gunturu sheshendra sharma
-
కాలానికి ముందు పయనించిన కవి
‘‘నేను పుస్తకాలతో మనిషి పశుత్వా నికి ఆనకట్టలు కడతాను; వాడు పశుత్వంతో మనిషికే ఆనకట్టలు కడ తాడు’’ (నీరై పారిపోయింది) అన్న గుంటూరు శేషేంద్ర శర్మ ఈ దేశ ప్రజలు గర్వంగా చెప్పుకోదగిన కవి. ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి, అది కన్నీరు కార్చాలి, క్రోధాగ్నులు పుక్కిలించాలి అని చెప్పిన శేషేంద్ర 1927 అక్టోబర్ 20న నెల్లూరులోని తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు. బీఏ చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమిషనర్గా పనిచేశారు. జర్నలిజం పట్ల మక్కువతో తాపీ ధర్మారావు వద్ద ‘జనవాణి’లో ఉద్యోగం చేశారు. కానీ సాహిత్యం ఆయనను వెంటాడటంతో అన్నిటినీ వదిలి కవిత్వాన్ని ప్రేమించడం ప్రారంభించారు. ఆయన కవిత్వంలో ప్రాచీన, ఆధునిక ధోరణులు అందంగా ఇమిడి పోతాయి. ప్రగతి శీలతనూ, ప్రాచీన భారతీయ అలంకార శాస్త్రాల్నీ, మార్క్స్ ఫిలాసఫీనీ ఏక కాలంలో జోడించి ఈ దేశానికి అవసర మైన విలువైన సాహిత్య సిద్ధాంతాన్ని ఆయన ‘కవిసేన మేనిఫెస్టో’ పేరిట మనకు అందించారు. ‘షోడశి– రామాయణ రహస్యాలు’ పేరుతో వాల్మీకి సుందర కాండకు అద్భుతమైన తాంత్రిక భాష్యాన్ని అందించిన శేషేంద్ర మేఘదూతానికీ, వాల్మీకి రామాయణానికీ మధ్య ఉన్న సంబంధంపై జర్మనీ ఇండొలాజికల్ యూనివర్సిటీలో అపురూపమైన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ‘ఇద్దరు రుషులు– ఒక కవి’ శీర్షికతో వాల్మీకి, వ్యాస, కాళిదాసుల కవిత్వంపై విశిష్టమైన పరిశోధనా వ్యాసాన్ని రాశారు. ‘స్వర్ణ హంస’ పేరుతో నైషధంపై లోతైన విమర్శ చేశారు. ‘నా దేశం– నా ప్రజలు’, ‘మండే సూర్యుడు’, ‘గొరిల్లా’, ‘ఆధునిక మహాభారతం’, ‘నీరై పారిపోయింది’, ‘సముద్రం నా పేరు’, ‘పక్షులు’, ‘శేష జ్యోత్స్న’ పేరిట అద్భుతమైన కావ్యాల్ని ఆయన రచించారు. ‘కాలరేఖ’ పేరిట సాహితీ వ్యాసాల్నీ వెలువరించారు. దానికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయిన రెండో భారతీయుడు శేషేంద్ర. తెలుగు విశ్వవిద్యాలయం డి.లిట్ ఇవ్వగా... పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘రాసేందు’ బిరుదును ప్రదానం చేసింది. ‘కామోత్సవ్’ పేరిట ఆయన రాసిన సీరియల్ నవల తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించింది. ‘ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను’ అని చెప్పిన శేషేంద్ర కవిత్వాన్ని ఆధునిక, సంప్రదాయ కవులు ఇరువురూ ఇష్టపడ్డారు. చాలాచోట్ల శేషేంద్ర కవిత్వంలో నన్నయ్య తచ్చాడుతారనీ, పెద్దన, శ్రీనాథుడిని ఆయన ఉపాసించినట్లున్నారనీ, విశ్వనాథ, జాషువా, రాయప్రోలు, కృష్ణశాస్త్రి వంటివారి పలుకుబడులు అక్కడక్కడా కనబడుతూ ఉంటాయనీ పుట్టపర్తి ఆయన ‘రుతుఘోష’కు రాసిన ముందుమాటలో అన్నారు. ‘‘నీది మంచి పద్యమా, లేక ఫ్రెంచి మద్యమా, కవిరేవ విజనాతి, కవిదేవ సుధాగీతి, శ్రీనాథుడి క్రీడల్లో, అల్లసాని వాడల్లో కూడా దొరకని పదచిత్రం’’ అని శ్రీశ్రీ ప్రశంసించారు. