ఆప్ నేతపై దుండగుల కాల్పులు
గురుదాస్పూర్: ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన నుంచి అదృష్టవశాత్తు అతడు బయటపడ్డాడు. పోలీసులు నేరగాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు. వివరాల్లోకి వెళితే, ఆమ్ ఆద్మీ పార్టీలో గురుపర్తాప్ సింగ్ కుషల్పూర్ అనే వ్యక్తి కీలక నేతగా పని చేస్తున్నారు. ఆయన ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ఆదివారం రాత్రి గురుద్వార అనే గ్రామం నుంచి తిరిగొచ్చి ఇంట్లోకి వెళ్లే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఆయన వేగంగా ఇంట్లోకి వెళ్లి తలుపులేసుకొని ప్రాణాలు దక్కించుకున్నారు. దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన అనంతరం అక్కడి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.