈ చందాదారులు బేస్ ఆగస్టు నెలలో మరింత పెరిగిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ తెలిపింది. సబ్స్క్రైబర్ల నెంబర్లు పెరగడం, భారత్‌లో టెలికాం రంగ వృద్ధి బాటలో పయనిస్తుందనడానికి సంకేతమని కోయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూ చెప్పారు. ప్రతినెల టెలికాం కంపెనీలకు వినియోగదారులు బాగానే పెరుగుతున్నారని పేర్కొన్నారు.
నెలవారీ కోయ్ విడుదల చేసే ఈ డేటా ప్రకారం భారతీ ఎయిర్టెల్ మొత్తం జీఎస్ఎమ్ సబ్‌స్కైబర్ బేస్‌లో 33 శాతం ఉండి, 257.51 మిలియన్ సబ్స్క్రైబర్లను కలిగిఉంది. ఓ వైపు డేటా టారిఫ్ వార్‌కు తెరలేపుతూ మార్కెట్లోకి ప్రవేశించిన రిలయన్స్ జియోతో, ఎయిర్‌టెల్‌కు కొంచెం సమస్య తలెత్తినా సబ్స్క్రైబర్లను బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ నెంబర్లలో రిలయన్స్ జియో సబ్‌స్కైబర్లను కోయ్ కలుపలేదు. ఎయిర్టెల్ అనంతరం వొడాఫోన్ 200 మిలియన్, ఐడియా సెల్యులార్ 177 మిలియన్, ఎయిర్‌సెల్ 89.7 మిలియన్, టెలినార్‌కు 53.2 మిలియన్, ప్రభుత్వ ఆధారిత కంపెనీ ఎమ్టీఎల్కు 3.6 మిలియన్ సబ్స్క్రైబర్లను ఈ ఆగస్టు చివరి నాటికి కలిగిఉన్నాయి.