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చిందీ’ అని ‘ముత్యాల ముగ్గు’ కోసం ఆయన ఒకే ఒకపాట రాసినా అది సినీ సాహితీ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయింది. సంస్కృత భాషా సాహిత్యంతో పాటు తెలుగు సాహిత్యంలో లోతైన పరిజ్ఞానం ఉన్న శేషేంద్ర ఫ్రెంచి కవిత్వం, గ్రీకు విషాదాంత నాటకాలు, మార్క్సిస్ట్ సాహిత్యం క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కాళిదాసు, భవభూతి, టి.ఎస్. ఇలియట్, వేమన, వాల్మీకి, బొదిలెర్, రేంబో, శ్రీశ్రీ, ప్లేటోల సమన్వయం శేషేంద్ర! ‘‘కవికి సామాజిక స్పృహ కావాలి. కానీ వర్తమాన ఆంధ్రకవితా రంగంలో ఈ సామాజిక స్పృహ ఒక నీచస్థాయి నినాద రూపం ధరించి భయంకర సుడిగుండంలా ఏర్పడింది. ఈ నినాదం నుంచి యువకుల్ని రక్షించుకోవలసిన సాహిత్య అవసరం బాధ్యతాయుతమైన సామాజిక స్పృహ ఉన్నవాళ్లం దరి మీదా ఉంది’’ అన్న మాటలు ఆయన కాలానికి అతీతంగా నిలుస్తాయి. ‘‘కళ్ళు తుడుస్తాయి/ కమలాలు వికసిస్తాయి/ మెదిలితే చాలు నీ నామాక్షరాలు పెదవులమీద భ్రమరాల్లా’’– అంటూ గజల్స్ కూడా రాసిన శేషేంద్ర కవిత్వంలో ఉర్దూ సాహిత్య పరిమళం గుబాళిస్తూ ఉంటుంది. ‘ఎప్పుడు ఆకు రాలి పోతుందో గాలికే తెలియదు’ అంటూ 30 మే 2007న శేషేంద్ర రాలిపోయారు. ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం లభించకపోవడం ఒక బాధగా మిగిలిపోయింది. వ్యాసకర్త రచయిత: ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, రాజ్యసభ మాజీ ఎంపీ (మే 30న గుంటూరు శేషేంద్ర శర్మ వర్ధంతి) -
రామాయణంలో శేషేంద్రకు దొరికిన ఆణిముత్యాలు
వాల్మీకి పదబంధాలను వ్యాసుడు యథాతథంగా వాడుకున్నాడు. రామాయణానికి భారతం ప్రతి బింబం. ఈ మాట నమ్మడం సాధ్యమా? నేటి భాషలో అయితే వ్యాసుడు వాల్మీకి కాపీరైట్ ఉల్లంఘించాడనాలి. ఈ మాట నేను ఇప్పుడు అనడం లేదు. సాక్షాత్తూ గుంటూరు శేషేంద్ర శర్మ విశేష రచన ‘షోడశి’ (రామాయణ రహస్యములు)లో 1967లో అంటే 54 ఏళ్ల కిందటే ఈ రహస్యాన్ని వెల్లడిం చారు. ఆ విషయాన్ని విశ్వనాథ బయటపెట్టారు. నీలంరాజు వెంకటశేషయ్య సంపాదకత్వంలో ఆంధ్రప్రభ సాహితీ అనుబంధంలో 1963–67 మధ్య ధారావాహికగా షోడశి వ్యాసాలు ప్రచురితమైనాయి. విశ్వనాథ ‘షోడశి’కి రాసిన ముందుమాటలో చెప్పిన మాటలు: ‘‘ఆశ్చర్యములలో నాశ్చర్యమేమనగా భారతము రామాయణమునకు ప్రతిబింబమని గుంటూరు శేషేంద్ర శర్మ గారు చేసిన ప్రతిపాదన. సంపూర్ణముగా ప్రతిబింబము కాకపోయినను శ్రీ శర్మగారు చూపించిన స్థలములలోని ప్రతిబింబత్వము నాకాహా పుట్టించినవి’’. ‘‘శ్లోకములు శ్లోకములు చరణములు చరణములు