Gundu Rao
-
రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్
-
గుండూరావు... కుట్రకు బలయ్యాడా?
హత్యపై అంతుచిక్కని కారణాలు అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు గూడెంకొత్తవీధి: ఇటీవల మావోయిస్టుల చేతిలో హతమైన ముక్కలి సత్యనారాయణ (గుండూరావు) హత్యకు కారణాలేమిటన్నది అంతు చిక్కడంలేదు. కుంకుమపూడి వద్ద దళసభ్యుల పేరిట గుండూరావును ఆదివారం ఇద్దరు హత్యచేసిన సంగతి తెలిసిందే. అయితే హత్యకు గల కారణాలు ఇంతవరకూ తెలియలేదు. గుండూరావు తమ ఇన్ఫార్మర్ కాదని పోలీసులు చెబుతుండగా, మావోయిస్టులతో ఎలాంటి విభేదాలు లేవని, గత పదేళ్లలో ఒడిదుడుకులను అధిగమిస్తూ, అందరికీ సమాధానం చెప్పుకుంటూ వ్యాపారం చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. మధుమేహ వ్యాధితో ఇబ్బంది పడుతున్న గుండూరావు ఆరోగ్య పరిస్థితి బాగోలేక పోవడంతో ఏడాది కాలంగా అతని భార్య చంద్రకళ, పెద్ద కొడుకు వినయ్ వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్నారు. సంఘటన జరగడానికి వారం రోజుల ముందు నుంచే ఆ ప్రాంతంలో మావోయిస్టుల బృందం సంచరించినా ఏ రోజూ గుండూరావు గురించి అతని కుటుంబ సభ్యులను అడగలేదు. పోలీస్ ఇన్ఫార్మర్గా అనుమానించి ఉంటే భార్యాకొడుకులను హెచ్చరించేవారని అంటున్నారు. మావోయిస్టు నేతలకు తెలిసే ఈ హత్య జరిగిందా? లేక గుండూరావు అంటే గిట్టని వ్యాపారులు పథకం ప్రకారం మిలీషియా సభ్యులతో హత్య చేయించారా? అన్నది తెలియాల్సి ఉంది. మావోయిస్టులకు ఆయుధ సామగ్రి తరలిస్తూ ఇటీవల ఓ వ్యాపారి పోలీసులకు చిక్కాడు. ఆ వ్యాపారి దొరికిపోవడానికి గుండూరావే కారణమని కొందరు వ్యాపారులు ప్రచారం చేశారు. ఇదే విషయాన్ని మావోయిస్టులు నమ్మేలా చెప్పి హత్య చేయించారా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. మృతుని జేబులో మావోయిస్టుల పేరిట ఉన్న లేఖలో స్పష్టత లేక పోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కొందరు వ్యాపారులు పన్నిన కుట్రలో భాగంగానే ఈ హత్య జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
గుండూరావు చేసిన తప్పేంటి?
మావోయిస్టులకు కుటుంబ సభ్యుల సూటి ప్రశ్న గూడెంకొత్తవీధి: ముక్కలి గుండూరావును మావోయిస్టులు ఎందుకు హతమార్చారో తమకు స్పష్టం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ గిరిజనుల శ్రేయస్సు కోసమే ఉద్యమాలు చేస్తున్నామని చెప్పుకుంటున్న మావోయిస్టులు అన్యాయంగా గిరిజనులను చంపడం ఎంతవరకు న్యాయమని మృతుడి భార్య చంద్రకళ, సోదరి బేబి ప్రశ్నించారు. జీకేవీధి గ్రామానికి చెందిన సత్యనారాయణ (గుండూరావు)ను ఆదివారం రాత్రి కుంకంపూడి వద్ద మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు మారుమూల గ్రామాల్లో తిరుగుతూ వ్యాపార లావాదేవీలు కొనసాగించిన గుండూరావుకు మావోయిస్టుల నుంచి ఎటువంటి ముప్పు కలగలేదని, అనుకోకుండా పోలీస్ ఇన్ఫార్మర్ ముద్రవేసి చంపడం అన్యాయమన్నారు. ఆయన నిజంగా ఇన్ఫార్మర్ అయితే ఆయన కారణంగా మావోయిస్టులు ఎలా నష్టపోయారో వెల్లడించాలని కోరారు. చెప్పుడు మాటలు విని చంపడం, తరువాత ఇన్ఫార్మర్గా చిత్రీకరించడం తగదన్నారు. మావోయిస్టులు ఎన్ని సార్లు హెచ్చరించినా భయపడకుండా సమాధానం చెప్పుకుని ఇక్కడే జీవించారే తప్ప ఎక్కడికీ వెళ్లిపోలేదని, ఏ తప్పు చేయలేదు కాబట్టే భయపడకుండా ఇక్కడ ఉన్నారని స్పష్టంచేశారు. ఏజెన్సీలో వ్యాపారం చేసేవారంతా ఏదో ఒక సందర్భంలో పోలీసులతో మాట్లాడుతారని, అంత మాత్రాన వారందరిపైనా ఇన్ఫార్మర్ల ముద్రవేసి చంపేస్తారా అని వారు ప్రశ్నించారు. ఏ పాపం చేయని గుండూరావును అన్యాయంగా చంపారని ఆవేదన వ్యక్తంచేశారు.