ఇన్.. ఔట్
♦ జీఎస్టీతో మారుతున్న వ్యాపారుల తలరాతలు
♦ పాత డీలర్లలో చిరు వ్యాపారులకు ఊరట
♦ వారి స్థానంలో కొత్తగా టెక్స్టైల్స్ వ్యాపారుల చేరిక
♦ రూ.20 లక్షల లోపు వార్షిక టర్నోవర్ కలిగిన డీలర్ల లైసెన్స్‌లు రద్దు
♦ జిల్లా రెవెన్యూ ప్రకారమే కొత్త సర్కిళ్ల ఏర్పాటు
♦ ఆహార ధాన్యాల మినహాయింపుతో 5 శాతం రెవెన్యూ లోటు.
♦ మొరాయిస్తున్న జీఎస్టీ పోర్టల్ సర్వర్లు
నల్లగొండ: ఏకీకృత పన్ను విధానం వ్యాపారుల తలరాతను పూర్తిగా మార్చేస్తోంది. వార్షిక టర్నోవర్ రూ.20 లక్షల్లోపు ఉన్న వ్యాపారులను జీఎస్టీ నుంచి మినహాయించారు. ఈ అవకాశం కొందరు చిరువ్యాపారులకు ఊరట కలిగించింది. గతంలో వార్షిక టర్నోవర్ రూ.7.50 లక్షలు కలిగిన వ్యాపారులు కూడా వ్యాట్ చెల్లించాల్సి వచ్చేది. కానీ జీఎస్టీ విధానంలో పన్ను పరిధి రూ.20 లక్షలు దాటిన వ్యాపారుల పైన ప్రయోగించారు.దీంతో వ్యాట్ పరిధిలోని కొందరు డీలర్లు ప్రస్తుతం జీఎస్టీ నుంచి మినహాయింపు పొందే అదృష్టం కలిసొచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు,
ట్రేడర్లు, పారిశ్రామిక సంస్థలు ఇలా వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 9,673 మంది డీలర్లు ఉన్నారు. వీరిలో జీఎస్టీలోకి మైగ్రేట్ అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న డీలర్లు 9,348 మంది ఉన్నారు. వారందరికి కూడా జీఎస్టీ ప్రొవిజనల్ గుర్తింపుకార్డులు జారీ అయ్యాయి. జీఎస్టీ కోసం దరఖాస్తు చేసుకున్న డీలర్లకు ముందుగా ప్రొవిజనల్ గుర్తింపు కార్డులు జారీ చేసి ఆ తర్వాత మెల్లగా జీఎస్టీ లైసెన్స్‌లు ఇస్తారు. ఈ విధంగా పూర్తిస్థాయిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జీఎస్టీ పొందిన డీలర్లు ఇప్పటి వరకు 7,689 మంది, దీని నుంచి మినహాయింపు పొందిన డీలర్లు 325 మంది ఉన్నారు. అయితే ఈ తరహా డీలర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
కొత్త డీలర్ల ప్రవేశం..
జీఎస్టీలో టెక్స్టైల్స్ రంగాన్ని చేర్చడంతో కొత్త డీలర్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఉమ్మడి జిల్లాలోని ఐదు సర్కిళ్ల పరిధిలో సుమారు 150 నుంచి 200 మంది వ్యాపారులు కొత్తగా జీఎస్టీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. సాంకేతిక సమస్యల కారణంగా కొత్త దరఖాస్తుల వివరాలు పూర్తిగా అందుబాటులోకి రావడం లేదని అధికారులు అంటున్నారు. చిరువ్యాపారుల స్థానంలో వస్త్రవ్యాపారులను చేర్చడం వ ల్ల డీలర్ల సంఖ్యలో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం వస్త్ర వ్యాపారులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చేంత వరకు కొత్త డీలర్ల చేరికలు నామమాత్రంగానే ఉంటాయని తెలుస్తోంది.
మొరాయిస్తున్న సర్వర్లు..