వాని యంతట వానినే భగవంతుడైన వ్యాసుడు వాడుకొనెను. వాల్మీకిని యథేచ్ఛగా వాడుకొన్న వారిలో మొదటివాడు వ్యాసుడు’’. శేషేంద్రను లోతైన మనిషి అంటూ కవిసమ్రాట్ : ‘‘శ్రీ శర్మగారికి నాకు నేడెనిమిదేండ్ల నుండి చెలిమి గలదు. వారింత లోతైన మనిషియని నేననుకొనలేదు. అప్పుడ ప్పుడు నైషధము నుండి కొన్ని శ్లోకములు దేవీ పరముగా వారన్వయించినప్పుడు నేను వారికవి యాదృచ్ఛికముగా తోచిన విషయములనుకొన్నాను గాని శ్రీవిద్యావిషయమునింత లోతుగా తెలిసిన వారనుకొనలేదు. వారీ గ్రంథమును వ్రాసినందుకు తెలుగువారే కాదు. భారతీయులందరును కృతజ్ఞులుగా నుండవలసిన విషయము’’. షోడశి వ్యాసాలలో శ్రీసుందరకాండకు ఆ పేరు ఎందుకు వచ్చిందనే అధ్యాయంలో వెల్ల డించిన కారణాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రవచన కర్తలు సాధారణంగా ప్రస్తావించని అంశాలు సాహిత్యపరంగా పరిశోధించి మన ముందుంచారు శేషేంద్ర. సుందరకాండ సుందర నామం ధరించడానికి చాలా కారణాలున్నాయి. అవి: హనుమంతుడు సుందరుడగుట వలన, సుందర హనుమన్మంత్రమని యొకటి యుండుట, హనుమంతుడు నివసించిన స్థానములలో ఒకదానికి సుందరనగరమనే పేరు ఉండుట అని. సుందరాయ నమః అని శ్రీరామాష్టోత్తర నామములలో ఉన్నది. కాని హనుమ గురించి కాదు. బ్రహ్మాండ పురాణములో సుందరకాండకు ‘‘చంద్రబింబ సమాకారం వాంఛి తార్థ ప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేత్ సుందరే కాండే ఉత్తమే’’ అన్నారు. షోడశ కళా ప్రపూర్ణ అయిన శక్తియే చంద్రబింబం అంటే. ఈ కాండలో సీతారాములకు ఏ భేదమూ లేకపోవడం వల్ల రాముని పరాశక్తిగా భావించాలని పారాయణ విధాన వివరణ తాత్పర్యం. రాముడు సుందరుడు, సుందరి కలవాడు. సుందరకాండ సౌందర్యకాండ, బ్రహ్మాండ పురాణము సౌందర్యకాండ అనే మాట వాడినారు. ఈ సౌందర్యము శంకరులు సౌందర్యలహరి అని చెప్పినదే. కనుక సుందర హనుమంతుడనగా దేవీ భక్తుడైన హనుమ అని అర్థమే గానీ హనుమ సుందరముగా ఉన్నాడని గాదు. హనుమ నిరంతర దేవీ ధ్యానమే, జపమే, యోగమే, సుంద రకాండగా దర్శనమిచ్చుచున్నది. ‘తదున్నసం పాండురదంత మవ్రణం శుచిస్మితం పద్మపలాశ లోచనం ద్రకే‡్ష్యతదార్యావదనం కదాన్వహం, ప్రసన్నతారాధిప తుల్యదర్శనం’ అని ఓ తల్లీ నిన్ను నేనెప్పుడు చూతునో గదా అని హనుమ పరితపిస్తూ చెప్పిన శ్లోకం ఇది. ‘తెలుగుసీమలో సుందరయ్య, సుందరరామయ్య అని బాలా త్రిపురసుందరీ సంప్రదాయ సిద్ధ నామధేయములు ప్రజలు పెట్టుకొను వ్యవహారమున్నది. ఇతర సీమలలో కూడా సుందరేశన్, సుందర్ సింగ్ సుందర్ బాయ్ అట్టి చోట్ల త్రిపురసుందరీపరమైన అర్థమే గానీ హనుమత్పరమైన అర్థము లేద’ని శేషేంద్ర వివరించారు. హనుమంతుడు అనే పేరు వజ్రఘాతం వల్ల, మారుతి అనే పేరు తండ్రి వాయుదేవుని మారుతమనే పేరు వల్ల, ఆంజనేయుడు అనే పేరు తల్లి పేరుతో వచ్చినాయి. కానీ తల్లి ఆంజనేయుడికి పెట్టుకున్న అసలు