ఎల్వోసీలో ఐదుగురు జవాన్ల గల్లంతు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. ఎల్వోసీ వెంట హిమపాతంలో చిక్కుకుని ఐదుగురు జవాన్లు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు నౌగామ్ సెక్టార్లో ఏటవాలు తలం నుంచి మంచులోకి జారిపడగా, ముగ్గురు గురేజ్లోని ఫార్వర్డ్ సెక్టార్ నుంచి అదృశ్యమయ్యారు. ఆ సమయంలో జవాన్లు విధుల్లోనే ఉన్నట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా చెప్పారు.
వీరికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, అయితే ప్రతికూల వాతావరణం తమ ప్రయత్నాలకు అడ్డుగా నిలుస్తోందన్నారు. ఆదివారం నుంచి ఆ ప్రాంత్లాలో కురుస్తున్న మంచు 5 అడుగుల ఎత్తు వరకు పేరుకుపోయింది. ఇదిలా ఉండగా మరో హిమపాతంలో చిక్కుకుని ఆర్మీ పోర్టర్ ఒకరు మృతిచెందాడు.
విమానాలు రద్దు: భారీగా మంచు కురుస్తుండటంతో మంగళవారం శ్రీనగర్– జమ్మూ జాతీయ రహదారి, ముగల్ రోడ్డు సహా పలు రహదారులను మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో కశ్మీర్ లోయకు దేశానికి మధ్య సంబంధాలు తెగిపోయినట్లయింది. గురువారం వరకు వాతావరణం ఇలానే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, గుల్మర్గ్ ప్రాంతంలో అత్యధికంగా మైనస్ 6.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.