రెండు సార్లు ఆయాచిత ప్రధాని!!
ప్రధానమంత్రి పదవి రావడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా ఏమాత్రం ప్రయత్నించకుండా.. దానంతట అదే వచ్చి వరిస్తే? అలాంటి అదృష్టం ఒకటి కాదు, రెండుసార్లు వచ్చిన వ్యక్తి గుల్జారీ లాల్ నందా. ఇప్పటి పాకిస్థాన్లోని సియాల్కోట్ ప్రాంతంలో 1898లో పుట్టిన నందా.. 1952లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పుడే ఆయన ప్రణాళిక, నీటిపారుదల, విద్యుత్ శాఖల మంత్రిగా నియమితులయ్యారు. అనంతరం 1957 ఎన్నికల్లో మళ్లీ గెలిచి కార్మిక, ఉపాధికల్పన, ప్రణాళిక శాఖల మంత్రిగా చేశారు. 1962లో నందా మరోసారి గుజరాత్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పుడు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు.
స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరణించినప్పుడు 1964లో తొలిసారి నందాను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించారు. అప్పుడు ఆయన 13 రోజుల పాటు ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. మరోసారి 1966లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించినప్పుడు కూడా మళ్లీ నందానే ఆపద్ధర్మ ప్రధానిగా ఎంచుకున్నారు. రెండుసార్లూ ఆయన 13 రోజుల చొప్పున మాత్రమే ఈ పదవి నిర్వహించడం మరో విశేషం. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఆ పదవిని చేపట్టి, దేశానికి ఎలాంటి ముప్పు లేకుండా చూడగలిగిన సమర్థత నందా సొంతం. 1962లో చైనాతో యుద్ధం, 1965లో పాకిస్థాన్తో యుద్ధం వచ్చిన తర్వాత అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఆ పదవిని నిర్వహించి, తదుపరి ప్రధానమంత్రులకు జాగ్రత్తగా అప్పగించారు.