ఎమ్మెల్యేలకు చీపురుకట్టల బహుమానం
చూడచక్కని ప్యాకింగ్‌లో ఆకర్షణీయమైన గిఫ్ట్ బాక్సులు.. ఒక్కో ఎమ్మెల్యేకి వరుసగా పంచారు. అందులో ఏముందోనని ఆత్రంగా తెరిచి చూసిన ఎమ్మెల్యేలకు ఒక్కసారిగా దిమ్మతిరిగింది! ఒక్కో బాక్సులో ఒక చీపురు కట్ట.. ఒక పెన్ను.. వాటితోపాటు ఓ సుదీర్ఘ లేఖ! ఇవి పంచిపెట్టింది ఎవరోకాదు.. తన చర్యలు, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్! ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా శనివారం ఆయన ఈ చీపుర్ల పంచుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.
'సమాజానికి పట్టిన జాఢ్యాన్ని వదిలించడానికి చీపురు పనికొస్తుందో, కలం పనికొస్తుందో మీరే డిసైడ్ చేసుకోండి.. దానికి అనుగుణంగా నేను ఇచ్చిన బహుమతుల్లో ఒకదానిని వాడండి' అంటూ లేఖలో పేర్కొన్నాడు ఆజాంఖాన్. స్వచ్ఛభారత్‌పై తరచూ సెటైర్లు వేసే ఆయన.. ప్రధాని మోదీ.. జనం చేతుల్లో చీపుర్లు పెట్టి ఆయధాల్లాంటి కలాల్ని లాక్కుంటున్నారని మండిపడ్డారు. అయితే ఆజంఖాన్ చీపుర్ల పంపకం సమాజ్ వాదీ, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.