పేరేమిటి? సుందరుడు అని శేషేంద్ర, విశ్వనాథ వెల్లడించారు. ఇది వాల్మీకి చెప్పలేదు. ఆ మహర్షి పరమ గూఢమైన రచన చేసినాడు. సుందరుని కథా సమగ్రమయిన సుందరకాండకు ఆ పేరు వచ్చిందని వివరించారు. ఆ విధంగానే మరికొన్ని అసలు పేర్లను పేర్కొన్నారు. ద్రౌపది అసలు పేరు కృష్ణ అనీ శూర్పణఖ అసలు పేరు బాల అని ప్రస్తావించారు. కవి సమ్రాట్ విశ్వనాథ ‘‘రామాయణమునందు తక్కిన కాండలకు తత్తత్కాండాతర్గత కథా సూచకములైన నామములుండగా దీనికి సుందరకాండమన్న పేరు విడిగానేల పెట్టవలసి వచ్చినదన్న ప్రశ్ననిచ్ఛలు వినిపించునదే. ఈ సందియము పలుమందికి కలదు’’ అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. విశ్వనాథ ప్రశంస ఇంకా సాగింది. ‘‘శ్రీశర్మగారు త్రిజటా స్వప్నమును గాయత్రీ మంత్రములోని పాదముల సంఖ్యయు నక్షరముల సంఖ్యయు తీసికొని అది గాయత్రీ మంత్రమునకు నొక విధమైన వ్యాఖ్యయని నిరూపించుట మిక్కిలి యూహస్ఫోరకముగా నున్నది: వారి శ్రధ్ధను నిరూపించుచున్నది. ఇది పారాయణము చేయనెంచెడి వారికి శ్రీశర్మగారు చేసిన యుపకారమింతయని చెప్పరాదు.’’ ....‘అన్నిటికంటే ప్రధానమైన యుపపత్తి సుందరకాండ మంతయు కుండలినీ యోగమని నిరూపించుటయే.. ఈ నిరూపణ మాత్రమాశ్చర్యజనకముగా ఉన్నది. శ్రీ శర్మగారు దీని నూరకయే నిరూపించలేదు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ యనలేదు. వాల్మీకి వేదముననుసరించి శ్రీరామాయణము వ్రాసెననుట న్యాయమే అనిపించును. ఇది యొక పెద్ద గొడవ. ఇదినిరూపించుటకు నాకు శ్రీశర్మగారికున్నంత యోపికలో సగమైన నుండవలయును. నాకు లేనిదే అది’’ అని విశ్వనాథ పేర్కొన్నారు. షోడశి హిందీ ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించడం కూడా విశేషమే. సుందరకాండలో కుండలినీ యోగాన్ని దర్శించిన శేషేంద్ర శర్మది లోతైన పరిశోధన. త్రిజట స్వప్న వృత్తాంతంలో గాయత్రీ మంత్ర వృత్తిని శేషేంద్ర శర్మచూచిన తీరు, వేద రహస్యాలను లోతుగా చదివితేనే అర్థమయ్యేట్టు సూచనప్రాయంగా వాల్మీకి పొందుపరిచిన విధానాన్ని పరిశీలిస్తే రామాయణంలో షోడశి కొత్త కోణాలను ఆవిష్కరించిందని అర్థమవుతుంది. భారతీయ విమర్శనా సాహిత్యాన్ని ప్రపంచ వాఙ్మయంలో నిలువెత్తు నిలబెట్టిన అత్యుత్తమ గ్రంథం ఇది. వాల్మీకి ఏ విధంగా రామాయణాన్ని సృష్టించారనే విశ్లేషణ గొప్పది. కథా సందర్భం, పాత్రల మనోగతం, ఆనాటి దేశకాల పరిస్థితులు, విశేషమైన శాస్త్ర పాండిత్యం, శబ్దాధికారం, వీటికి తోడు లౌకిక వ్యవహారాలు ఇన్నీ తెలిస్తే కానీ వాల్మీకి పదప్రయోగాలను అవగతం చేసుకోలేమని శేషేంద్ర శర్మగారు అన్నారంటే ఆయన రామాయణ మహార్ణవంలో లోతులను ఎంతగా పరిశోధించారో తెలుస్తుంది. -మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ (నేడు గుంటూరు శేషేంద్ర శర్మ జయంతి) -
నది దోచుకు పోతున్న నావను...
