నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి సక్రమంగా అమలు చేస్తామని, అతిక్రమిం చిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని కలెక్టర్ అహ్మద్‌బాబు హెచ్చరించారు. శనివారం కలెక్టర్ తన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏ ర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూ చించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంలను సిద్ధం చేశామన్నారు. ఈవీఎంలపై పలు దఫాలుగా శిక్షణ ఇచ్చామని, మలిదశ ఈవీఎంల ర్యాండమైజేషన్ ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తామని తెలిపారు.
సిద్ధం చేసిన ఈవీ ఎంలను రెండు రోజుల్లో ఆయా నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలకు పూర్తి బందోబస్తుతో క్లోజ్డ్ వ్యానులో తరలిస్తామని చెప్పారు. అభ్యర్థులకు ఫొటో గుర్తింపు కార్డులు అందజేస్తామని, ఏజెంట్లకు వాహనాల వినియోగం అనుమతి సింగిల్ విండో ద్వారా ఇస్తామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జారీ చేసిన అనుమతి పత్రాలను ఆయా వాహనాలకు ఒరిజినల్ పత్రాలు అతికించాలన్నారు. అభ్యర్థుల ప్రచారంలో భాగంగా ముద్రించబడిన కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రిపై ప్రింటర్, పబ్లిషర్ పేరు తప్పకుండా ముద్రించాలన్నారు. ఎన్నికల అధికారి జారీ చేసిన ధరలకు అనుగుణంగా ఎన్నికల ఖర్చుల పరిశీలన ఉంటుందన్నారు.
ఎక్కువ చెల్లింపులు అకౌంట్ పే ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే అర్హత కోల్పోతారని హెచ్చరించారు. ఓటర్ల జాబితా మరో రెండు రోజుల్లో సీడీతోపాటు హార్డ్ కాపీ అందజేస్తామని వివరించారు. ఎన్నికల పరిశీలకుడు పంకజ్ జోషి మాట్లాడుతూ.. ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లైతే ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కలెక్టరేట్లో అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఎస్పీ గజరావు భూపాల్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చట్టపర చర్యలు తీసుకుంటామని, రాత్రి 10 గంటల అనంతరం ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. సమావేశంలో జేసీ బి.లక్ష్మీకాంతం, అభ్యర్థులు నరేష్ జాదవ్, పవార్ కృష్ణ, నేతావత్‌రాందాస్, బంక సహదేవ్, మొసలి చిన్నయ్య, నాయకులు యూనీస్ అక్బానీ, సంతోష్, దుర్గం రాజేశ్వర్, రమణారెడ్డి పాల్గొన్నారు.