డార్జిలింగ్‌లో మళ్లీ అల్లర్లు
సాక్షి, కోల్‌కతా : డార్జిలింగ్ మరోసారి అల్లర్లతో అట్టుడికిపోయింది. గురువారం ఉదయం చెలరేగిన ఘర్షణలో ఓ పోలీస్ అధికారితోపాటు ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి.
గుర్ఖాల్యాండ్ జనముక్తి మోర్చా(జీజేఎం) నేత బిమల్ గురంగ్.. లెప్చా బస్తీలో తలదాచుకున్నాడన్న సమచారం మేరకు ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న బీజేఎం కార్యకర్తలు పోలీసులపై కాల్పులు జరిపారు. ఘటనలో ఓ అధికారి గాయపడగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై బెంగాల్ పోలీసులు బిమల్ గురంగ్ పై వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలో ఉండగా.. అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే అక్టోబర్ 30న నిర్వహించబోయే భారీ ర్యాలీకి ఎట్టి పరిస్థితుల్లో తాను హాజరై తీరతానని బిమల్ ఓ ఆడియో సందేశంలో కార్యకర్తలకు తెలిపారు.
ఇదిలా ఉంటే గురంగ్ మద్ధతుదారులు భారీ ఎత్తున్న మారణాయుధాలను.. పేలుడు పదార్థాలను దాచారని.. అక్టోబర్ 30న బహిరంగ సభ ద్వారా పెద్ద ఎత్తున్న హింసకు వ్యూహరచన చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా తాజాగా నిర్వహించిన దాడుల్లో 6 ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వారు చూపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకై జీజేఎం పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.