బీఎస్ఎన్లో ఉద్యోగం చేసి 2003లో రిటైరై..
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): ‘ఆ రోజు మీరు ఎవరో తెలియదన్నాను బాబు.. నేను ఇంకెన్నేళ్లు బతుకుతానో నాకు తెలియదు.. బతికినంత కాలం నువ్వు గుర్తుంటావు.., ఇంత చేసిన నీకు మేమేమి ఇవ్వగలం.. మేము పుట్టినప్పటి నుంచి నమ్ముకున్నది ఒక్కటే.. దీన్ని మాత్రమే నీకు ఇవ్వగలం..’ ఇటీవలే విడుదలైన మహర్షి సినిమాలోని ఈ డైలాగులు విన్న ప్రతి ప్రేక్షకుడూ రైతుల గురించి ఆలోచించకుండా ఉండలేడు. రైతు వేషధారణలో ఉండి ఈ పలుకులు పలికిందెవరో కాదు.. కర్నూలుకు చెందిన రంగ స్థల కళాకారుడు మిటికిరి గురుస్వామి. ఈయన పొలంలో ఉండి కథానాయకుడు మహేష్‌బాబుతో చెప్పిన డైలాగులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వెల్దుర్తికి చెందిన గురుస్వామి బీఎస్ఎన్లో ఉద్యోగం చేసి 2003లో రిటైర్డ్ అయ్యారు. ఇంటి సమస్యల నుంచి బయటపడడానికి నాటకరంగం వైపు అడుగులు వేశారు. అవే అడుగులు సాంఘిక నాటకాలు, లఘుచిత్రాలతో సినీ రంగంలోకి నడిపించాయి.
కుటుంబ నేపథ్యం..
వెల్దుర్తికి చెందిన ఆదెమ్మ, బాలన్న దంపతుల ఐదుగురు సంతానంలో గురుస్వామి ఒకరు. పెద్ద కుటుంబం కావడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవారు. వాటి నుంచి బయటపడేందుకోసం గురుస్వామి నాటకాల వైపు దృష్టి సారించారు. ఎస్ఎస్ఎల్సీ చదివిన ఈయన 1960లో ‘నేటి విద్యార్థి’ నాటకంలో మొదటిసారి నటించారు. 1964లో బీఎస్ఎన్లో చిరుద్యోగిగా చేరి సీసీఎస్‌గా 2003లో పదవీ విమరణ చేశారు. ఈ మధ్య కాలంలో చాలా నాటకాల్లో నటించారు. రిటైర్డ్ అయిన తర్వాత లఘుచిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కర్నూలు బాలాజీ నగర్లో నివాసం ఉంటున్నారు.
‘ఆయుష్మాన్‌భవ’ నటనతోనేసినిమా చాన్స్..
అజీజ్ దర్శకత్వంలో వచ్చిన ఆయుష్మాన్‌భవ లఘుచిత్రంలో గురుస్వామి, ఆయన మిత్రుడు పరమేష్‌శర్మ నటించారు. తర్వాత వీరు మహర్షి చిత్రం నిర్మిస్తున్న ఎస్వీసీ కార్యాలయానికి వెళ్లి తాము నటించిన ఆయుష్మాన్‌భవ చిత్రాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ హరికి చూపించి ఏదో ఒక అవకాశం ఇప్పిం చాలని కోరగా కో డైరెక్టర్ రాంబాబు ఆడిషన్స్‌కు పిలిచి ఓకే చేశారు. హీరో మహేష్‌బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి, కెమెరామెన్ మోహన్ ముందు వేషం కట్టగా వారు సంతృప్తి చెందడడంతో గురుస్వామికి మహర్షి సినిమాలో నటించే అవకాశం దక్కింది. చిత్ర యూనిట్‌తో మూడు నెలల పాటు ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిల్మ్ సిటీ, తమిళనాడులోని పొలాచి, కేరళలో జరిగిన సినిమా షూటింగ్లో 25 రోజలు పాల్గొన్నాడు. మంచి నటనతో చిత్ర యూనిట్‌తో పాటు ప్రేక్షకులను మెప్పించారు. కర్నూలు కళారంగానికి గర్వకారణంగా నిలిచారు.
మహర్షి సినిమా దర్శక నిర్మాతలతో గురుస్వామి, కుటుంబ సభ్యులు
కళారంగ ప్రతి కు‘రాయలసీమ రత్నం’ పురస్కారం
గురుస్వామి పలు పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించి మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. అసుర గణం, ఎవ్వనిచే జనించి, పుటుక్కు జర జర డుబుక్కుమే, యధారాజా త«థా ప్రజా, కుర్చీ తదితర సాంఘిక నాటకాల్లో నటించి మెప్పించారు. ప్రముఖ రంగస్థల కళాకారులు బుర్రా సుబ్రమణ్యశాస్త్రి, బీసీ కృష్ణ లాంటివారితో వేమన, సక్కుబాయి, చింతామణి లాంటి పౌరాణిక నాటకాల్లోనూ నటించి ఔరా అనిపించుకున్నారు. ప్రముఖ జాన పద రచయిత డాక్టర్ వి.పోతన్న రచించిన ‘ఎట్టా సేయాలబ్బా’లో నటించడంతో పాటు దాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేయించి నాగపూర్‌లో విదేశీయుల ముందు సైతం నటించి పేరు తెచ్చుకున్నారు. పూజ వర్సెస్ వంశీ, రామానుజాచార్యులు, సంకల్పం, రైతన్న, ఆయుష్మాన్ భవ తదితర లఘు చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. గురుస్వామి కళా ప్రతిభను గుర్తించిన కర్నూలు టీజీవీ కళాక్షేత్రం ‘రాయలసీమ రత్నం’ పురస్కారంతో సత్కరించింది.
గొప్ప అనుభూతిని ఇచ్చింది..
సినీ రంగంలో అవకాశం వస్తుందని ఊహించలేదు. సమస్యల నుంచి ఆలోచనలను మరల్చుకోడానికి నాటకరంగం వైపు అడుగులు వేసినప్పటికీ ఇష్టంతోనే నటించాను. వెల్దుర్తికి చెందిన వెంకట నరసు నాయుడి స్ఫూర్తితో బుర్రా సుబ్రమణ్య శాస్త్రి, బీసీ కృష్ణ, సంజన్న లాంటి ప్రఖ్యాత నటులతో కలిసి నటించడం ఎప్పటికీ మరిచిపోలేను. వెంకటనరసు నాయుడికి ఇచ్చిన రాయలసీమ రత్నం పురస్కారం నేను అందుకోవడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి. ఊహించని విధంగా మహర్షి సినిమాలో నటించే అవకాశం రావడం చాలా సంతోషాన్నిచ్చింది.– గురుస్వామి, కళాకారుడు