పాత డీలర్లు, కొత్త డీలర్ల దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తుండడంతో జీఎస్టీ సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీనికితోడు దరఖాస్తు విధానంలో డీలర్లు చేస్తున్న పొరపాట్లు కూడా కారణమవుతున్నాయి. జీఎస్టీ లైసెన్స్‌కు పాన్ కార్డు తప్పనిసరి కావడంతో డీలర్లు తప్పులో కాలేస్తున్నారు. పాన్ కార్డుల మిస్‌మ్యాచింగ్ వల్ల జీఎస్టీ లైసెన్స్‌ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. భాగస్వాములతో కూడిన సంస్థలు కూడా జీఎస్టీలోకి మారేటప్పుడు అనేక తప్పిదాలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. డీలర్ల సందేహాలు తీర్చేందుకు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌తో పాటు, సర్కిళ్ల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆదాయం పైనే కొత్త సర్కిళ్లు..
జిల్లాలో ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్ కార్యాలయాలు నల్లగొండ, మిర్యాలగూడ ,కోదాడ, సూర్యాపేట, భువనగిరిలో ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చినందున కార్యాలయాల సేవల పరిధి కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సహజంగానే సిబ్బంది పెంపు, కొత్త సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇదంతా జరగాలంటే ముందుగా జీఎస్టీ రూపంలో ఎంత రెవెన్యూ జిల్లా నుంచి వస్తుందో లెక్కకట్టాల్సి ఉంటుంది. జీఎస్టీ లెక్కల ప్రకారం వార్షిక టర్నోవర్ రూ.కోటిన్నర వరకు ఉన్నట్లయితే దాంట్లో రాష్ట్రానికి 90 శాతం, కేంద్రానికి పది శాతం పన్ను వెళ్తుంది.
అదే వార్షిక టర్నోవర్ రూ.కోటిన్నర దాటితే మాత్రం రాష్ట్రానికి 50 శాతం, కేంద్రానికి 50 శాతం పన్ను రూపంలో వెళ్లనుంది. ఈ లెక్కన ఎంత మంది డీలర్లు ఏ పన్ను పరిధిలోకి వస్తారనేది నిర్ధారణ కావాల్సి ఉంది. వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు జిల్లా నుంచి వచ్చే రెవెన్యూలో సింహభాగం బియ్యం, నూకలు, ధాన్యం పైన 5 శాతం పన్ను వసూలయ్యేది. ప్రస్తుతం జీఎస్టీలో ఆహారధాన్యాలను మినహాయించడం మూలానా 5 శాతం పన్ను రద్దైంది. దీంతో జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంలో 5 శాతం తగ్గిపోనుంది.
గతంలో సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలో ఉన్నటువంటి సేవా పన్నును జీఎస్టీలో కలిపారు. ఇలాంటి హెచ్చుతగ్గులన్నింటినీ బేరీజు వేసుకుని రెండు, మూడు మాసాల పాటు వేచిచూస్తే తప్పా జీఎస్టీ ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయలేమని అధికారులు అంటున్నారు. ఆ తర్వాతే కొత్త సర్కిళ్ల ప్రతిపాదన పరిశీలిస్తారని వారు తెలిపారు. అప్పటి వరకు ప్రతి సర్కిల్ పరిధిలో జీఎస్టీ అధికారులతో మొబైల్ టీంలు పర్యటించనున్నాయి. వస్తు రవాణా వాహనాలను మొబైల్ టీంలు తనిఖీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటారు.
మూడు జిల్లాల్లోని డీలర్ల వివరాలు....
సర్కిల్ మొత్తం డీలర్లు జీఎస్టీలోకి మారిన డీలర్లు
భువనగిరి 1,393 1,154
కోదాడ 1,752 1,480
ఎల్టీయూ నల్లగొండ 27 27
మిర్యాలగూడ 1,942 1,445
నల్లగొండ 3,010 2,378
సూర్యాపేట 1,549 1,205