హత్యపై అంతుచిక్కని కారణాలు
అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు
గూడెంకొత్తవీధి: ఇటీవల మావోయిస్టుల చేతిలో హతమైన ముక్కలి సత్యనారాయణ (గుండూరావు) హత్యకు కారణాలేమిటన్నది అంతు చిక్కడంలేదు. కుంకుమపూడి వద్ద దళసభ్యుల పేరిట గుండూరావును ఆదివారం ఇద్దరు హత్యచేసిన సంగతి తెలిసిందే. అయితే హత్యకు గల కారణాలు ఇంతవరకూ తెలియలేదు. గుండూరావు తమ ఇన్‌ఫార్మర్ కాదని పోలీసులు చెబుతుండగా, మావోయిస్టులతో ఎలాంటి విభేదాలు లేవని, గత పదేళ్లలో ఒడిదుడుకులను అధిగమిస్తూ, అందరికీ సమాధానం చెప్పుకుంటూ వ్యాపారం చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. మధుమేహ వ్యాధితో ఇబ్బంది పడుతున్న గుండూరావు ఆరోగ్య పరిస్థితి బాగోలేక పోవడంతో ఏడాది కాలంగా అతని భార్య చంద్రకళ, పెద్ద కొడుకు వినయ్ వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్నారు. సంఘటన జరగడానికి వారం రోజుల ముందు నుంచే ఆ ప్రాంతంలో మావోయిస్టుల బృందం సంచరించినా ఏ రోజూ గుండూరావు గురించి అతని కుటుంబ సభ్యులను అడగలేదు. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా అనుమానించి ఉంటే భార్యాకొడుకులను హెచ్చరించేవారని అంటున్నారు.
మావోయిస్టు నేతలకు తెలిసే ఈ హత్య జరిగిందా? లేక గుండూరావు అంటే గిట్టని వ్యాపారులు పథకం ప్రకారం మిలీషియా సభ్యులతో హత్య చేయించారా? అన్నది తెలియాల్సి ఉంది. మావోయిస్టులకు ఆయుధ సామగ్రి తరలిస్తూ ఇటీవల ఓ వ్యాపారి పోలీసులకు చిక్కాడు. ఆ వ్యాపారి దొరికిపోవడానికి గుండూరావే కారణమని కొందరు వ్యాపారులు ప్రచారం చేశారు. ఇదే విషయాన్ని మావోయిస్టులు నమ్మేలా చెప్పి హత్య చేయించారా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. మృతుని జేబులో మావోయిస్టుల పేరిట ఉన్న లేఖలో స్పష్టత లేక పోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కొందరు వ్యాపారులు పన్నిన కుట్రలో భాగంగానే ఈ హత్య జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గుండూరావు... కుట్రకు బలయ్యాడా?
Published Wed, Mar 9 2016 11:37 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement