వారిలో నలుగురికి మరణశిక్ష అమలు..
జకార్త: అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో మరణశిక్ష విధించబడిన 14 మందిలో నలుగురికి ఇండొనేషియా ప్రభుత్వం శుక్రవారం మరణశిక్ష అమలుచేసింది. ఇందులో ముగ్గురు ఆఫ్రికన్లతో పాటు ఓ ఇండోనేషియా పౌరుడు ఉన్నారని అధికారులు వెల్లడించారు. దీంతో భారత్‌కు చెందిన గురుదీప్ సింగ్ కుటుంబంలో ఆందోళన మొదలైంది.
గురుదీప్ సింగ్ కూడా డ్రగ్స్ అక్రమరవాణా కేసులో ఇండొనేషియాలోని కోర్టుచే మరణశిక్ష విధించబడిన 14 మంది నిందితుల్లో ఒకడు. 2004లో న్యూజిలాండ్‌లో వర్క్ వీసా కోసం ప్రయత్నించిన గురుదీప్ సింగ్.. ఓ ఏజెంట్ చేతిలో మోసపోయి అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో చిక్కుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ విషయంలో సహకరిస్తామని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురుదీప్ కుటుంబానికి గురువారం హామీ ఇచ్చారు. అయితే 14 మంది నిందితుల్లో నలుగురికి మరణశిక్ష అమలు చేయడంతో పాటు.. తరువాతి దశలో మరో 10 మందికి కూడా మరణశిక్ష అమలు చేయనున్నట్లు ఇండొనేషియా అధికారుల చెప్పడంతో గురుదీప్ కుటుంబ సభ్యుల్లో కలవరం మొదలైంది. ఆఫ్రికన్ పౌరులకు మరణశిక్షలు అమలుచేయడం పట్ల ఇండొనేషియా అధికారులు తొందరపాటుగా వ్యవహరించారన్న విమర్శలు వెలువడుతున్నాయి. అయితే.. డ్రగ్స్ అక్రమరవాణాకు పాల్పడిన వారిపట్ల ఇండొనేషియా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని డిప్యూటీ అటార్నీ జనరల్ నూర్ రిచ్మండ్ తెలిపారు.