డిసెంబర్లో కొత్త జీఎస్ఎం వినియోగదారులు 68 లక్షలు
న్యూఢిల్లీ: జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య గత నెలలో స్వల్పంగా పెరిగిందని, 68 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) శుక్రవారం తెలిపింది. వివరాలు...
గత ఏడాది నవంబర్లో 68.8 కోట్లుగా ఉన్న జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య గత ఏడాది డిసెంబర్లో 69.48 కోట్లకు పెరిగింది.
18.08 లక్షల మంది కొత్తగా లభించిన వినియోగదారులతో భారతీ ఎయిర్టెల్ మొత్తం వినియోగదారుల సంఖ్య 19.84 కోట్లకు, మార్కెట్ వాటా 28.55 శాతానికి పెరిగాయి.
గత ఏడాది డిసెంబర్లో వొడాఫోన్కు అత్యధికంగా కొత్త వినియోగదారులు లభించారు. 23.73 లక్షల మంది కొత్తగా లభించిన మొబైల్ వినియోగదారులతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 16.04 కోట్లకు పెరగ్గా, మార్కెట్ వాటా 23 శాతానికి వృద్ధి చెందింది.
2.71 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా సెల్యులర్ మొత్తం వినియోగదారుల సంఖ్య 12.86 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 18.52 శాతంగా ఉంది.