మహోజ్వల భారతి: దేవుడు, దాసుడు
బందా సింగ్ బహదూర్ (1670–1716) సిక్కు సైన్యాధ్యక్షుడు. మహా యోధుడు. లక్ష్మణ్ దేవ్, బందా బహదూర్, లక్ష్మణ్ దాస్, మాధవ్ దాస్ అనే పేర్లతోనూ ఆయన ప్రఖ్యాతి చెందారు. జమ్మూకశ్మీర్లోని రాజౌరి ఆయన జన్మస్థలం. పదిహేనవ యేట ఇల్లు విడిచి సన్యసించి, ‘మాధవ్ దాస్’ అన్న దీక్షానామం స్వీకరించారు.
గోదావరి తీరంలోని నాందేడ్ ప్రాంతంలో ఒక మఠాన్ని స్థాపించారు. 1708 సెప్టెంబరులో ఆయన ఆశ్రమాన్ని గురు గోవింద సింగ్ సందర్శించారు. అనంతరం ఆయనకు మాధవ్ దాస్ శిష్యుడయ్యారు. ఆ సందర్భంగా బందా సింగ్ బహదూర్ అన్న పేరును గురు గోబింద్ సింగ్ పెట్టారు.
గురు గోబింద్ సింగ్ ఇచ్చిన దీవెనలు, అధికారంతో బందా సింగ్ బహదూర్ ఓ సైన్యాన్ని తయారుచేసి, మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. 1709 నవంబరులో మొఘల్ ప్రావిన్షియల్ రాజధాని సమానాను ముట్టడించి, విజయం సాధించి తన తొలి ప్రధాన విజయాన్ని నమోదు చేశారు.
పంజాబ్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక జమీందారీ వ్యవస్థను రద్దుచేసి, సాగుచేసుకుంటున్న రైతులకే భూమిని పంచిపెట్టారు. 1716లో మొఘలులు ఆయన్ను బంధించి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. రేపు (జూన్ 9) ఆయన వర్ధంతి.
(చదవండి: స్వతంత్ర భారతి: భారత రత్నాలు)