Nanda Birth Anniversary: సొంతిల్లు లేని ప్రధాని.. జీవన భృతి కూడా వద్దంటూ..
భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే మన దేశ రెండవ ప్రధాని(తాత్కాలిక) గుల్జారీలాల్ నందా గురించి చాలా తక్కువమందికే తెలుసు. ఆయన 1964, 1966లలో రెండుసార్లు భారతదేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించారు. నేడు (జూలై 4) గుల్జారీలాల్ నందా జన్మదినం. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం.గుల్జారీలాల్ నందా 1898, జులై 4న ప్రస్తుత పాకిస్తాన్లోని సియాల్కోట్లో జన్మించారు. నందా తన విద్యాభ్యాసాన్ని లాహోర్, ఆగ్రా, అలహాబాద్లలో పూర్తి చేశారు. 1997లో ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. గుల్జారీలాల్ నందా 1957, 1962లలో రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం నందా 1964 మే 27న తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నాడు అతని పదవీకాలం 13 రోజులు. దీని తరువాత తాష్కెంట్లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత నందా 1966, జనవరి 11న మరోమారు తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం చేశారు. గుల్జారీ లాల్ నందా 1962, 1963లో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిగా, 1963 నుంచి 1966 వరకు హోం వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు.దేశానికి రెండుసార్లు ప్రధానిగా, దీర్ఘకాలం కేంద్రమంత్రిగా పనిచేసిన గుల్జారీ లాల్ నందాకు చివరి రోజుల్లో సొంత ఇల్లు కూడా లేదు. అద్దె చెల్లించడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు. కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో గుల్జారీ లాల్ నందాను ఇంటి యజమాని వెళ్లగొట్టాడు. ఈ వార్త దావానంలా మారడంతో నాటి కేంద్ర ప్రభుత్వం కొందరు అధికారులను నందా దగ్గరకు పంపింది. వారు స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే రూ. 500 భృతిని తీసుకునేందుకు నందాను అతికష్టం మీద ఒప్పించారు. గుల్జారీలాల్ నందా మాజీ ప్రధాని అని ఆ ఇంటి యజమానికి తెలియడంతో అతను నందాకు క్షమాపణలు చెప్పాడు. గుల్జారీ లాల్ నందా తన 99 సంవత్సరాల వయసులో 1998, జనవరి 15న కన్నుమూశారు.