ఆలుమగల మధ్య ఎడబాటులోని అనంతమైన దుఃఖాన్నీ, అంతటి దుఃఖంలోనూ కనబడే సన్నటి ఆశారేఖనీ, మళ్లీ ఏమీ వెలుగు కనబడటం లేదని తెలిసినప్పుడు కలిగే దాంపత్యమంతటి లోతైన వేదననీ... ఏకకాలంలో వ్యక్తం చేసిందంటే, అది గుంటూరు శేషేంద్ర శర్మ కవిత అయివుండాలి, ముత్యాలముగ్గు కోసం ఆయన రాసిన పాట అయివుండాలి. ‘నిదురించే తోటలోకీ పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది’ పాట మొత్తం ఒక వేదనామయ కవిత! ఆకురాలిన అడవి మీద వసంతం దయచూపినట్టూ, విఫలమైన కోర్కెలు గుమ్మంలో వేలాడినట్టూ, నదినే (సర్వస్వాన్ని) నావ దోచుకుపోతున్నట్టూ దానికి రేవు బావురుమన్నట్టూ చిత్రించడం శేషేంద్రకే చెల్లింది. ‘శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది ‘విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి ‘కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా నది దోచుకు పోతున్న నావను ఆపండి రేవు బావురుమంటోందని నావకు చెప్పండి’ ఈ ముత్యాలముగ్గు చిత్రానికి సంగీతం సమకూర్చింది కె.వి.మహదేవన్. పాడింది సుశీల. 1975లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు బాపు. సంగీత, శ్రీధర్ నటీనటులు. గుంటూరు శేషేంద్ర శర్మ -
ఎందుకా కవిత్వం ఏడవనా?
పుస్తకం లోంచి... మహాకవులు ఎవరయినా తీసుకోండి ఎవరయితే ప్రజల్ని ప్రభావితుల్ని చేశారో నాగరికతల్ని సంస్కృతుల్ని సృష్టించారో అలాంటి కవులు అందరూ వాళ్ళ కవిత్వాన్ని వర్తమాన భాషలోనే రాశారు. వాళ్ళు కవిత్వం కవిత్వం కోసం రాయలేదు, స్వకీర్తి కోసం రాయలేదు, మనుషుల్ని మార్చాలని రాశారు. అది ఒక మహత్తరమైన ద్రష్టృత్వం.కనకనే వాళ్ళ మాటకు మనిషిని మార్చే శక్తి వచ్చింది. ఆ శక్తి ఉన్న మాటే కవిత్వం అనిపించుకుంది అనిపించుకుంటుంది. లేకపోతే ఎందుకా కవిత్వం ఏడవనా? తుపాకి చూపించి ఈ పని చెయ్ అన్న ధర్మశాస్త్రం మనిషిచేత బలాత్కారంగా పని చేయిస్తుంది. కానీ శక్తివంతమైన మాట మనిషిలో ఉన్న నిజపదార్థాన్నే మార్చి వేస్తుంది, తద్వారా ఒక ఐచ్ఛిక ఆంతరిక పరిణామాన్ని తెస్తుంది. తుపాకిశక్తికీ మాటశక్తికీ ఉన్న తేడాయిది. మనుపు ఆపస్తంబుడు చూపించిన తుపాకులు ఈనాడు లేవు మనిషి వాటి బెదురుతో నడవడానికి, కానీ వాల్మీకి మాట ఈనాటికీ ఉంది. మనిషిని నడుపుతూనే ఉంది. అరే పిచ్చోడా! తుపాకి ఎవడైనా పట్టుకుంటాడు; కలం ఎవడైనా పట్టుకునేది కాదు. ఈ రోజు భారతదేశంలో మనుషులు ఒక సామాజిక జీవనం చేస్తున్నారంటే అరణ్యక జంతుజీవనం చెయ్యడం లేదంటే ఈ దేశానికి అది రామాయణ మహాభారతాలు పెట్టిన భిక్షే. అన్య ఆధునిక విలువల చేత రామాయణం ప్రతిపాదించిన కొన్ని విలువల తీరాలు నేడు కోసుకుపోతుంటే పోవచ్చుగాక కాల ప్రవాహ వేగంచేత, దాన్ని ప్రతిఘటించవలసిన అవసరం లేదు. ఏ యుగపు ప్రజలు ఆ యుగం కోసం వాళ్ళ విలువల్నీ వాళ్ళ ప్రపంచాన్నీ వాళ్ళు నూతనంగా సృష్టించుకుంటారు. అది కాలధర్మం. ‘‘ప్రాప్తకాల ముపాస్యతాం’’ అన్నాడు వాల్మీకే- కాని ప్రస్తుత విషయమేమిటంటే ఆ మహాకవులు కొన్ని విలువల్ని ప్రతిపాదించి ఆ విశాల వలలో ప్రజానీకాన్ని పట్టి ఉంచారు గనక గానీ, లేకపోతే ఈ ప్రజలు ఏ క్షణంలోనో మళ్ళీ జాంతవ స్థితికి జారిపడేవారే. - గుంటూరు శేషేంద్ర శర్మ (‘కవిసేన మేనిఫెస్టో’ నుంచి...)